రమణాశ్రమ లేఖలు.95 తెలుగు వెణ్పా 15.2. 47
రమణాశ్రమ లేఖలు.95 తెలుగు వెణ్పా 15.2. 47
https://bhagavanraman.blogspot.com/2019/06/95-152-47.html
కొత్తగా అచ్చయి వచ్చిన 'తిరుచ్చుళి' తమిళ్ పురాణానికి త్యాగీ అనే పత్రికలో గత మాసమున సమీక్ష వ్రాసి ప్రకటిస్తూ, 'తిరుచ్చుళి వేణ్పా అన్తాది' అనే పుస్తకంలోని మూడు పాటలు ఉపమానంగా వ్రాసి అర్థం వివరించారు. సర్వాధికారి ప్రోద్బలం వల్ల, చదువుదామని ఆ పత్రిక పది రోజుల క్రితం భగవానుని అడిగి తీసుకున్నాను. ఆ వెణ్పా శ్లేషకవిత్వం భూమినాధుని స్తోత్రం కావటంవల్ల శ్రోతృప్రియంగా ఉన్నది. అదే చూస్తూ హాల్లో కూర్చుంటే, నాకర్థం కాదని గ్రహించి, ఆమూడింటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్. అందులో ఒక దాని తాత్పర్యం రాస్తున్నా చూడు. ★ ఓ భూమినాథా! నీవు త్రిపుర సంహార మొనర్చునప్పుడు ఎవరి సహాయమూ లేకుండా నీ అట్టహాసంవల్లనే జయం పొందావని దేవతలంతా నిన్ను 'అసహాయశూరుడ'వని స్తోత్రం చేశారు. నీవు అర్ధనారీశ్వరుడవుగదా, సహాయవల్లీ సహాయం లేనిది నీవేమి చేయగలవు? వామభాగం ఆమెది. ఆమె సహాయం లేనిది విల్లెక్కు పెట్టగలవా? మాతల్లి, సహాయవల్లీ సహాయం లేనిది నీవేమి చేయగలవయ్యా! అని ఒక అర్థం.'నీవు అచలస్వరూపుడవు గదా. శక్తి సహాయం లేనిదే ఏపని చేయగలవు? అందువల్ల నీవు అసహాయ శూరుడవు అనుట కల్ల. మా సహాయవల్లి సహాయం లేనిదే నీవేమి చేయలేవు' అని మరి ఒక శ్లేషార్థం. ఇంకా ఎన్నెన్ని రకాలుగానో విశేషార్థాలు వ్రాశారందులో" నని భక్తిపరవశులైనారు సుమా భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/450875689061751/?app=fbl
ఆ మర్నాడే వెణ్పా అన్తాది పుస్తకం ఆ పత్రిక సంపాదకులవద్ద నుండి వచ్చిందిట. మధ్యాహ్నం రెండున్నరకు నే వెళ్ళగానే "అన్తాది పుస్తకం వచ్చింది" అన్నారు భగవాన్. చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ "నాయన సంస్కృతంలో వెణ్పా వ్రాయాలని ప్రారంభించారు. ప్రాస సరిగా రాలేదు. 'ఆర్యావృత్తం' కంటే కష్టమని వదిలేశారు. ఇది శుక్ల చందస్సని వారు అన్నారు. లక్ష్మణశర్మ 'ఉన్నది నలుది' సంస్కృతంలో వెణ్పాగానే వ్రాశారు ముందు. ప్రాస , గణాలు సరిగ్గా లేవు. మంగళ శ్లోకం మాత్రం నేను దిద్దాను. తెలుగులో నరసింగరావూ వ్రాశాడు. అవీ సరిగా లేవు" అన్నారు భగవాన్. "తెలుగులో ఈ చందస్సు లేనందున కుదరలేదు కాబో" లన్నాను. "అవును, తెలుగులో లేదుగదా?