రమణాశ్రమ లేఖలు 76 బ్రహ్మోత్సవం 13-12-46
*రమణాశ్రమ లేఖలు 76 బ్రహ్మోత్సవం*13-12-46
https://bhagavanraman.blogspot.com/2019/07/76-13-12-46.html
అన్నా,
గత నెల 28వ తేదీకి సరియైన కార్తీక శుద్ధ పంచమినాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవ ప్రారంభంగా ధ్వజారోహణం జరిగింది. ఈ బ్రహ్మోత్సవంలో పదో రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు. ఆ ఉత్సవం ఈనెల ఏడవ తేదీన జరిగింది. ఏటేటా జరిగే ఈ ఉత్సవం పది రోజులూ, వచ్చేపోయే జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ జనమంతా భగవాన్ దర్శనార్థం కూడా రావటం మామూలు. కృత్తిక నక్షత్రం ఏనాడైతే, ఆనాడే దీపోత్సవం. దానికి నాలుగైదు రోజులు ముందునుంచే, జనసమ్మర్థం జాస్థి అవుతుంది కనుక, భగవాన్ మాతృభూతేశ్వర ఆలయం ముందున్న పాకలో
కూర్చునేవారు. ఈ సంవత్సరం *జూబిలీ హాలులో కూర్చుంటే బాగుండునని భక్తులంతా యోచించి, వానజల్లు కొట్టకుండా తడికలు కట్టి వసతి చేశారు. ఉత్సవం అయిదోనాడో, ఆరోనాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాన్, మూడోనాడే ఆ జూబిలీ హాలుకు మకాం మార్చారు. వర్షాలా హెచ్చు! వచ్చే జనంలో మూడువంతులు బీదవాళ్ళే. అందులో ముసలీ, ముతకా, పిల్లతల్లులూనూ._
https://www.facebook.com/359807631501891/posts/467704187378901/?app=fbl
_పదోరోజు సాయంత్రం దీపోత్సవం కనుక తొమ్మిదో రోజు రాత్రి రెండు గంటల నుండే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే జనం. తడిబట్టలతో, గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు. వారికి సునాయసంగా దర్శనం లభించేందుకు, హాలులో ఒక ద్వారం మూసి, ఒక ద్వారానికి అడ్డముగా సోఫా వేయించుకుని పడుకునేవారు భగవాన్. ఇప్పుడూ అలాగే చేస్తే మేలని మా తలంపు. వారికి మనవి జేసాము. "ఎందుకూ? యిక్కడ ఉంటే తీరిపోతుంది" అన్నారు భగవాన్._
_ఆ రాత్రంతా తుఫానల్లే గాలీ, వానా! నా గడియారం ఆగిపోయింది. ఆశ్రమానికి త్వరగా వెడదామని, ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నాను. రోడ్డు మీద జన కోలాహలం లేదు. వేళ కాలేదని, ఒరిగితే ఇట్టే ఒరిగితే కునుకుపట్టింది. ఇంతలో స్వప్నంలో వలె జనుల సందడి వినబడ్డది. ఉలికిపడి లేచాను. వాన తగ్గింది. గాలి తీవ్రతవల్ల మేఘం విచ్చింది. కిటికీలలో నుండి *చంద్రకిరణాలు గదిలో ప్రసరించినవి.* వేళ మించిందేమోనని, ఆతృతతో బయలుదేరి బయటికి వస్తే, *కలకలధ్వనితో కొండకాలువలు ప్రవహిస్తున్నవి.* రోడ్డంతా జలమయం. గబగబా వెళ్లి, హాల్లో గడియారం చూస్తే నాలుగున్నరయింది. భగవాన్ అక్కడలేరు. ఎక్కడున్నారని ఎవరినో అడిగితే "అరిగో పాకలో" అన్నారు. *"ఆ వానలో ఆ గాలిలో పాకలోనే ఉన్నారా?"* అంటూ, అటు వెళ్లి చూతునుగదా! *పైన దుప్పటైనా లేకుండా, సోఫామీద కూర్చున్నారు భగవాన్.* *షోడశకళా పూర్ణమైన సుధాకర బింబమువలె వదనమండలం చిరునవ్వు వెన్నెలలు విరజిమ్ముతూ, చూచే వారికి సుఖదాయకంగా ఉన్నది.* అగరవత్తుల ధూపం, పర్ణశాలంతా ఆవరించి నందనవనంలోని చందనతరువుల పరిమళమా? అన్నట్లు సువాసనలు వెదజల్లుతూ వున్నది._
రమణాశ్రమ లేఖలు 76 బ్రహ్మోత్సవం (తరవాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/07/76-13-12-46.html
__*ఎక్కడో పాలసముద్రం ఉన్నదనీ, అందులో శ్వేత దీపం ఉన్నదని, ఆ ద్వీపంలో శ్రీమహావిష్ణువుంటాడనీ, ఆ విష్ణువును సేవించే నిమిత్తం, దేవతలంతా చుట్టూచేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు.*_
_*అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను, విద్యుద్దీపకాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతదీపంగాను, అందున్న రమణపరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగాను, చుట్టూచేరి సేవించుచున్న భక్తబృందమే దేవతలుగాను నాకు అనిపించింది. ఆ దృశ్యం చూచి నా హృదయం పొంగిపోయింది.*_
_ఇంకా ఎన్నెన్నో తలంపులతో ఎదుటికి వెళ్లేసరికి, చిరునవ్వు నవ్వుట ఆరంభించారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. నమస్కరించి లేచానో, లేదో "జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించివేశారులే" అన్నారు భగవాన్. రెండు నెలలక్రితం, స్వర్ణోత్సవమప్పుడు, రోజుకన్నా ఒక గంట ముందే వేదపారాయణ ప్రారంభించటవల్ల మనం అంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం ముగింపయింది. "ఇప్పుడు అంతే అయిందిలే" అన్నారని, శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి, నా అజాగ్రత్తకు కించపడి "భగవాన్ ! రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి?" అన్నాను. "లేదు, లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. అందువల్ల; రెండింటికే ఇక్కడికి వచ్చాం. వానవల్ల ఇంకా గుంపులు రాలేదు" అన్నారు భగవాన్. "మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం" అన్నారొక భక్తులు. అంత నవ్వుకున్నాం._
_అంతా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూర్చుంటే; రామస్వామి పిళ్ళై, కుప్పుస్వామి అయ్యర్ వచ్చి సోఫాముందు నిలిచారు. "ఏమి? పారాయణ ఏమైనా ఉన్నదా?" అన్నారు భగవాన్. అవును స్నానానికి ఇంకా వేళ కాలేదు. *దేవారం చదువుతాం" అన్నారు పిళ్ళె. "సరే" నన్నారు భగవాన్. పాడటం ప్రారంభించారు. ముగిసేసరికి "స్నానానికి వేళయిం" దంటూ వచ్చాడు రంగసామి. మణివాచకులు వ్రాసిన "తిరువెంబావై" పాడుతామంటారు పిళ్ళె. "ఇరవై చరణాలున్నవి. అదంతా పాడేదాకా ఎవరుంటారు? వేళయిం" దంటూ, కాళ్లు సర్దుకున్నారు భగవాన్. ఆపుతామంటూనే "అణ్ణామలైయా" అనే ఒక చరణం పాడారు పిళ్ళె. దాని తాత్పర్యం ఇది. *"ఓ సఖీ, అరుణాచలేశ్వరుని పాదపద్మముల కాంతిచే నమస్కరించు అమరుల మకుట మణుల కాంతి క్షీణించి, మరుగైనట్లు ఉదయించు భానుకిరణముచే చీకటి విచ్చి, నక్షత్రముల కాంతి తగ్గియుండగా, స్త్రీయై, పురుషుడై నపుంసకుడై, దివ్యతేజోమయ అంబరమై వుండు ఆ పాదారవిందమును కొనియాడుకొనుచూ, పులతటాకమున నీది, నీరాడుదము లెమ్ము ."*
తిరువెణ్ బావై:
అణ్ణామలైయా నడిక్కమలం చెన్ఱిఱైంచుమ్
విణ్ణోర్ ముడియిన్ మణిత్తొ హై వీఱ ఱ్ఱ్రార్పోర్
క్కణ్ణారిరవి కదిర్ వందు కార్కరప్పత్తణ్ణారొళి
ముల్లంగి త్తారకైకళ్ దామకల
ప్పెణ్ణాకి యాణా యలియాయ్ ప్పిఱంగొళిశేర్
విణ్ణాకి మణ్ణాకి యిత్తనైయున్ వేఱాకి
క్కణ్ణా రముదముమాయ్ నిన్ ఱాన్ కళల్ పాడి ప్పెణ్ణే
యిప్పూంబునల్ పాయ్ దాడేలో రెంబావాయ్'.
ఆ పాట ముగింపు రావటం, భగవాన్ సోఫానుండి కాలు క్రింద పెట్టడం ఒకేసారి జరిగింది. 'నీరాడుదము లెమ్ము' అనేసరికి "ఇదిగో వెడుతున్నాను స్నానానికే" అని నవ్వుతూ లేచారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. *స్త్రీ పురుష నపుంసక మూర్తి కానీ పరతత్వం రమణ రూపంతో వచ్చినా* అరుణాచలేశ్వరుని అర్చించే విషయంలో, అబలాభావంతో మాటాడేసరికి, నాకెక్కడలేని సజాతిగర్వం వచ్చింది. *మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట. "అక్షరమణమాల" కూడా అబలాభావంతోటే వ్రాశారు భగవాన్.* ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా?_
_గత ఏడాది, ఈ కృత్తికోత్సవానంతరం అరుణాచలేశ్వరుడు గిరిప్రదిక్షణార్ధం వచ్చిన సందర్భంలో "అప్పకు పిళ్ళై అడక్కం" - *తండ్రికి బిడ్డ విధేయుడు.* అన్న భగవద్వాణి* పురస్కరించుకొని, లేఖారచన ఆరంభించాను. అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారుకదా? ఈ ఏడు కృత్తికోత్సవానికి, ఈ తిరువెంబావై పాటలో "ఓ సఖి నీరాడుదము లె" మ్మని పాడేసరికి; ఇదిగో వెడుతున్నాను స్నానానికే" నన్న ఈ భగవద్వాణిని పురస్కరించుకొని మళ్ళి వ్రాయటం కారంభించాను._
ఇక సెలవు
సోదరి.
*స్వర్ణోత్సవ సందర్భంగా నిర్మించబడ్డ పర్ణశాల.
*అరవపాట.
Comments
Post a Comment