రమణాశ్రమ లేఖలు 72 ఉపదేశసారం - ఉన్నది నలువది 27.8.46.
రమణాశ్రమ లేఖలు 72 ఉపదేశసారం - ఉన్నది నలువది 27.8.46. https://bhagavanraman.blogspot.com/2019/07/72-27846.html
భగవాన్ మలయాళ భాషలో వ్రాసిన ఉపదేశ సారం కుమ్మిపాట శ్రీవారే తెలుగక్షరం లో వ్రాసి ఉంచారు. నేను 1944 ప్రాంతంలో అది కాపీ చేసుకుంటాను అని శ్రీ వారిని అడిగి తీసుకొన్నాను. నా పుస్తకంలో వ్రాసుకున్న తరువాత ఆ పుస్తకం తిరిగి యిస్తుంటే చూచి ఒక భక్తుడు "మురుగనారు దారుకావన తాపసులను అనుగ్రహించిన శివలీలలను గురించి పాడినప్పుడు కదా భగవాన్ ఉపదేశసారం వ్రాసింది?" అని శ్రీవారినే అడిగాడు.
https://www.facebook.com/359807631501891/posts/472883566860963/?app=fbl
"అవును! అయితే వారు పాడింది ఒక దారుకావన తాపసులను అనుగ్రహించిన గాథ మాత్రమే కాదు. భగవదవతారములన్నీ నా పరంగానే నూరు పాటల్లో వ్రాయాలని సంకల్పించారు. 'ఉందీపరా' అనే జానపదగీతం తీసుకొని డెబ్బదివరకూ వ్రాశారు. ఆ డెబ్బదిలో కడపట దారుకావన తాపసులను అనుగ్రహించెడి గాథ వచ్చింది. కథంతా వారు చెప్పి ఆ ఉపదేశ భాగం మిగతా ముప్పది పాటల్లో నన్ను వ్రాయమన్నారు. అంతా మీరే చెప్పారు గదా! నేనేం వ్రాసేదీ? మీరే వ్రాయండి, అంటే ఎన్నాళ్లకూ వ్రాయనేలేదు. ఉపదేశ భాగం భగవానే వ్రాయాలిగాని నా వల్ల ఏమవుతుంది? అని పట్టుబట్టారు. ఏం చేసేది వ్రాయక తప్పలేదు. ఆ ముప్పదీ వ్రాసిన తరువాత "ఉపదేశ ఉందియార్" అని పేరు పెట్టాము. అది ముగిసిన తరువాత రామయోగి "నాకు తమిళ్ తెలియదే,తెలుగులో వ్రాయం"డని తొందర చేస్తే ఆ ద్విపదలు వ్రాసాను. ఆ తరువాత నాయన 'సంస్కృతమో' అన్నారు. సరేనని అదీ వ్రాశాను. ఈ మూడు భాషల్లో వ్రాసిన వెనుక కుంజూ, రామకృష్ణ వాళ్ళంతా మలయాళమో అంటే కుమ్మిపాటగా ఆ భాషలోనూ వ్రాశాను" అని సెలవిచ్చారు భగవాన్.
"అయితే, మూలం తమిళ్, రెండవది తెలుగు, మూడు సంస్కృతం, నాలుగు మలయాళమూనా?" అన్నానేను. "అవును" అన్నారు భగవాన్. "ఉపదేశసారం శ్లోకాలు చూడగానే నాయన సంస్కృతంలో లఘువ్యాఖ్యానం వ్రాశారట కదూ?" అన్నాను. "నిజమే! వారు చూతగుహలో ఉన్నారప్పుడు. నేను శ్లోకాలు వ్రాసి పంపాను. నాయన, చుట్టూ ఉన్నవారితో 'ఇదిగో, ఇట్లా ఒక్క శ్లోకమైనా మనం వ్రాయగలమా అని చెప్పి శ్లాఘిస్తూ వెంటనే వచ్చిన గ్రహణపర్వంనాడు క్షణంలో లఘు భాష్యం వ్రాసి పంపారు. అది 1928 లో అచ్చయింది" అన్నారు భగవాన్.
రమణాశ్రమ లేఖలు 72 ఉపదేశసారం - ఉన్నది నలువది తరవాత భాగం https://bhagavanraman.blogspot.com/2019/07/72-27846.html
"'ఉన్నది నలుబది' వ్రాసిన క్రమమో" అన్నాను. "అదీ మురుగనార్ బలవంతం వల్లనే వ్రాయవలసి వచ్చింది. ముందు అరవంలో వ్రాశాను. అప్పుడు రామయోగి ఇక్కడే వున్నారు. వారు "తెనుగులో భావమైనా వ్రాసి ఇవ్వండ"ని అడిగితే ఆ వచనం వ్రాసాను. ఆ వెనుక మాధవుడు 'మళయాళమో' అన్నాడు. సరేనని 'కిళి' పాటగా ఆ భాషలో వ్రాశాను. అది సీసమాలికవలే ఉంటుంది. అది గూడా తెలుగక్షరంలో వ్రాసి ఉంచాను. కావాలంటే, కాపీ చేసుకోవచ్చును" అన్నారు భగవాన్.
"సంస్కృతం భగవానెందుకు వ్రాయలేదో?" అన్నాను. "అదా! అప్పుడు నాయన, లక్ష్మణశర్మ అంతా ఇక్కడే ఉన్నారు. వారు చూసుకోనీ మనకెందుకు? అని ఊరుకున్నాను" అన్నారు భగవాన్. "నాయన, ఉన్నది నలుబదికి శ్లోకాలు అప్పుడే వ్రాశారా?" అన్నాను. "లేదు, అప్పుడు అవి వ్రాస్తూ మురగనారూ, నేనూ వరుస కురుస్తూ ఉంటే నాయన వరుసక్రమానికి సలహా చెప్పారేగాని శ్లోకాలు వ్రాయలేదు. తరువాత శిరసీకి వెళ్ళిపోయారు. వారు అక్కడ ఉన్నారని విని విశ్వనాథం, కపాలి వెళ్లి వారి వద్ద కొన్నాళ్ళున్నారు. అంతలో లక్ష్మణశర్మ ఉన్నది నలుబదికి శ్లోకాలు వ్రాసి పంపితే సరిచూచి పంపవలసిందని నాయనకు పంపాం. అది చూచి 'ఇది దిద్దటం కంటే నేనే వ్రాసి పంపగలను' అని అది అట్లాగే త్రిప్పిపంపి విశ్వనాధుడు, కపాలిని పెట్టుకొని తమిళ్ పద్యాలకు సరిగ్గా శ్లోకాలు వ్రాసి పంపారు. వీరిది ఇట్లాగే ఉండిపోయింది. వారిది 'సద్దర్శనం'అనే పేరుతో అచ్చయింది. ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది.మనం ఏం జేస్తాం. ఆ సంస్కృతాన్ని అనుసరించే కపాలీ ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో భాష్యం వ్రాశాడు. ఆ తరువాత దాన్ని విశ్వనాధుడు అరవంలోకి అనువదించారు" అని చెప్పారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"అనుబంధం వ్రాసిన కారణం, దాని క్రమం ఏమిటి"అన్నాను? "అది ఒక్క కారణంగా వ్రాయలేదు. ఎప్పుడెప్పుడో ఎవరెవరో అడిగితే వారి వారికే
వ్రాసియిచ్చినవన్నీ అనుబంధంగా చేర్చాం. మొదటి ముద్రణకు ముప్పదే. ఆ తరువాత నలుబది అయినవి. అవి ముందు అరవంలో వ్రాశాను. తరువాత తెలుగు, తరువాత మలయాళం వ్రాశాను. శ్లోకాలు పూర్వీకులగు పెద్దలని కొన్నీ, నేను స్వయంగా వ్రాసిన వచనాన్ని అనుసరించి లక్ష్మణశర్మ వ్రాసినవి కొన్నీను" అన్నారు భగవాన్. "భగవాన్ వ్రాసిన శ్లోకాలున్నూ వున్నవిగదా?" అన్నాను. "నేను వ్రాసిన రెండో మూడో ఉండాలి అంతే" నన్నారు భగవాన్. "తెలుగు పద్యాలున్నూ కొన్ని భగవాన్ వ్రాశారేమో?" అన్నాను. "ఏమో కొద్దిగా ఉండాలి. కావాలంటే వ్రాతప్రతిలో చూడండి. వివరం తెలుస్తుంది" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment