రమణాశ్రమ లేఖలు 74 స్వర్ణోత్సవ వైభవం 8-9-46
రమణాశ్రమ లేఖలు 74 స్వర్ణోత్సవ వైభవం 8-9-46
https://bhagavanraman.blogspot.com/2019/07/74-8-9-46.html
సెప్టెంబరు ఒకటవ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ వ్రాయమని కొందరు స్నేహితులు కోరారు. అందువల్ల ఈ జాబు వ్రాస్తున్నాను. అయితే ఈ ఉత్సవం సందడిలో కార్యక్రమం నడిపిన వారికే సంగతులన్ని సరిగా జ్ఞాపకం లేవట. ఇక దవదవ్వుల నిలిచిన అబలకా అవగతం కావటం "విబుధవరుల వలన విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరతు" నన్న భాగవత వచనానుసారం ఏదో వ్రాయటానికి ఉపక్రమించాను.
ఉత్సవం ఇంకా 20 రోజులున్నదనగా సర్వాధికారి పట్నం నుంచి వచ్చారు. అప్పటికి నెల దాటింది వారు మధుర వెళ్లి. వారు పట్నం రాగానే అందరూ చేరి, ఏవేవో ప్లాను వేసుకున్నారుట గానీ ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా ఉత్సవ సన్నాహం అంతంత మాత్రంగా ఉన్నది. ఇంగ్లీషు పుస్తకం సావనీరు అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండేవారు ఎవరైనా ఉన్నారేమోగాని, హాలులో సంస్కృత శ్లోకాలు తర్జుమా చేయించే *నిమిత్తం భక్తుల ఇచ్ఛానుసారం పాత కాగితాలు తిరగేస్తూ నటనా మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్య స్వరూపులగు భగవాన్ తప్ప మిగతా వారికి ఈ ప్రమేయమే లేనట్లున్నది.* సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయటం ప్రారంభించారు. ఆఫీసులో ఏమి ఆలోచించారో, ఎవరి ప్రోద్బలమో గాని భగవాన్ వుండే హాలు నానుకొని కొండ వైపున పెద్ద పాకవేయటం మొదలు పెట్టారు. అప్పటికి దాదాపు నెలనుంచి *కృష్ణస్వామి బలహీనంగా ఉంటూ వచ్చారు. ఈ పాక ప్రారంభించారో లేదో వారికి ఎక్కడ లేని బలం వచ్చింది. నిచ్చెనెక్కటం, పాకకప్పటం, అన్నిటిలోనూ భాగస్తులే. పాక అయింది. కింద సిమెంటు చేయాలన్నారు. నీళ్లు చల్లడం దిమ్మిస కొట్టడం ఒక్క టేమిటి విశ్వరూపం ధరించారన్నమాట.* తోక ముడుచుకుని పిట్టవలే కూర్చునే హనుమంతుడు; వారధి దాటాలన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్లు, విజృంభించి చేయవలసిన పనులన్నీ చేశాడట. *భగవద్భక్తులకు పరోపకారమే పరమోత్సాహం కలిగిస్తుందనుటకివే నిదర్శనాలు.*
ఉత్సవం ఇరవైరోజులున్నదనగా పట్నం నుంచి నీవు వచ్చి చింతాదీక్షితులుగారి పాటలు, వ్యాసాలు, నా గొబ్బి పాట, స్వర్ణోత్సవంలోగా అచ్చువేయించి తెస్తానని తీసుకువెళ్ళావు గదా! ఆ తరువాత మురగనారు, మరికొందరు భక్తులు పాటలు, పద్యాలు వ్రాసి అచ్చుకు పంపారు. సంస్కృతంలో కపాలిశాస్త్రి వ్రాసిన శ్రీ రమణగీతాభాష్యం అచ్చయి వచ్చింది. ఆహ్వాన పత్రికలు ఇంగ్లీషులో అచ్చొత్తించిన యేబది బంగారు వర్ణపు చుక్కలతో చుట్టూ నింపి భక్తులకు పంపబడినవి.
రమణాశ్రమ లేఖలు 74 స్వర్ణోత్సవ వైభవం (తరవాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/07/74-8-9-46.html
ఏబదేండ్లకు పూర్వం గోకులాష్టమి రేపనగా భగవాన్ అఱయనినల్లూరు వచ్చారుట. ఆనాడాదివారము, అష్టమి సోమవారమున, కీలూరులో ముత్తుకృష్ణ భాగవతుల ఇంట కడుపారా భుజించి నవమి మంగళవారమున ఉదయమే ఈ అరుణాచల క్షేత్రమున అడుగు పెట్టిరట. నాడు మొదలు నేటి వరకు ఈ ఊరు నుండి కదలిపోలేదన్న విషయం అందరకు విశదమే. ఆ నవమి మంగళవారం అప్పుడు సెప్టెంబరు ఒకటవ తేదీ అయినదట. ఖండాంతర వాసులకూ తెలిసేందుకు ఈ సెప్టెంబరు ఒకటవ తేదీకే స్వర్ణోత్సవము నిర్ణయించిరి.
హిందూ సంప్రదాయానుసారం గోకులాష్టమి గడిచిన మరుసటి దినమే స్వర్ణోత్సవమని చెప్పవలసి వున్నది. ఈశ్వర చిద్విలాసమేమోగాని ఈ యేడు కూడా ఆగస్టు 19వ తేదీ సోమవారమే గోకులాష్టమి అయింది. మరునాడు మంగళవారము. ఆనాడు తమిళ సంప్రదాయానుసారం మాకిదే స్వర్ణోత్సవ దినమని రామస్వామి అయ్యరూ మరికొందరు భక్తులూ అరవంలో పాటలు, వ్యాసాలు వ్రాసి చదివారు. తెనుగు సంప్రదాయాన్ననుసరించి నవమి మిగులు ప్రాధాన్యం గనుక 21వ తేదీ బుధవారానికి యేబదేండ్లు పూర్తి అని ఆ రోజున సాంబశివరావుగారు భక్తి పూర్వకంగా తెనుగులో పుర్వులు వ్రాసింది ఒక ప్రార్ధనా శ్లోకం 'నీ పాదకమల సేవయు' అన్న భాగవత పద్యము వ్రాసి భగవానులకు సమర్పించారు. మరొకరు స్వయంగా పద్యాలు వ్రాసి చదివారు. ఆ తరువాత ఎందరో పద్యాలు, పాటలు, వ్యాసాలు వ్రాసి చదవటం ప్రారంభించారు. ఆ స్తోత్రపారాయణము అంతులేకుండా మొన్నటివరకు సాగుతూనే ఉన్నది.
23వ తేదీనుండే రైల్వే సమ్మె ప్రారంభం. భక్తులు ఎలా వస్తారా అని అనుకున్నాము. కొందరు భక్తులు 29వ తేదీకే కాట్పాడివరకు రైలులో వచ్చి ఆ తరువాత బస్సులలోను, లారీలలోను పడి ఎలాగో వచ్చి చేరారు. చవితికి గుళ్లో వినాయక పూజ జరిగింది. 'జూబ్లీహా'లని భగవాన్ పేరు పెట్టిన ఆ పాక ప్రక్కనే పెళ్లిపందిరట్లే పందిరి తయారయింది. కొందరు చాందిని కడితే బాగుంటుందన్నారు. కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగుంటుందన్నారు.
రమణాశ్రమ లేఖలు 74 స్వర్ణోత్సవ వైభవం (తరవాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/07/74-8-9-46.html
ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు. తెల్లవారితే ఉత్సవం, దాని గురించే రాత్రంతా మాట్లాడుకుంటూ ప్రొద్దుపోయి పడుకున్నాము. ఉషఃకాలం మామూలుగా అయిదింటికి పారాయణకు వెడితే "నా కర్మణా" ఇత్యాది చెపుతున్నారప్పుడే. రోజుకంటే ఒక గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం. విద్యార్థులు పూజాద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందుపెట్టి గుళ్లోకి తీసుకుని వెళ్లారు. మా అజాగ్రత్తకు సిగ్గుపడి పందిట్లోకి వచ్చి చూతుముగదా లక్షణంగా అలంకరించి ఉన్నది. అంత పాకకు చుట్టూ కుచ్చుల ఎర్రగుడ్డ, మామిడి తోరణాలు, పూల మాలలు ఏమేమో కట్టారు. బరోడా రాణి గుళ్లో దేవియోగాంబకు కట్టే నిమిత్తం సరిగె ముద్దగా ఉండే చీరలు ఈ మధ్యనే చాలా పంపింది. అవన్నీ విప్పి జూబ్లీ హాలని పేరుపొందిన ఆ పర్ణశాలలో ఉత్తర దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరము వలే చుట్టారు. లైట్లుముందవి ధగధగ లాడుతున్నవి. బరోడా రాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సహోదరుని ప్రశ్నిస్తే; భగవాన్ సోఫా చుట్టూ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన. భేష్ మంచిదన్నారు మరొకరు. రాత్రి తొమ్మిదింటికి చూస్తే ఏదీ లేదు. తెల్లవారుజామున ఐదింటికి ఇదంతా అమిరిందంటే, ఈ భక్త సోదరులు రాత్రంతా నిద్రపోలేదని నిర్ణయించుకోవాలి. ఇతర ప్రదేశాల నుండి ప్రేక్షకులు రాత్రికి రాత్రే ఎలా వచ్చారో యేమో! మూటాముల్లె దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా కూర్చున్నారు తిరునాళ్ల ప్రజలవలె, ప్రాతః కాలానికి.
