రమణాశ్రమ లేఖలు 86. జ్ఞానసంబంధ మూర్తి 1.2.47

రమణాశ్రమ లేఖలు 86. జ్ఞానసంబంధ మూర్తి  1.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/86-1247.html
    భగవాన్ "ద్రవిడ శిశుః" అంటే సంబంధులేనని తమిళ్ భాషలో వ్రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన తరువాత హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవాన్ నుద్దేశించి "వారికి 'ఆళుడ్య పిళ్లైయార్' అని గదా మొదటి పేరు. జ్ఞానసంబంధమూర్తి అన్న నామాంతరం కలిగింది? ఎందుకు కలిగింది?" అన్నారు. "అదా! దేవి అనుగ్రహించిన పాలు త్రాగగానే జ్ఞానసంబంధం ఏర్పడుటవల్ల  జ్ఞానసంబంధమూర్తి నాయనారనే పేరు కలిగింది. అంటే,గురుశిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయమైనది గదా? అందువల్ల. నాటినుండి ఆ ప్రాంతములందున్న వారంతా ఆ పేరుతో పిలవసాగారన్నమాట. అదే కారణం" అన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/458075825008404/?app=fbl
    "భగవానుకువలెనే వారికీ సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయమైనదన్నమాట?" అన్నారు."ఊ-ఊ అందుకే కృష్ణయ్య, వారికీ నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు" అన్నారు భగవాన్. "రమణలీలలో సంబంధులు తిరువణ్ణామలకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో బోయలు సొత్తంతా దోచుకున్నారని" ఉన్నదే! వారు జ్ఞానదురంధరులు గదా? సొత్తేమున్నది వారికి?" అన్నాను. "అదా! వారు భక్తి మార్గావలంబకులు గదా, అందువల్ల ఈశ్వరాదేశానుసారం వారికి బంగారు తాళములు,ముత్యాలపల్లకీ మొదలైన చిహ్నములు లభించినవి. ఒక మఠమూ సిబ్బందీ అన్నీ ఉండేవి" అన్నారు భగవాన్. "అట్లాగా! అవన్నీ, ఎప్పుడు లభ్యమైనవి?" అన్నాను. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
     భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో "వారు జ్ఞానసంబంధ నామధారులైన తరువాత అంటే ఆ పసితనమందే అనర్గళ కవితాధారతో పాడుతూ క్షేత్రాటన మారంభించి ముందు 'తిరుక్కోలక్కా'అనే క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించి తన చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు. ఈశ్వరుడది చూచి మెచ్చి బంగారు తాళములు వారికిచ్చాడు. నాటి నుండి వారు ఏది పాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఆ తాళములు వారి చేతులలోనే ఉండేవి. ఆ వెనుక వారు చిదంబరం మొదలైన కొన్ని కొన్ని క్షేత్రాలు చూచుకుని 'మారన్ పాడి' అనే క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఈ రైళ్ళు లేవుగదా! ఈ పసిబాలుడు కాలినడకనే క్షేత్రటన చేస్తూ రావటం గమనించి ఆ క్షేత్రాధిష్ఠాన దైవమగు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయినది. వెంటనే ఒక ముత్యాలపల్లకీ, ముత్యాలగొడుగూ, ముత్యాలతోకూర్చిన తదితరములుగు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్లుగా కల్పించి కోవెలయందుంచి అక్కడి బ్రాహ్మణులకూ, సంబంధాలకూ  స్వప్నమున తోచి 'అవి సంబంధువులకు సన్మానపురస్సరంగా ఈయవలసిన' దని బ్రాహ్మణులకూ, 'వారిస్తారు, తీసుకొమ్మ'ని  సంబంధాలకూ చెప్పి పల్లకి మొదలయినవి ఆ బ్రాహ్మణులచేతనే వారికిపిస్తే వారది భగవత్ప్రసాదమున లభ్యమైనది గనుక తిరస్కరింపనొల్లక గ్రహించి, ప్రదక్షిణ నమస్కృతి పూర్వకముగా దాని నారోహించారు. నాటినుండీ వారెక్కడికి వెళ్ళినా ఆ పల్లకిమీదనే వెళ్లేవారు. క్రమంగా కొంత సిబ్బంది మఠమూ అన్నీ ఏర్పడినవి. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా గోపురదర్శనం అయ్యిందంటే, పల్లకీ దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవిలూరు నుండి ఇక్కడికి నడచి వచ్చారు. అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా" అన్నారు భగవాన్.  (ఇంకా ఉంది )

రమణాశ్రమ లేఖలు 86. జ్ఞానసంబంధ మూర్తి  (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/06/86-1247.html
  తమిళ్ భక్తులొకరు "వారు అరుణాచలానికి వచ్చిన సంభవం పెరియపురాణంలో విశదంగా లేదే" అన్నారు. "అవునవును పురాణాలలో లేదు సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్తవిలాసమునందున్నది. సంబంధులు అరయవివల్లూరు వచ్చి, విరాట్టేశ్వరుని దర్శించి పద్యకుసుమార్చలనచే ప్రీతుల గావించుకొని 
అతుల్యనాథేశ్వర సన్నిధి కరిగి, అక్కడా అదేవిధంగా పద్యాలు పాడి ఆ తరువాత ఆ స్థలమందుండే అరుణ గిరిశిఖరం మాలోకించి ఆనంద పరవశంతో పద్యములు పాడుటయేకాక ఆ స్థలమందు తామూ అరుణాచలేశుని  ప్రతిష్టించారు. ఆ తరువాత ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే, అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపమున ప్రత్యక్షమై, వెనుక ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున గోచరించాడు. ఆ విప్రుడెవరో వీరికి తెలియదు. ఆయన చేతిలో ఒక పూలబుట్ట కూడా ఉన్నది. ఆ కారణంగా సంబంధుల మనస్సు అయస్కాంతంవలే  ఆ విప్రునివైపుకు ఆకర్షింపబడింది. వెంటనే వందన పూర్వకంగా "అయ్యా! తమరెక్కడి నుండి దయచేశారు?" అన్నారు. "నేనా? అరుణాచలం నుండి వచ్చాను. ఇక్కడే మా ఊరు" అన్నాడా విప్రుడు. సంబంధులు చకితులై "అరుణాచలమా? తామిక్కడికి దయచేసి ఎంతకాలమైంది?" అన్నారు. ఆ విప్రుడు అలక్ష్యంగా 'ఎన్నాళ్లు ఏమిటి? అరుణాచలేశ్వరుని అర్పించే పూమాల కొఱకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి, పూలు సేకరించుకుని మధ్యాహ్నానికి అక్కడకు చేరుకుంటాను' అన్నాడు.  సంబంధాలాశ్చర్యంతో "అలాగా చాలా దూరమన్నారే?"  అన్నారు. 'ఎవరయ్యా చెప్పింది . ఒక్క అంగలో పోయి ఒక్క అంగలో రావచ్చును. ఏమంత బ్రహ్మాండం '  అన్నాడా విప్రుడు. అది విన్న సంబంధులకప్పుడు అరుణాచల సందర్శనోత్సుకత కలిగి,"అయితే నేను నడవగలనా?" అన్నారు. 'ఉస్సీ, ఇంత వయస్సయినవాణ్ణి, ఇంత వృద్ధుడను నేనే నిత్యం వచ్చిపోతాను, బాలుడువుగదా నీవు రాలేవా? ఏమయ్యా నీ మాటలు' అన్నాడా విప్రుడు. 

    సంబంధులు అత్యంత కుతూహలాయత్తచిత్తులై "అయ్యా! అలాగైితే నన్ను కూడా తమతో పిలుచుకొని పోండని" ఆ విప్రుని ప్రార్ధించి,వెంటనే పరివారసమేతులై బయలుదేరారు. ఆ విప్రుడు ముందు వీరు వెనుకగా పోతూ ఉంటే, మార్గమధ్యంలో ఆ విప్రుడు అదృశ్యుడైనాడు. వీరు అటూ ఇటూ చూస్తూండగా బోయదండొకటి  వీరిని చుట్టుముట్టి పల్లకి, గొడుగు బంగారు తాళములు ఇంకా తక్కిన ముత్యాల చిహ్నములు, మొదలగు సర్వ సంపద, భోజన సామాగ్రీ, ఒక్కటీ మిగల్చకుండా పై బట్టలతో సహా దోచుకున్నారు. అంతా కౌపీనమాత్రులై నిలవాల్సి వచ్చింది. దోవ తెలియదు, పైన ఎండ, అందరికీ ఆకలి వేళ, ఏం జేస్తారు?  సంబంధులు అప్పుడు 'ఈశ్వరా! ఇది యేమి పరీక్ష. నన్నేమి చేసినను తొందర లేదు. ఈ తోడి వారిని అలయింపనగునా?' అని ప్రార్థిస్తే, స్వామి, నిజరూపుచూపి 'అప్పా! బోయలు నా ప్రమధగణములే అరుణాచలం సన్నిధికి ఆడంబర రహితంగా పోవుటయే శ్రేయస్కరమని ఈ విధముగా చేశారు. అక్కడికి చేరగానే నీ సంపద నిన్ను చెందుతుంది. సందేహింప నక్కరలేదు. ఇప్పుడు మధ్యాహ్నమయింది. విందారగించి తరువాత వెళ్ళవచ్చును' అని చెప్పి అదృశ్యుడైనాడు. 

     వెంటనే ఒక సమప్రదేశమందు పెద్ద డేరా తోచింది. ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెడలివచ్చి, సంబంధులును అనుచర సమేతంగా తమ డేరాకు 
దయచేయవలెనని, ఆహ్వానించి, పిలుచుకొనివెళ్లి, సకలోపచారములు చేసి, షడ్రసోపేతంగా భోజనం పెట్టి, చందన తాంబూలాదులతో సత్కరించారు. నిత్యం తామే అతిథులందరుకూ విందు చేసే సంబంధులు, ఆనాడు ఈశ్వరుని యింట విందారగించారు. రవంత విశ్రమించిన వెనుక ఆ విప్రులందొకరు లేచి, 'అయ్యా! అరుణగిరికి పోదామా?' అన్నారు. సంబంధాలానందభరితులై  అనుచర సమేతంగా లేచి ఆ విప్రుననుసరించారు.  వీరు దారిబట్టగానే ఆ డేరా, ఆ జనం అదృశ్యమైనారు. అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగుపెట్టగానే ఆ మార్గదర్శి అదృశ్యమైనాడు. ఉన్నట్లుండి అన్ని మూలల నుండి ఒక్కొక్కరుగా బోయలు వెలువడి వచ్చి, ముందు దోచుకున్న సామానంతా వారి ముందు నుంచి అదృశ్యలైనారు. సంబంధలప్పుడు ఆనందబాష్పపూరిత నేత్రములతో పులకాంకిత శరీరులై, "ఆహా! ఏమి నా తండ్రికరుణ" అని  వినుతీస్తూ, కొన్నాళ్ళందు నివసించి, స్వామిని సేవించి, పద్యకుసమములచే పూజించి వెళ్ళారుట. పితృభావమున  సేవించుచున్న సంబంధులపై కల వాత్సల్యాతిశయమున ఈశ్వరుడు తానుగానే వారినిక్కడికి రప్పించుకున్నాడన్నమాట"  అంటూ భక్తిపూరిత హృదయమున గద్గద కంఠులై మరి మాట పెగలక మౌనం వహించారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