రమణాశ్రమ లేఖలు.96 ఏకాత్మ పంచకం 20.2.47


        క్రిందటి జాబులో తెలుగు వెణ్పాను గురించి వ్రాసి ఉన్నాను. భగవాన్ మరికొన్ని పద్యాలు వ్రాస్తే బాగుండునన్న ఆశ ఉన్నప్పటికీ , సమయం రానిది అడగరాదని అప్పట్లో ఊరుకున్నాను. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం, నేను వెళ్లేసరికి వెణ్పా ఛందస్సును గుఱించే ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్. నన్ను చూచి తెలుగు, తమిళ్ ఛందస్సుల తారతమ్యం వివరిస్తూ "గుహ నమశ్శివాయస్వామి రోజుకొక వెణ్పా వ్రాయాలన్న నియమం పెట్టుకున్నారట. ఏడాదికి మున్నూట అరవై అవుతవి. ఆ నియమంతో ఎన్నో వ్రాశారు. పోగా మిగిలినవి అచ్చు వేసారు భక్తులు. అవే ఎన్నో ఉన్నవిప్పుడు" అన్నారు భగవాన్. "భగవాన్ గూడా అట్లాగే వ్రాస్తే లోకుల కుపయోగం కదా?"  అన్నారా భక్తులు.  "ఏమో మనస్సు దాని మీదికి పోనూ  అంటుంది. ఏం చేసేది?" అన్నారు భగవాన్. ఇదే సందని "తిరిగి తెలుగులో ఒక్కటైన వ్రాయలేదే?" అన్నా చల్లగా."ఎందుకు వ్రాసేదీ? మచ్చుకని మూడు వ్రాసాను. చాలదా ఏమి" అన్నారు భగవాన్.'అంతేగా, మరి కొన్ని వ్రాసి చందస్సున్నూ తెలుగులో వ్రాస్తే, మా భాషకొక నూతన భాగ్యం లభిస్తుంది"  అన్నాను మళ్లీ. "సరిపోయింది. నేనేం పండితుణ్ణా యేమి? వ్రాయాలంటే భారతం, భాగవతం అన్నీ చదవాలి. అవన్నీ చదివానా పెట్టానా?  ఏ విషయం వ్రాసేదీ? అసలు వ్రాసేందుకు ఏమున్నది?" అన్నారు భగవాన్. ఈ దెబ్బ మనకే ననుకుని "భగవాన్ ఏది వ్రాస్తే అదే విషయం" అన్నాను. "మీరిన్ని పద్యాలు వ్రాస్తారే, చాలదా యేం?  కావాలంటే పెద్దబాలశిక్షగాని, సులక్షణసారంగాని తెచ్చుకోండి. గణాలు చెపుతాను. మీరే వ్రాయవచ్చు" నని గట్టిగా అన్నారు భగవాన్. "నా కేదీ వద్దు, భగవాన్ వ్రాస్తే చదువుతాను. లేకుంటే లేదు."  అన్నాను. నవ్వి ఊరుకున్నారు. 
     ఇక లాభంలేదని లేచి, ముందు వసారాలో కూర్చొని వ్రాసుకుంటున్నాను. దయామయులు గదా భగవాన్. నేను వెళ్ళగానే ఒక వేణ్పా వ్రాసి చదివారట హాల్లో. సాయంత్రం బయటికి వెడుతూ నా వైపు చూచి "ఇదిగో వేణ్పా. మరొకటి వ్రాసానిప్పుడు. ఇక్కడుంది . చూచుకోండి" అన్నారు నవ్వుతూ. మితిలేని సంతోషంతో కాగితం చూచి అక్కడే పెట్టాను. భగవాన్ వచ్చి, దానికి తమిళ్ అనువాదం వ్రాసి మురుగనారుతో "మనం తెలుగు బాగా చదివామా ఏం? ఎందుకు వ్రాసేదని చూస్తే ఊరుకోదు. ఎన్నో అడ్డంకులు చెప్పి చూచాను . ఒప్పదు. వ్రాయక  తప్పింది కాదు" అన్నారు. "భగవద్వాణి అట్లు రావలసి ఉన్నది" అన్నారు మురగనార్. ఆరు గంటలయింది. ఈ పద్యం రేపు కాపీ చేసుకుంటానని ఇంటికి వచ్చాను. మరు దినం ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళాను. చూస్తూనే "ఇదిగో, రాత్రి ఇంకొకటి కూడా వ్రాశాను. మొత్తం అయిదయినవి. ఆత్మపంచక మనవచ్చు గానీ  శంకరులున్నూ వ్రాశారది. అందువల్ల, దీనికి 'ఏకాత్మ పంచక'  మని పేరు పెడదాం. నెంబర్లు వేసే ఉంచాను. సరిచూచి కాపీ చేయవచ్చు" అన్నారు భగవాన్. 
         
      భగవాన్ ఆజ్ఞ ననుసరించి కాపీ చేశాను. అది చూచి చాలా మంది భక్తులు వ్రాసుకొని పాఠం చేశారు. ఈ మధ్యాహ్నం ఒక భక్తురాలు ఏకాత్మపంచకం హాల్లో పాడుట కారంభించింది. "తనలో తానువుండ" అన్న మూడవ పద్యం పాడగానే భగవాన్ నావైపు చూచి " ఇదిగో, ఈ సినిమా ఉపమానం. మనదేశంలో ఇంకా సినిమాలు రాకపూర్వం విరూపాక్షగుహలో ఉండగానే వ్రాసిపెట్టాను. శంకరుల కాలంలో సినిమాలు లేవు. అందువల్ల వారు 'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ' అని ఉపమానం చెప్పారు. ఈ సినిమాలుంటే అవన్నీ చెప్పేవారు కారు. మనకిప్పుడు సులభమైన ఉపమానం దొరికింది" అన్నారు.
           
                        తెలుగు వేణ్పా

                        ఏకాత్మ పంచకం 
                        
   1.     తన్ను మరచి తనువు తానై తలచి
           ఎన్ని జన్మము లెత్తి తుది - దన్ను 
           దెలిసి తా నౌట పలు దేశంసం *చార
           కల న్మే  ల్కనుట కను.
                 
  2. తా నుండి తానుగా దన్ను దా  నెనవ  
      డే నుండుస్థాన మేది? యను - వానికి
     "నే నెవ ? డెక్కడ నే నున్నా?" నన్న మధు
      పానుని యీడు పలుకు. 
  
3. తనలో దనువుండ దాను  జడమౌ
  .  తనవం దున్నట్టు తలచు - మనుజుడు 
     చిత్రములో నున్నది చిత్రమున కధార 
     వస్త్రమని   యెంచువాడు.
     
   4. పొన్నుకు వేఱుగ భూషణ  ముందునే?
     తన్ను విడిచి తను వేది? - తన్ను 
      దను వను వా వాడజ్ఞుడు.'తా' ననువాడు
      తను గనిన జ్ఞాని  ధరించు. 
      
  5 . ఎప్పుడు నున్నది యేకాత్మ వస్తువే 
       యప్పుడా వస్తువు నాదిగురు - చెప్పక 
        చెప్పి తెలియగ జేసినారే, ఎవరు 
        చెప్పి తెలుపుదురు చెప్పు. 
        
   ఏకాత్మ తత్వము నట్టిదని తేల్చి భక్త 
   దేహాత్మ భావము దీర్చెను - ఏకాత్మ 
   జ్ఞానస్వరూప రమణగురు నాథుడు తా
   నానతిచ్చు  పంచక మందు.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