రమణాశ్రమ లేఖలు.63.తృప్తి 19.8.46
రమణాశ్రమ లేఖలు.63.తృప్తి 19.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/63-19846.html
లోగడ అచ్చయి వచ్చిన ఆరవ చతుర్వింశత్ ప్రూఫులు నాలుగుంటే బైండు చేయమని రాజగోపాలయ్యరుతో చెప్పారు భగవాన్. వారీ ఉదయం అన్ని సరిచేసుకుంటే చూచాను. మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి అట్టలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికంతా చూపి చెప్పి, ప్రక్కనున్న వైకుంఠ వాసరుతో నవ్వుతూ ఇట్లా అన్నారు భగవాన్. "పోనీ ఇవి బాగుచేస్తే నాలుగు బుక్కలవుతవి. మనం వాడుకోవచ్చను. లేకుంటే మనకు నాలుగు బుక్కలెట్లా వస్తవి? ఎవరిస్తారు? పుస్తకాలయంలో కొనుక్కోవాలి. కాసేది మనకు?" అందరికీ నవ్వు వచ్చింది. వైకుంఠవసరున్నూ నవ్వారు.
https://www.facebook.com/359807631501891/posts/480203926128927/?app=fbl
"ఏమయ్యా! నవ్వుతావు? నేనెం ఉద్యోగం చేసి నెలనెలా వందలకు వందలు జీతం తెస్తున్నానా? వ్యాపారం చేసి లక్షల కొద్ది సంపాదిస్తున్నానా? నాకేది కాసు? మనకెం స్వాతంత్రమున్నది? దాహం కావాలంటే నీళ్లకు మిమ్మల్ని అడగాలి. పోనీ వంటయింట్లోకి వెళ్లి అడుగుదామంటే ఓహో! యీ స్వామి అధికారం చేయటాని కారంభించాడే?' అంటారు. నోరెత్తగూడదు. మనకేం స్వాతంత్ర్యమున్నదయ్యా" అన్నారు భగవాన్.
తాము సర్వస్వతంత్రులయ్యు ఇట్లా అన్నారంటే మన బోంట్లకు తాకి రావాలనే గానీ వేరేముంది చెప్పు. ఇదే కాదు. మనమెప్పుడూ అది కావాలి, ఇది కావాలని కోర్కెలకు వశమై ఆహారాదులలో నియతి లేకుండా, యాచించో అధికారాన్ని ఉపయోగించో స్వేచ్ఛగా ప్రవర్తిస్తాం. భగవాన్ ఆ విషయాలలో అధికారం నిరసించుటేగాక, యాచనము కూడదని, నిర్దేశించినట్లు ప్రవర్తించిన మరొక విషయం వుంది. ఏమంటే మూడేళ్ళ క్రిందట ఒకనాటి ఉదయం; నేను హాల్లోకి వెళ్ళేసరికి సాత్వికాహారాన్ని గురించి, కృష్ణస్వామి, యేమో అడుగుతూ ఉంటే భగవాన్ ఇట్లా అంటున్నారు. (ఇంకా ఉంది)
రమణాశ్రమ లేఖలు.63.తృప్తి (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/07/63-19846.html
"నేను విరూపాక్షగుహలో ఉండగా అవసరాన్ననుసరించి సుందరేశయ్యర్ బిక్షకు వెళ్ళి అన్నం తెచ్చేవారు. ఒక్కొక్క రోజున ఆ బిక్షాన్నంలో కూరా, నారా ఏమీ ఉండేది కాదు. జనం జాస్తి గా వుండేవారు. అన్నం కొద్ది.ఏం జేసేది? ఆ అన్నం నేనే బాగా పిసికి వేడినీళ్ళు పోసి, జావల్లే చేసి అందరికీ ఒక్కొక్క గ్లాసెడు ఇచ్చి, నేనూ ఒక గ్లాసుడు తాగబోతే, ఉప్పయినా వుంటే బాగని తోచేదందరికి. కొనుక్కుందామంటే కాసేది? ఎవరైననా ఉప్పు కావాలని అడగాలి. అడగటం ప్రారంభిస్తే ఉప్పడిగిన నోట పప్పడగాలనీ పప్పడిగితే పాయసం కావాలనీ అనిపిస్తుంది. కాబట్టి ఆ తలపే కూడదని అట్లాగే త్రాగేవాళ్ళం. ఎంతో హాయిగా వుండేది. ఉప్పకూడా లేని సాత్వికాహారం గనుక శరీరానికి సుఖమే గాక, మనసుకున్నూ ఎంతో తృప్తిగా వుండేది" .
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
"ఉప్పుకూడా రాజస పదార్ధాలలో చేరిందేనా?" అన్నా నేను. "ఆహా సందేహ మేమీ? అదేదో గ్రంథంలో వున్నది చూచిచెపుతానుండండి" అన్నారు భగవాన్. "భగవాన్ చెపితే చాలదా! గ్రంథమెందుకు?" అన్నాను.
ఉప్పుమనాటం చేతకాలేదు. సరిగదా, కాస్త కారంగూడా వంటికి పడితే బాగాని తోస్తున్నది. ఇట్లా వున్నవి మన ఆహారాది నియమాలూ, నిష్టలును. మహానుభావులు లోకోపకారార్థం బ్రతకడానికి తింటారు. మనమేమో తింటానికి బ్రతుకుతాం. . ఇదే వ్యత్యాసం. బ్రతకటానికి తింటే రుచులతో పనిలేదు. తినటానికి బ్రతికితే ఎన్నో రుచులు. ఆ రుచులు కోసం ఎన్నో తిప్పలూను.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment