రమణాశ్రమ లేఖలు 92. ఆదరణ 10.2.47
రమణాశ్రమ లేఖలు 92. ఆదరణ 10.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/92-10247.html
ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుదుచ్చేరి నుండి ఫ్రెంచి స్త్రీలు ముగ్గురు కారులో వచ్చారు. ఒకామె గవర్నర్ భార్య. మరొకతె సెక్రటరీ భార్య. వారి తాలూకే ఇంకొకామె. భోజనానంతరం విశ్రమించి, రెండున్నర గంటలకు, హాలుకు వచ్చారు. ఇద్దరూ క్రింద కూర్చోలేక భగవాన్ సోఫా ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు. ఒకామె మాత్రం ఎలాగో క్రిందనే కూర్చున్నది. మూడు గంటలు కాగానే ముగ్గురూ లేచి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయినారు. అది చూస్తే లోగడ జరిగిన సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చినవి. అమెరికన్ యువతి కాళ్ళు చాచటం, సమీపవర్తులు వద్దనటం, భగవాన్ అవ్వయార్,నామదేవుల కథలు చెప్పి మందలించడం ముందు వ్రాశాను కదా? మరి రెండిప్పుడు వ్రాస్తున్నాను.
https://www.facebook.com/359807631501891/posts/453424405473546/?app=fbl
దాదాపు పది నెలల క్రితం, ఫ్రెడ్ మెన్ అనే ఐరోపియునితో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు ఇరువది రోజులున్నదిక్కడ. పాశ్చాత్యపద్ధతి ననుసరించి క్రింద కూర్చోవటమే అలవాటు లేని ఆమెకు వయసూ అధికం కావటం వల్ల కూర్చోలేక, కూర్చుంటే లేవలేక అవస్థ పడేది. చెయ్యిపట్టి లేవదీసేవాడతడు. ఒకనాటి ఉదయం ఎనిమిదింటికి నేను వెళ్ళేసరికి,ఆడవాళ్ళ స్థలంలో ముందువైపున ఇద్దరూ కలసి కూర్చున్నారు. మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే, 'అయ్యా, అటు జరగండి' అని సంజ్ఞ చేసాను. వెంటనే జరిగాడు. భగవాన్ కళవళపడుతూ, నా వైపు చూసారు . ఎందుకో అర్థం కాలేదు. ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను. ఫ్రెడ్ మెన్ తటాలున లేచి ఆమె చెయ్యి పుచ్చుకొని లేవదీసాడు. ఆమె కళ్ళు నీళ్ళతో నిండినవి. అడగలేక, అడగలేక భగవానుని సెలవ్ అడిగింది భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది. అనుజ్ఞ చిహ్నంగా తల ఆడించారు. వాళ్లటు పోగానే భగవాన్ నావైపు చూచి, "పాపం,వాళ్లు ఊరికి,పోతున్నారు" అన్నారు. నాకేదో అపరాధం చేసినట్లు తోచి, "నాకా సంగతి తెలియదే? అయ్యో" అన్నాను. పొరపాటు తెలుసుకున్నానని, పశ్చాత్తాపం చెందుతున్నాననీ, భగవాన్ గ్రహించి "అది కాదు, వాళ్లు క్రింద కూర్చోటానికి ఎంతో కష్టపడతారు. అందుకే చాలా మంది ఇక్కడకు రావాలని కూడా రాక ఊరుకున్నారు. అభ్యాసం లేనిదే క్రింద కూర్చోలేరు. ఏం చేస్తారు పాపం" అని సమాధానంగా మాట్లాడి విరమించారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
కొంతకాలం క్రిందట ఒకనాటి ఉదయం, కడు బీద వృద్ధురాలొకామె బంధువులతో వచ్చింది ఇక్కడికి. అంతా నమస్కరించి కూర్చుంటే, ఆమె అట్లాగే నిలుచుంది. "కూర్చోండమ్మ"అన్నాడు కృష్ణస్వామి. కూర్చోలేదు. వాళ్ళ వాళ్ళు పిలిచారు. పోలేదు. నేనూ చెప్పాను కదల్లేదు. "ఇందరు చెబుతుంటే వినరాదూ? " అని గద్దించారొకరు. ప్రశ్న సూచకంగా వాళ్ళ బంధువుల వైపు చూచాను? "ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు. దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలంటుంది" అన్న దొకామె. నేను లేచి, ఆ వృద్ధురాలి చెయ్యి పట్టుకుని భగవాన్ సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళాను. చేయి కంటి రెప్పపైన అడ్డంగా పెట్టుకుని, భగవానుని పరికించి చూచి '"అయ్యా నాకు కళ్ళు సరిగా కనపడవు మనసు లోనే మిమ్మల్ని చూచేట్టు అనుగ్రహించండి స్వామీ" అన్నది. భగవాన్ కృపాపూరిత దృక్కులతో "సరి,సరి" అని సెలవిచ్చారు.
వాళ్ళటు పోగానే, భగవాన్ మా వైపు చూచి "పాపం ఆమెకు కళ్ళు సరిగా కనపడవు. దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమోనని భయం. ఏం చేస్తుంది? అట్లాగే నిలబడింది. కళ్లులేని వాళ్ళకు మనస్సే కన్ను. ఒకే చూపు. ఇన్ని చూపులు ఉండవు. ఆ మనస్సు కుదరాలి కానీ, కుదిరితే మన కన్నా వాళ్ళపనే మెరుగు" అన్నారు . ఎంత చల్లని మందలింపో చూచావా?
T.Me/BhagavanRaman
Comments
Post a Comment