భగవాన్ ఆరున్నరకే స్నానం ఆహారం ముగించుకొని; అరుణాచలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతిసోఫా శుద్ధఖద్దరు వస్త్రాలతో అలంకరించి
రాట్నం బొమ్మతో వున్న దేశీయ త్రివర్ణ పతాకం ఒకటి కొత్తగా కొని బాలీసుపైన కప్పి వుంచారు. ఇన్ని ధగధగల మధ్యన అది జాతీయతా గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా వున్నదనుట అతిశయోక్తి కాదు. అన్నా! అదేమి చిత్రమో గానీ ఈ సెప్టెంబరు రెండవ తేదీనే జవహర్ లాల్ అఖిల భారత ఖండమునకు ప్రధానమంత్రి పదవి వహించారు.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
ఏడు గంటలకల్లా జ్యోతిర్మయ దృక్కులతో బ్రహ్మాండ భాండమునే కప్పుతూ భక్తుల సేవగొని వారి ననుగ్రహించుటకు కౌపీనధారియగు భగవాన్ ఆ
వేదికమీద ఆసీనులైనారు. అలౌకికమైన, దేదీప్యమానమైన వారి ముఖవిలాసము భక్తులను ఆనందసాగరమున ఓలలాడించింది. *ఆనాటి మూర్తిని చూచిన వారిదే మహాభాగ్యము సుమా! "ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అన్న గీతావచనానుసారం నామరూప రహితుడగు భగవానుడే భూమి యందు అప్పుడప్పుడు మానవాకృతి నవతరించి, మనలో కలిసిమెలసి నటిస్తూ మనలను దుష్పథము నుండి మరల్చి సన్మార్గ వర్తులుగా జేసి శాంతి సుఖమును చవిచూపుననియూ, శ్రీరామచంద్ర, శ్రీ కృష్ణాద్యావతారములిట్టివే ననియూ; వాల్మీకి,వ్యాసాది మహర్షులు పురాణ రూపమున చాటించిరి. నేడు మనకిట్టి భాగ్యము లభించినది.* *అవతార పురుషుడు, జగద్గురువు వయిన శ్రీ రమణ పరమాత్మ యేబది సంవత్సరములుగా ఈ అరుణాచలక్షేత్రమున నిలిచి వీక్షణమాత్రముననే మానవుల పునీతులు జేసి రక్షించుచున్నాడు.* *ఆ పరమపురుషుని అనన్య భక్తితో సేవించిన వారికి మనౌపదేశముననే భందములు తొలగించి అక్షయమోక్ష సామ్రాజ్యమున నివాసము కల్పింపగలడు. అమూల్యమైన కాలం వృధాపుచ్ఛక భక్తితో వారిని సేవించుటే మన కర్తవ్యము.* వారీ గురుస్థాన మలంకరించి యేబది వత్సరములులైనదని ఈ స్వర్ణోత్సవమే చాటుచున్నది.
ఇది స్వర్ణయుగమని, నవయుగమని, భక్తులెందరో పొగడుచున్నారు. ఇంత కాలముగా ఎందరో పుణ్యాత్ములు వారి కృపకు పాత్రులై శాంతి సుధను పానమొనర్చి ధన్యులైనారు, కానున్నారు. *నేనో నేటి వరకు సరిగా కన్ను తెరిచి వారి అవతారతత్వము పూర్ణముగా గ్రహించి అనన్యభక్తితో శరణు పొందలేకున్నాను. నావంటివారు అనేకులుంటారు. మా అశక్తతను గ్రహించి ఈ దయామూర్తి అనేక విధముల సేవకు అవకాశమిస్తున్నాడు.* ఆ అవకాశములలో కెల్ల అమోఘమైన అవకాశమే ఈ స్వర్ణోత్సవమని నా ఊహ. ఏమిచ్చి పూజింపవలెనో తెలియలేనైతిని. *సర్వవ్యాపియై, సనాతనమైన, అవాజ్ఞ్మానసగోచరమైన పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడగలం చెప్పు? ఆ మౌనస్థితిలో నుండుటే వారికి సరియైన పూజ.* ఆ పూజ నా కందనందున దవ్వుదవ్వుల నిలిచి వారి పాదధూళి చేతనే నా జన్మ పావనమగునని తలచి సంతృప్తి పడితిని. ఈ యవతారమున చిరకాలమిట్లే నివసించి భవతాప తప్తులగు జీవులకు కృపావీక్షణామృతమిచ్చి రక్షింపుడని ప్రార్ధించుట కంటే చేయగలిగేదేమున్నది.
ఉదయం ఏడు గంటలు మొదలు రాత్రి ఏడుంపావు వరకు జరిగిన కార్యక్రమం మరొక జాబులో వ్రాస్తాను.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment