రమణాశ్రమ లేఖలు 81 శివభక్త సుందరమూర్తి 26-1-47
రమణాశ్రమ లేఖలు 81 శివభక్త సుందరమూర్తి 26-1-47
https://bhagavanraman.blogspot.com/2019/06/81-26-1-47.html
నిన్న తిరుచ్చుళి పురాణం చూస్తూ సుందర మూర్తి ఆ క్షేత్రానికి వచ్చినప్పటి చరిత్రాంశములను గురించి ప్రసంగవశంగా భగవాన్ ఇలా సెలవిచ్చారు. "సోమశేేఖరుడగు శివుని యొక్క ప్రతిబింబం నుండి ఆవిర్భవించిన హలాహల సుందరుని అంశచే అవతరించిన మహా మహుడగు సుందరమూర్తి క్షేత్రాటనాపరుడై సంచరిస్తూ ఉండగా కేరళ రాజైన చేరమాన్ పెరుమాళ్ నాయనారుల స్నేహం కలిగింది. ఆ తరువాత వారిద్దరూ కలిసి క్షేత్రాటనా తత్పరులై మధురానగరమునకు వెళ్లారు. పాండ్యరాజూ, వారి జామాతయైన చోళరాజు వీళ్ళిద్దరినీ ఎదుర్కొని తమ అతిధులుగా ఉపచరించి సంతసించారు. సుందరులూనూ మీనాక్షి నాథుడైన సుందరేశుని పూజించి తమ కవితా నైపుణ్యమున నుతించి ఆ చక్రవర్తులచే అనుమతి పొంది,చేరరాజు వెంటరాగా దక్షిణాపథ క్షేత్రములైన తిరుక్కుట్రాలమును తిరునల్వేలిని రామేశ్వరములను సేవించి అందుండి లంకా ద్విపమందున్న తిరుక్కేదీశ్వరమును స్తోత్రము చేసి అక్కడ నిలిచి ఉండగా ముక్తినగరమైన త్రిశూలపురము జ్ఞప్తికి వచ్చింది. సుందరులు,చేరరాజు తత్పూరాభిముఖులై నడచి ఆ పురమును సమీపించేసరికి అక్కడ జనసమూహం, సూర్యచంద్రులు ఏకకాలమున ఉదయించిరో అన్నట్లున్న ఆ తేజోమూర్తుల నాలోకించి పరమాహ్లాద భరితులై వారికి కెదురేగి పురప్రవేశము చేయించి ఉపచరించారు. శ్రీతనునాథుని దర్శించి సంతసించిన సుందరులు "ఉనాయ్ ఉయిర్ పుహులాయ్" అని ప్రారంభించు పదికమున స్తోత్రం చేసి భక్తి పరవశులైనారు. తరువాత ఆ క్షేత్రమందు స్వల్పకాలము నివసింపదలచి కౌండిన్యసనదీ తీరం లోని శయనం అనే మఠమున నివసించినారు.
https://www.facebook.com/359807631501891/posts/462584354557551/?app=fbl
వారు అక్కడుండగా ఒక రాత్రి సుందరుల స్వప్నమున పరమశివుడు చేత చెండును (అది రాజలాంఛనము), శిరస్సున భూషణమును ధరించి అసమాన సౌందర్యయుత యౌవ్వన రూపమున తోచి, 'మే ముండునది జ్యోతీవనము(కాళీశ్వరము) అని' పగడంపునోట మందహాసము చిందులాడునట్లు పలికిన, సుందరులు సంభ్రమించి లేచి తానుగా వచ్చి అనుగ్రహించెడు ఈశ్వరుని కృపావైభవమును తలచి, కరిగిపోయి,ఆ అద్భుత దర్శనమును చేరిరాజునకు చెప్పి సంతసించారు. ఆ స్థలమందప్పుడే సుందరులు కాళేశ్వరునిపై 'తొండర్ అడత్తొళలుం' అని ప్రారంభించి దేవార పదికమును భక్తి పరవశులై పాడారు. ( ఇంకా ఉంది )
రమణాశ్రమ లేఖలు 81 శివభక్త సుందరమూర్తి (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/06/81-26-1-47.html
