రమణాశ్రమ లేఖలు 90 జ్ఞానుల మనస్సు బ్రహ్మమే 8.2.47
రమణాశ్రమ లేఖలు 90 జ్ఞానుల మనస్సు బ్రహ్మమే 8.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/90-8247.html
ఈ ఉదయం ఏడున్నర గంటలకు వెళ్ళాను. హాలంతా నిశ్శబ్దంగా ఉన్నది. అగరవత్తుల ధూపం కిటికీలలో నుండి బహిర్గతమై, నూతనాగతులగు పాంధులకు భగవాన్ ఇక్కడే ఉన్నారని తెలియజేస్తూఉన్నది. లోపలికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను. బాలీసునానుకుని పడుకున్న భగవాన్ లేచి పద్మాసనస్థులై కూర్చున్నారు. క్షణంలో, వారి దృష్టి అచంచలమై ప్రకాశిస్తూ, హాలంతా వింత కాంతితో నింపివేసింది. అనిమేష నయనాలతో,ఆ మహాభాగుని చూస్తూ మైమరచి కూర్చున్నాను. ఉన్నట్లుండి ఒకరు "స్వామీ, జ్ఞానులకు మనసు ఉన్నదా? లేదా?" అని అడిగారు.
https://www.facebook.com/359807631501891/posts/454772515338735/?app=fbl
భగవాన్ ప్రసన్న దృష్టితో వారి వైపు చూచి, "మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకొనుట అనేది ఉండదు. మనసంటూ ఉంటే తెలుసుకొనుట అనేది ఉన్నది. మనస్సు ఒక ఉపాధి నాశ్రయించి ఉంటుందిగాని, ఉపాధి లేనిదే మనస్సు లేదు. ఉపాధిని నిర్దేశించి కదా జ్ఞాని అని చెప్పగలం? ఉపాధి లేకుంటే ఇతడు జ్ఞాన అని అనటం ఎలా? అయితే మనస్సే లేనిది ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది? చేయదు. అందువల్ల జ్ఞాని యొక్క మనస్సే బ్రహ్మమని చెప్పబడుతుంది. జ్ఞాని సదా బ్రహ్మమునే చూస్తుంటాడు. మనస్సు లేనిదే చూడటం లేదుగదా? అందుకే, జ్ఞానులు మనస్సు బ్రహ్మకారంగా ఉంటుందని చెపుతారు. వాస్తవానికి వారి మనస్సే బ్రహ్మము. అజ్ఞానికి బ్రహ్మము లోనే తానున్నప్పటికీ అది తోచక వెలివృత్తులే గోచరించినట్లు, జ్ఞానానికి శరీరం వెలివృత్తిలో వర్తించినా బ్రహ్మమే సదా గోచరిస్తుంది. ఆ బ్రహ్మము అంతటా నిండి ఉన్నదే. ఆ బ్రహ్మంలో లీనమైన తరువాత, బ్రహ్మాకారమైన మనస్సనటం, సముద్రాకార నది అన్నట్లుంటుంది. నదులన్నీ సాగరం లో చేరిన వెనుక ఒకే జలమయం కదా? అందులో ఇది గంగా, ఇది గౌతమి, ఇది అంత వెడల్పు, ఇది అంత పొడుగు అని నిర్ణయించగలమా? అలాగే ఇదీను" అన్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
"సత్త్వమే బ్రహ్మం. రజస్తమోగుణాలు ఆభాస అంటారే?" అన్నారింకొకరు. "అవును, సత్తే వున్నది. సత్తే సత్త్వం. అది స్వాభావికమైనది. అతి సూక్ష్మమైన మనస్సంచరణమే రజస్తమోగుణ సంపర్కంవల్ల ఇన్నిరకాల లోకాన్ని సృష్టిస్తోంది. రజస్తమోగుణ సంపర్కం వల్లనే ఆభాసయైన జగత్తును చూచి మనస్సు భ్రాంతి చెందుతుంది. ఆ సంపర్కం తోసివేస్తే సత్త్వం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. దాన్నే శుద్ధసత్త్వ మంటారు. బహు సూక్ష్మమైన మనస్సుతో విచారించి తోసివేస్తేగానీ ఈ సంపర్కం పోదు. వాసనలన్నీ అణిగి అతిసూక్ష్మం కావాలి మనస్సు. సూక్ష్మాతి సూక్ష్మమన్నమాట. 'అణోరణీయాన్' అన్నారు. అణువుకు అణువుగా కావాలి. అణువుకు అణువై అణిగితే 'మహతో మహీయాన్' మహత్తుకు మహత్తుగా లేస్తుంది తానే. అది చూడటమో, పొందటమో, ఏదో అనుకోండి. ఏమనుకున్నా సరే. నిద్రపోతాము. మనస్సు, సర్వవృత్తులతో హృదయమందణుగుతుంది. అప్పుడేం కనపడుతుంది? ఏమీ లేదు . ఎందువల్ల? మనస్సు అణిగినందువల్ల . లేస్తాము. ఆ లేచిందే మనస్సు సత్తూ, బ్రహ్మమూను. ఆ లేచిన మనస్సు గుణాలతో కూడిన వెంటనే సమస్తం తోసేస్తుంది. ఆ గుణవికారాలు తోసివేస్తే, 'అహమహ' మని తానుగా ప్రకాశిస్తూ సర్వత్రా బ్రహ్మమే గోచరిస్తుంది. అప్పుడు అంతా తన్మయంగా గోచరిస్తుంది. వేదాంత పరిభాషలో చూడండి, బ్రహ్మవిత్, బ్రహ్మ విద్వరిష్ఠ ఇత్యాదులన్నీ చెప్పి బ్రహ్మైవ భవతి - బ్రహ్మమే తాను అన్నారు చివరకు. అందువల్ల జ్ఞానులు మనస్సే బ్రహ్మము" అన్నారు భగవాన్.
"జ్ఞానే అన్నిటియందు సమతతో వర్తిస్తాడు అంటారు గదా?" అన్నారింకొకరు. "అవును వర్తించుటయేమి, మైత్రీ, కరుణ, ముదిత, ఉపేక్షాది భావాలు వారికి సహజంగా ఉంటవి. *ఉత్తములందు ప్రియం దీనులందు కరుణ సత్కార్యాచరణ మన్న సంతోషం దుష్టులందు ఉపేక్ష వారికి సహజలక్షణం" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
*మైత్రీకరుణాముదితో పేక్షణం, సుఖదుఖ, పుణ్యాపుణ్య విషయాణం భావనాత్తశ్చిత్త ప్రసాదనమ్ (పతంజలి యోగసూత్రం).
Comments
Post a Comment