-కష్టమే. వ్రాసి ఉండవచ్చు. ఏమో, ఎందుకని ఊరుకున్నా" అన్నారు భగవాన్. నేనెంతో కించతో "భగవాన్ తెలుగులో వ్రాయుటే మానినారుగదా?" అన్నాను. "గణాలు చెపితే మీరే వ్రాయవచ్చు . నేనెందుకు వ్రాసేది?" అన్నారు భగవాన్. "నాకు, మామూలు చందస్సే తెలియదే . ఇది యేవిధంగా తెలుస్తుంది? నాయనకే కుదరలేదన్నారు. మరెవ్వరికి కుదురుతుంది? భగవానే వ్రాయాలి. సూత్రప్రాయంగా ఉండే భగవద్రచనలు ఆనందదాయకం కదా! అనుగ్రహించా' లని ప్రార్థనా పూర్వకంగా వేడుకుంటున్నాను. ఊ లేదు, ఆ లేదు. మౌనం వహించారు. ప్రాప్తం లేదని వెణ్పా పుస్తకం తీసుకుని నిరాశతో ఇంటిదారి పట్టాను. (ఇంకా ఉంది)
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
రమణాశ్రమ లేఖలు.95 తెలుగు వెణ్పా (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/06/95-152-47.html
ముణ్ణాళ్ళు గడిచిన వెనక భగవాన్ చిన్నచిన్న కాగితాలు నాకిచ్చి "మొన్న మనం తెలుగు వెణ్పాను గురించి మాట్లాడుకున్నామా, మర్నాడే ఈ మూడూ తెలుగులో ముందు వ్రాసి, అరవంలోకి అనువదించాను. చూడండి. శంకరాభరణరాగంతో ఇలా గణముల ననుసరించి నిలిపి, నిలిపి చదవా" లని పాఠం చెప్పినట్లు చెప్పారు.
"ఇలాగే మరికొన్ని వ్రాసి అనుగ్రహించా"లని వేడుకున్నాను. "చాలు, చాలు. తెలుగులో ఈ చందస్సు లేదు. ఎవరన్నా వింటే నవ్వుతారు. విషయం గూడా ఏమీ లేదు. మామూలు మాటలే" అన్నారు భగవాన్ . "భగవద్వాణికి విషయం వేరే కావాలా. ఏది వస్తే అదే విషయం. అదే వేదం. తెలుగులో ఇది లోగడ లేకుంటే భగవాన్ సృష్టించరాదా?" అన్నాను. మురుగనార్ నా పక్షం వహించి "అప్పుడప్పుడు ఇలాగే వ్రాస్తుంటే అదొక గ్రంథమౌతుంది. ఆ భాషకొక నూతన చందస్సు వస్తే మంచిదే కదా" అన్నారు. భగవాన్ పలకలేదు.
ఆ మూడు వెణ్పాలూ అప్పుడే కాపీ చేసుకున్నాను.
1. ఎప్పుడు నున్నది యేకాత్మ వస్తువే
యెప్పుడా వస్తువు నాది గురు - చెప్పక
చెప్పి తెలియగ జేసినారే యెవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .
2. తానుండి తానుగా తన్నుతా నేనెవ
డేనుండు స్థాన మెదియను - వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్నమధు
పానుని యీడు పలుకు.
3. తన్ను మఱచి తనువుతా నైతలచి
. యెన్నియో జన్మము లెత్తితుది - తన్ను
తెలిసి తా నౌట పలు దేశసంచార
కలన్మేల్కనుట కను.
T.Me/BhagavanRaman
★ తిరుచ్చుళి దేవాలయంలో ఈశ్వరుని పేరు భూమినాథుడు. దేవి పేరు సహాయవల్లి ఈ స్థలపురాణం 'త్రిశూలపుర మహాత్య' మను పేర స్కాందపురాణాంతర్గతమై ఉన్నది.
Comments
Post a Comment