ఆ తరువాత అక్కడ నుండి బయలుదేరి దూరమందున్న తిరుప్పనవాయిల్' అనే క్షేత్రానికి వెళ్ళాలని బయలుదేరేసరికి, లోగడ స్వప్నంలో వారికి దర్శనమిచ్చిన కాళీశ్వరులు అంబతో సహా వృద్ధ బ్రాహ్మణ వేషంతో వారి వద్దకు వచ్చారు. "మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు? అని సుందరులు ప్రశ్నిస్తే" ఆ విషయం తరువాత మాట్లాడవచ్చు, ముందు ఆకలికి అన్నం పెట్ట' మన్నారట. 'చిత్త' మని వంట చేయించి వడ్డించవలెనని చూస్తే, ఆ దంపతులు అక్కడ లేరు. ఊళ్లోవున్న సందు గొందులన్నీ వెదికినా కనిపించలేదు. తిరిగి మఠానికి వచ్చి చూస్తే, వండిన పదార్థం మాయమైనది. తోటలో చూస్తే అంతటా ఎంగిలాకులు పడియున్నవి. సుందరులు చకితులై 'ఆహా, ఇదేమి వింత? ఆ సర్వేశ్వరుని లీల గాక వేరేమున్న' దని నిశ్చయించునంతలో జ్యోతివనంలో నివసించి యున్న మమ్ము చూడకయే ఎక్కడికి వెళ్లాలనుకున్నావు?' అన్న అశరీర వాక్కు వినపడ్డది. "జ్యోతి వనం ఎక్కడ? ఎటు పోవాలి? అని యోచిస్తుంటే, 'వృషభ వాహనం మీద మేము పోతూ ఉంటాం. ఆ అడుగుజాడలను అనుసరించిన నీవు రావచ్చు'నని తిరిగి అశరీర పలికింది.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
సుందరులు, భక్తులతో కదలి వృషభం అడుగుజాడల ననుసరించి పోతుంటే, ఉన్నట్లుండి ఆ జాడ అదృశ్యమైంది. ముందు వెనుక తోచక నిలిస్తే 'బాగా పరికించి చూడమని' మళ్ళీ వినవచ్చింది. నిదానించి చూచి నడుస్తుంటే, ఒకచోట లింగమయంగా తోచింది. అడుగుపెట్టే చోటు లేక భక్తిసహితులై విభ్రాంతితో నిలిస్తే ఉన్నట్టుండి సన్నని త్రోవ కనిపించింది. ఆ త్రోవ ననుసరించి పోగా, పోగా కాళేశ్వరాలయం కనిపించింది . దాని కెదుటనున్న కోనేటిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే, గోపురంతో సహా కోవెల అదృశ్యమైంది. సుందరులు ఆశ్చర్యంతో, 'ముందే నీ సన్నిధికి రానందుకిది ఫలితమా?' అనే భావం గల కొన్ని పాటలు పాడగానే, ముందు జ్యోతిర్మయంగా తోచి, తరువాత గోపురం శిఖరం, ఆ తరువాత ప్రాకార సహిత దేవాలయం కనిపించినవి. వారు ఆనందమంది, స్వామిని దర్శించి, పూజించి, స్తుతించి, కవితానైపుణ్యముతో గీతాలు పాడుతూ కదలి యాత్రార్ధులై వెళ్ళారుట. ఇదొక చిత్ర కథ. ఇంకా వారి కథలెన్నో ఉన్నవ" న్నారు భగవాన్.
అచ్చయిన లేఖలో "స్వామి ఎక్కడ లేడు?" అనే దానిలో చెప్పిన సుందరమూర్తి వీరే. వీరి చరిత్ర విపులంగా తెలుసుకోవాలంటే, సంస్కృతంలో "శివభక్త విలాసం", "ఉపమన్యు భక్తవిలాసం", అనే వాటిలోనూ, తెలుగున "పాల్కూరికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర" లోనూ "బసవ పురాణంలోనూ" ఉన్నది. ఈ సుందరమూర్తి భక్తి సఖ్య భావమని, మణివాచకులది నాయికా భావమని అప్పర్ ది దాస భావమని సంబంధులది పితృ భావమని భగవాన్ ఇదివరకు ఒకసారి సెలవిచ్చారు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment