రమణాశ్రమ లేఖలు 99 గురు స్వరూపం 26.2.47
రమణాశ్రమ లేఖలు 99 గురు స్వరూపం 26.2.47 https://bhagavanraman.blogspot.com/2019/05/99-26247_30.html
ఈ మధ్యాహ్నం తమిళ్ యువకుడు ఒకడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చుని,"స్వామీ! నిన్న ఉదయం ఆ గుజరాతి యువతికి త్యాగమంటే
అంతరత్యాగమని సెలవిచ్చారే? అది ఏవిధంగా లభ్యమౌతుంది? అసలు అంతరత్యాగమంటే ఏమిటి?" అని ప్రశ్నించాడు.
https://www.facebook.com/359807631501891/posts/447030359446284/?app=fbl
"అంతరత్యాగమంటే వాసనలన్నీ అణిగిపోవాలి. 'అది ఏవిధంగా లభ్యమౌతుంది 'అంటే, సాధన వల్ల లభ్యమౌతుంది" అన్నారు భగవాన్. "సాధనకు గురువు కావాలి గదా?" "అవును కావాలి" అన్నారు భగవాన్ . "సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురు స్వరూపం ఎటువంటిది?" అన్నాడా పృచ్చకుడు. "ఎవరియందు నీ మనస్సు లగ్నమౌతుందో, వాడే గురువు. 'సద్గురువు ఇతడని నిర్ణయించటం ఎట్లా? వారి స్వరూపం ఎటువంటిది?' అంటే శాంతశమదమాదులతో కూడి సూదంటు రాయి వలే దృష్టి చేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత, సమత్వం ఎవరియందు స్థిరంగా ఉంటవో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే, తన స్వరూపమేటో తెలుసుకోవాలి ముందు. తన స్వరూపమేదో తెలియనప్పుడు, గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే,లోకాన్నంతా గురురూపంగా చూడాలి. ప్రతి జీవియందు గురు భావాన్ని ఉంచాలి. ఈశ్వరునైనా అంతే. అన్నిటిని ఈశ్వర రూపంగా చూడాలి. తానెవరో తెలియనివాడు ఈశ్వరరూపంగాని గురురూపంగాని ఎలా చూడగలడు? ఎలా నిర్ణయించగలడు? అందువల్ల ముందు నీ యధార్థ స్వరూపమేదో తెలుసుకో" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా?" అన్నాడా యువకుడు. "అది నిజమే. లోకంలో ఎందరో మహానీయులున్నారు. నీ మనస్సు ఎవరియందు లగ్నమౌతుందో, వారిని గురువుగా నమ్ముకో. గురియేగదా గురువు?" అన్నారు భగవాన్. ఆ యువకుడంతటితో తృప్తిచెందక సమకాలికులగు పెద్దల పేర్లు కొన్ని ఏకరువుపెట్టి "వారికీ లోపం ఉంది. వారే విధంగా గురవులౌతారు? వీరే విధంగా గురువు కాగలరు?"అని ఆక్షేపించుట ఆరంభించాడు.
భగవాన్ తమ్మెవ్వరెంత నిందించినా సహిస్తారుగాని, ఇతరులను నిందిస్తే రవ్వంతైన సహించలేరు. అవేగాస్వరంతో "ఓహో, నిన్ను నీవు తెలుసుకోమంటే వినక వారికా లోపం వీరికీి లోపం అని నిందించటం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలును. వారి లోపాలు వారు చూచుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకొననిది వారు మోక్షము పొందరాదన్న మాట. పాపం నీ సర్టిఫికేట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు. మహాగొప్పవాడవు. నీవు మెచ్చుకోకుంటే, వారికి గతి ఉన్నదా మరి? ఇక్కడ వారిని నిందించావు. మరొక చోట మమ్ము నిందిస్తావు. నీవన్నీ తెలిసినవాడవు. మేము ఏమీ తెలియని వారము. నీకు అణిగి ఉండవలసిందే. ఉంటాము. 'రమణాశ్రమానికి వెళ్లాను, ఆయన్ను ప్రశ్నించాను. ఏమీ చెప్పలేక పోయినాడు. ఆయన కేమీ తెలియదు" అని ప్రకటించు బాబూ" అన్నారు భగవాన్. (ఇంకా ఉంది)
రమణాశ్రమ లేఖలు 99 గురు స్వరూపం (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/05/99-26247_30.html
ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే, ఒక భక్తుడు వారించారు. భగవానది చూచి "ఉండండయ్యా, మీరు. ఎవరూ మాట్లాడకండి. వారి చిత్త మొచ్చినంతసేపు మాట్లాడనీయ్యండి. వారు తెలిసినవారు. మనమంతా వారికి తగ్గి ఉండాలి. చూస్తూనే ఉన్నా, వచ్చినప్పటి నుంచీ. ఇదంతా మూట కట్టుకొని, మూల కూర్చున్నారు. రోజుకు రోజు కాస్త కాస్త జరిగి దగ్గర కొచ్చారు. నిన్న ఆమె ప్రశ్నించింది చూచి, నేను ఒకణ్ణున్నాని మూట విప్పారు. ఉన్నదంతా బయటకి రావద్దూ ? ఈ లోకమంతా వెదకి గురుస్వరూపం నిర్ణయిస్తారట వీరు. గురువుగా వరించే యోగ్యత ఇంతవరకూ ఎవరివద్దనూ కనిపించలేదట . దత్తాత్రేయులు లోకగురువుకదా?* వారు లోకమంతా నాకు గురువేనన్నారట. చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది. అందువల్ల అదీ గురువే. మంచి చూస్తే చేయాలనిపిస్తున్నది గనుక ఇదీ గురువే. మంచి చెడ్డలు రెండూ నాకు గురువు లేనన్నారు. వేటకాడు దోవ అడిగినా తన మాట వినిపించుకొనక పక్షిని గురి పెట్టి కొట్టటం చూచి, 'నాయనా', నీవు నాకు గురువువి' అని నమస్కరించారట. పక్షిని చంపటం చెడ్డదైనప్పటికీ లక్ష్యముంచి బాణం వేయటం చూచి, నా మనస్సు ఈ విధంగా ఈశ్వరునియందు లక్ష్యముంచి అనుసంధించాలని బోధిస్తున్నావు గనుక నీవొక గురువువి" అన్నారట.
ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువని చెప్పి కడకీ శరీరమే గురువన్నారు . ఏమంటే, నిద్రలో, ఈ శరీరం లేదుగదా? ఈ లేనిదానియందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది. అందువల్ల ఇదీ గురువే'నన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే, వారిని లోకమంతా గురువని కొండాడింది. ఈశ్వర విషయమూ అంతే. లోకమంతా ఈశ్వర మయంగా ఎవరు చూస్తారో, వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమేంతో లోకమంతే. 'యద్భావం తద్భవతి' అన్నారు. పెద్దతోట ఉంటుంది . కోకిలవస్తే మంచి పండ్లు నిమిత్తం మామిడి చెట్లు వెదుకుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లు వెదుకుతుంది. తుమ్మెదలు తేనెకొఱకు మంచి పూలను వెదికితే, ఈగలు మలాన్ని అన్వేషిస్తవి. సాలగ్రామం కావలసినవాడు రాళ్లన్నీ త్రోసివేసి అది ఒక్కటీ గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది. చీకటి ఉంటేనే, వెలుగు శోభిస్తుంది. మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహాకి నూరింటిలో ఒక్క మంచి దొరికితే చాలు. ఆ ఒక్కటీ గ్రహించి తొంబది తొమ్మిది త్రోసివేసి ఇదొక్కటీ చాలురా మనకు, దీనితో లోకమంతా జయించవచ్చు ననుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్క దానిమీదనే ఉంటుం" దని మేఘగంభీర ధ్వనితో పలికి విరమించారు.
హాలంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉన్నది. గడియారం టంగుటంగున గంటలు నాలుగు కొట్టింది . అజ్ఞానమనే శూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగుదమ్ములకు నమస్కరించి వినుతిసేయవచ్చిన మయూరమా అది ? అన్నట్లు హాలుకు ఉత్తరదిక్కున ఉన్న పాకలోనికి నెమలి వచ్చి గంభీరమైన ఒక్క కేకరావంతో,తనరాక తెలియపరుచుకొన్నది. భగవాన్ "ఆవ్, ఆవ్ అంటూ అటువైపు తిప్పారు దృష్టి.
T.Me/BhagavanRaman
(*తెలుగు, సంస్కృత, భాగవతములందు ఏకాదశ స్కంధంలో 'అవధూత యదుసంవాదం' చెప్పి ఉన్నది. తమిళ్ భాగవతమునందు అదే స్థానంలో అవధూతకు బదులు దత్తాత్రేయుని పేర్కొన్నారు. బృహస్తోత్ర రత్నాకరంలోని దత్తాత్రేయస్తోత్రంలోనూ వారికి అవధూతనామం చెప్పి ఉన్నది.
14. అవధూతాయ సదానంద పరబ్రహ్మ స్వరూపిణే
విదేహ దేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే::)
Comments
Post a Comment