రమణాశ్రమ లేఖలు 82 సుందరుల దాసపత్రం 27.1.47

రమణాశ్రమ లేఖలు 82 సుందరుల దాసపత్రం 27.1.47
https://bhagavanraman.blogspot.com/2019/06/82-27147.html
     నిన్న భగవాన్ సెలవిచ్చిన సుందరుల కథ నీకు వ్రాసిన  తరువాత వారి చిన్ననాటి చిత్ర చరిత్ర తెలుసుకోవాలన్న  కోరిక కలిగి ఈ వుదయం 7.30 కే శ్రీవారి సన్నిధికి వెళ్లాను. అప్పటికే కొండ దిగి వచ్చి, ఏదో పుస్తకం చూస్తూ కూర్చున్నారు భగవాన్. హాలులో అట్టేే జనం లేరు. నమస్కరించి లేచి "భగవాన్ చూచేది ఏ పుస్తకం అన్నాను?" "పెరియపురాణం, సుందరుల చిన్ననాటి చరిత్ర చూస్తున్నాను"  అన్నారు భగవాన్. "ఆ కథంతా చాలా చిత్రంగా ఉంటుంది కదూ?" అన్నాను. "అవును చూస్తారా ఏమి?" అన్నారు భగవాన్. "ఆశవుంది కాని అరవం సరిగా రాదే?"అన్నాను. "సరి,సరి, అయితే సంగ్రహంగా చెబుతా నుండండి" అని చిరునవ్వుతో ఇలా  చెప్పారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/461242628025057/?app=fbl
      "సుందరులు తిరుమునైప్పాడినాడులో, తిరునావరూర్ అనే క్షేత్రంలో ఆదిశైవమనే శివబ్రాహ్మణ కులమందు, చడయనారను శివాచార్యునకు, వారిపత్ని ఇశైజ్ఞానియారునకు జన్మించారు. తల్లితండ్రులు 'నంబియారూరర్'  అని నామకరణం చేసారు. వారు బాల్యమందొక నాడు చిన్నబండి ఒకటి పట్టుకొని వీధిలో ఆటలాడుతూ ఉంటే ఆ తిరుమునైప్పాడుకు రాజయిన నర్సింగ మునియరనే వారు చూచి కుర్రవానిపై ఆశ చెంది శివాచార్యులను సమీపించి ఆ కుఱ్ఱవాణ్ణి నా కి" మ్మని అడిగారు. 'సరే' నని వారిస్తే తీసుకుని వెళ్లి అభిమాన పుత్రుడుగా సాకుతూ వచ్చారు. సుందరులు రాజుచే  పెంచబడినప్పటికి బ్రాహ్మణాచారం విడువక ఉచిత కాలమందే ఉపనయనం చేయబడి, వేదాభ్యాసమొనర్చి, సకల కళలయందును ప్రవీణులై వివాహమునకు యుక్త వయస్కులైనారు. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
      "అది చూచి వారి జనకతండ్రి తమ బంధుకోటివారైన చటంగవి శివాచార్యులు పుత్రికను వివాహమునకు నిశ్చయించి బంధువులకు పత్రికలు పంపారు. నంబియారూరరైన సుందరమూర్తి, ముహూర్తమునకు ముందునాడే సమావర్తనం చేసుకుని కంకణం కట్టుకొన్నారు. ముహూర్తంనాడు త్వరగా నిత్యకర్మలు ముగించి, పెళ్ళికుమారుని వేషంతో గుర్రమెక్కి, బంధుకోటితో సహా బయలుదేరి పుత్తూరులో చటంగని శివాచార్యుల యింటి పెళ్లి పందిరి వద్ద గుఱ్ఱం దిగి, యథాక్రమంగా పీటమీద కూర్చున్నారు. బాజాలు మ్రోగుతూ ఉన్నవి. వధువును తెచ్చుటయే వ్యవధి.  ( ఇంకా ఉంది )
రమణాశ్రమ లేఖలు 82 సుందరుల దాసపత్రం ( తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/06/82-27147.html
    "అప్పుడు ఒక వయోధిక బ్రాహ్మణ రూపంతో ఈశ్వరుడా కళ్యాణవేదికను సమీపించి 'అయ్యా! ఇక్కడున్న వారంతా నే చెప్పేవార్త వినండి' అన్నారు. సుందరులూ,  తక్కిన బ్రాహ్మణులూ 'సరే, ఏం చెప్తారో చెప్పండి' అన్నారు. ఆ విప్రుడు నంబియారూరరును చూచి 'ఇదిగో, నీకూ నాకు ఒక నిబంధన ఉన్నది. అది ముగించుకొని ఈ పెళ్లి చేసుకో' అన్నాడు. 'నిబంధన ఉంటే అలాగే కాని అసలది యేమో చెప్పు' అన్నారు సుందరులు. ఆ విప్రుడు సభికులను చూచి 'అయ్యా! ఈ నంబియారూరర్ నాకు దాసుడు'  అన్నాడు. 'ఆహహ, ఈ విప్రుడన్నది చాలా బాగున్నది' అని పరిహసించారు సుందరులు. ఆ విప్రుడు సుందరులను సమీపించి 'ఓహో! సరిసరి పరిహసిస్తున్నావా?  గొప్పవాడివే! ఇదిగో,  ఆ కాలంలో నీ తాత వ్రాసి ఇచ్చిన దాస్యపత్రం నా వద్ద ఉన్నది. జాగ్రత్త'  అన్నాడు. వెంటనే సుందరులా విప్రునితో 'ఓ పిచ్చీ, చాలు చాలును. బ్రాహ్మణునకు బ్రాహ్మణుడు దాసుడనుట ఇప్పుడిక్కడ నీవు చెప్పగా వింటున్నాను. పో, పో ' అన్నారు. 'పిచ్చివాణ్ణిగాని, పిశాచినిగాని నీవిప్పుడెన్ని తిట్టినా అభిమానం లేదు. నన్ను నీవు రవంత కూడా గ్రహించలేదు. ఈ ఆటగొండి మాటలిక చాలించి దాస్యం చేసేందుకురా' అన్నాడా విప్రుడు. 'అయితే ఆ పత్రం చూపు ముందు' అన్నారు సుందరులు. పత్రం చూచి నిశ్చయపరుచుటకు నీవెవరవోయ్. ఈ సభికులు చూచి యదార్థమని అంగీకరించిన తరువాత నౌకరీ చేయదగుదువు. అంతే' అన్నాడా విప్రుడు.

    సుందరులు ఆగ్రహించి పత్రం లాక్కొనే నిమిత్తం ఆ విప్రుని పైకి దూకితే వారు పరిగెత్తారు . వీరూ వెన్నంటి పరిగెత్తి పోయి పోయి కడకు ఆ పత్రం లాక్కొని చింపి పాఱవేశారు. ఆ వృద్ధుడు సుందరుల నమాంతం పట్టుకొని బొబ్బలుపెట్టాడు. సభికులు కల్లోలపడి లేచి వారిని సమీపించి ఇద్దరినీ విడదీసి 'లోకంలో ఏ కాలమందూ నడవని ఏర్పాటు చెప్పి కలహించే విప్రుడా! నీవే ఊరివాడవయ్యా?' అన్నారు. 'ఇదిగో, ఈ సమీపంలో వున్న తిరువెణ్ణైనల్లూరే నా నివాసస్థానం. ఈ నంబియారూరరు ధర్మవిరుద్ధంగా నా చేతనున్న పత్రం తాను చింపినందున తాను  నాకు దాసుడేనని స్థిరపరిచాడు చూచారా?' అన్నాడా విప్రుడు. నీవు తిరువణ్ణైనల్లూరి వాడవే  అయితే ఈ అభియోగం అక్కడే తీర్మానించుకోవచ్చునే' అని సుందరులంటే, 'అవునవును, అక్కడి బ్రాహ్మణ సభలో మూలపత్రం చూపి నీవు నాకు దాసుడవని నిర్ణయిస్తాను రార' మ్మని కఱ్ఱ పుచ్చుకొని ముందుకు నడిచాడా విప్రుడు. సుందరులూ, తదితర బ్రాహ్మణ సమూహం వెనుకనే వెళ్లారు. 
   
     "అందరూ ఆ వూరి బ్రాహ్మణ సభకు చేరగానే  కుహనా విప్రుడు సభికుల నవలోకించి 'న్యాయ మరసిన పెద్దలారా, తిరునావలూరు వాడగు ఈ నంబియారూరరనే వాడు నాకు తాను దాసుడనను పత్రము చింపి మీ వద్దకు వచ్చాడు' అని అభియోగం తెచ్చాడు. ఆ అభియోగం విన్న సభికులు ఆ విప్రుని చూచి 'అయ్యా! బ్రాహ్మణులకు బ్రాహ్మణులు దాసులుగుట ఈ లోకంలో ఇంత వరకూ లేదే? మీరన్నది పొరపాటు'అన్నారు. 'నేను అసత్యాభియోగం తేలేదు. వీడు చింపిన పత్రం వీడూ వీడి వంశపరంపరలోని వారందరూ నాకు దాసులని వీడి తాత రాసిచ్చిన పత్రం'అన్నాడా విప్రుడు . సభికులు సుందరులను చూచి  'మీ తాత వ్రాసిచ్చిన పత్రం నీవు చింపినంతనే నీ పక్షం జయించగలదా? నీ సమాచారం యేమి?' అన్నారు. సుందరులా సభికులను జూచి వేదములాదిగా  సమస్తము నెఱిిగిన పుణ్యాత్ములారా, నేను ఆదిశైవుడనని మీకందరకూ తెలియును. ఈ విప్రుడు నన్ను దాసుడనని సిద్ధాంతపరచుట  మనస్సు కందని మాయాజాలమని తలచాలి. దీని గుఱించి నేనేమి చెప్పగలను?' అన్నారు .

  "సభికులది గని ఆ విప్రునితో 'నీ కితడు దాసుడను విషయం ముందు మాకు ఋజువు పరచాలి. ఒక వ్యవహారం నిర్ణయించేదుకు అనుభవం,లిఖితం, సాక్ష్యం మూడు వుండాలి. నీవీ మూడింటిలో ఒకటైన చూపవద్దా?" అన్నారు. ఆ విప్రుడు 'అయ్యా  ! వీడు చింపింది నకలు పత్రమే.  మూలపత్రం నా వద్ద ఉన్నది' అన్నాడు. సభికులది 'చూపు' మంటే 'వీడు అదీ చింపునేమో,  చింపకుండా చూస్తామని మీరు హామీ యిస్తారా?'  అన్నాడా విప్రుడు. 'సరి, చింపనీయం' అన్నారు వారు. ఆ విప్రుడు రొంటిన దోపిన మూలపత్రం తీసేసరికి అకస్మాత్తుగా ఆ  గ్రామకరణం అక్కడికి వచ్చాడు. సభికులాతని గని 'ఆ పత్రం చదవ' మన్నారు. ఆ కరణం సభకు నమస్కరించి ముడుచుకొని పోయిన ఆ మూలపత్రం అందుకొని ముడతలు లాగి అందరూ వినేటట్టుగా గట్టిగ చదివాడు. "తిరువారూరులో నివసించే ఆదిశైవుడైన అరూరనేె నేను,  తిరువెణ్ణైనల్లూరు వాస్తవ్యులగు పిత్తనుకు(పిచ్చివానికి)  నేను నా సంతతివారూ  క్రమంగా దాస్యం చేయుటకు సంతోషంతో బుద్ధిపూర్వకంగా ఒప్పుకొని వ్రాసి యిచ్చిన పత్రం" ఇట్లు అరూరర్
  
    " ఆ పత్రంలో సంతకం చేసిన సాక్షులు ఆ సభికులే. వారది చూచి తమ సంతకమేనని ఒప్పుకున్నారు. సభికులు సుందరులను చూచి 'ఇది మీ తాత చేతివ్రాతయేనా చూడు' మంటే, ఆ వేషధారి విప్రుడు 'అయ్యా! వీడు పసివాడు, తాత దస్తూరి గుర్తించగలడా? వీడి తాత వ్రాసిన కాగితం వేరే ఏదైనా వుంటే తెప్పించి అదీ యిదీ చేర్చి చూచి మీ యిష్టానుసారం తీర్మానించిండి' అన్నాడా సభికులతో. 'వా రది సరి' అన్నారు. సుందరుల బంధువర్గం వారి తాత వ్రాసిన పత్రం వేరొకటి తెచ్చారు. సభవారు ఆ రెంటినీ  సరిచూస్తే ఒకే విధంగా ఉన్నవి. సుందరులను చూచి 'అప్పా! నీవిక తప్పించుకొనే మార్గం లేదు. ఓడిపోయావు. అందువల్ల వారి ఆజ్ఞానుసారం ఊడిగంచేయటయే నీ విధి'  అని ఏకగ్రీవంగా తీర్మానించారు సభికులు. సుందరులు 'సరే, నా తలవిధి అదే అయితే అట్లాగే చేస్తా'నని నిర్విణ్యులై నిలిచారు. ఆ సభికులార్ద్రహృదయులై ఆ విప్రుని విషయమై సందేహం కలిగి 'అయ్యా, నీ యీ పత్రంలో ఈ వూరే నీ వూరుగా వ్రాసి ఉన్నదే. మీ వంశ క్రమానుగతంగా వున్న ఇల్లూ వాకిలీ ఆస్తీ పాస్తీ ఎక్కడో చూపగలవా?' అన్నారు. ఆ విప్రుడు ఆశ్చర్య మభినయిస్తూ 'ఆ, మీరంతా ఈ ఊరివారు. ఇలా ఇంతమంది,ఇంత చదివినవారు, ఇంత మేధాసంపన్నులు, ఇంత వృద్ధులు, ఇందులో ఒకరికైనా నా ఇల్లూ వాకిలి తెలియదా? ఆహా! ఏమయ్యా మీ మాటలు. అయితే నాతో రండి అంటూ తాను ముందుకు నడవ సాగాడు సభికులు, సుందరులు వెనకనే వెళ్లారు. ఆ వేషధారి దైవం ఆ వూళ్ళోనే ఉన్న 'తిరువరువళ్తూరై'  అనే శివాలయంలో ప్రవేశించుట కని వెనకనున్న వారంతా నిశ్చేష్టులై నిలిచారు. 
     
  "సుందరులప్పుడు 'నన్ను దాసునిగా చేసుకొన్న ఆ విప్రుడు నాదైవమైన పరమేశ్వరాలయంలో ప్రవేశించాడే, ఏమాశ్చర్యం?' అని తలపోసి అత్యంత వాంఛతో ఒంటరిగా ఆ విప్రుని అడుగుజాడల ననుసరించి పోయి ఆలయంలో ప్రవేశించి 'ఓ బ్రాహ్మణుడా?' అని పిలిచారు. వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి 'అప్పా నీవు నా ప్రమథ గణంలోని హాలహల సుందరుడవు.  శాపవశాత్తు ఇక్కడ జన్మించావు. నీవా శాపకాలంలో ఎక్కడున్నాను నన్ను నీవానిగా చేసుకొమ్మని నన్నర్థించావు . అందువల్ల ఇప్పుడు ఈ విధంగా దాసుని చేసుకున్నాను."  అని వారి పూర్వ వృత్తాంతమంతా విశదపరిచారు. ఆ కథంతా ఆ పురాణంలో వివరంగా ఉన్నది. ఆ పరమేశ్వరుని పలుకులు విన్న వెంటనే సుందరులు తల్లి అరుపు విన్న లేగదూడవలె నలరి హర్షపులకిత గాత్రుడు, ఆనందబాష్పపూరిత నేత్రుడునై మొదలు నఱికిన వృక్షంవలె వ్రాలి, నమస్కరించి లేచి కరములు శిరమున అంజలించి 'ప్రభో!  పనికిమాలిన నన్ననుగ్రహించి, మార్జాలశిశున్యాయంగా పట్టకొని నీవానిగా చేసుకొన్నావే, ఎంత కరుణ' అని అనేక విధముల నుతించి నిలిచారు. పరమేశ్వరు డానందించి ' అప్పా! నీవు నాతో వాదించినందు  'వన్ తొండన్'  అనే పేరు నీకు వచ్చింది. నీవు నాకిక చేయదగిన సేవ పద్యకుసుమార్చనయే. ఇక నా మీద పద్యములు రచించి పాడ' మని అనుగ్రహించాడు. సుందరులు అంజలి హస్తులై 'ప్రభో బ్రాహ్మణరూపమున వచ్చి అభియోగం తెచ్చిన నీ మహిమ నరయక వాదించిన నాకు పూర్వస్మృతి నిచ్చి ప్రపంచ వర్తనలో పడి మునగకుండా రక్షించిన పరదైవమగు నీ అనంత గుణములను నేనే మెరుగుదును?  ఏమని పాడగలను?" అన్నారు. ఆ ఈశ్వరుడు 'నీవు ముందే నన్ను పిత్తా' (పిచ్చి) అని పిలిచావు. అందువల్ల పిత్తననేపాడు' మనీ సెలవిచ్చి అంతర్హితుడైనాడు. సుందరులప్పుడే 'పిత్తా పిరై చూడి' అను పదముతో నారంభించి శ్రీపదికం పాడారు. వారి చరిత్రంతా ఇటువంటి చిత్రవిచిత్ర సంభవాలతో నిండి వుంటుంది" అన్నారు భగవాన్. 
T.Me/BhagavanRaman
"వారికి సుందరమూర్తి నామం పూర్వస్మృతి జన్యమేనా?"  అన్నాను. 
"అదే అదే.  వేరేకారణం చరిత్రలో కనిపించదు" అన్నారు భగవాన్.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