రమణాశ్రమ లేఖలు 117 సింహస్వప్నం 18.5.47

రమణాశ్రమ లేఖలు 117 సింహస్వప్నం 18.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/117-18547.html
      ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ 'ప్రారంభించారు' ప్రశ్న పరంపరలు. "బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపమంటారు గదా, భావమేమిటి?" అన్నారొకరు. "అవును అంటారు. అసలున్నది సత్తు ఒక్కటే. దానినే బ్రహ్మమంటారు. ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు,స్వభావమే ఆనందం. ఈ రెండు సత్తుకన్నా భిన్నంకాదు. మూడిటినీ కలిపి సచ్చిదానందమంటారు. జీవగుణాలూ అంతే. సత్త్వము, ఘెరము, జడము ఘోరమంటే రజోగుణం, జడమంటే తమోగుణం. ఈ రెండు సత్త్వానికి అంగాలన్నమాట. ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్త్వమొక్కటే. అది సత్యమైనదీ, నిత్యమైనదీ, స్వచ్ఛమైనదీను. దాన్నే  ఆత్మఅను, బ్రహ్మమను, శక్తి అను, ఏదన్నా అను. అదే నీవని తెలుసుకుంటే అంత ప్రకాశమే. అంతా ఆనందమే" నన్నారు భగవాన్.
  https://www.facebook.com/359807631501891/posts/433222970827023/?app=fbl
     "తన ఆ సత్యస్థితి నెఱుగ నెంచు సాధకునకు శ్రవణ,  మనన, నిదిధ్యాసాదులు  కడవరకు ముఖ్యావశ్యకములంటారు గదా పెద్దలు?"  అన్నారు పృచ్ఛకులు. "ఆవశ్యకములంటే, పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలేగాని, తన్ను తెలుసుకునేందుకు కాదు. తానెప్పుడూ ఎక్కడా ఉండనే ఉన్నాడు. అడ్డువచ్చే విషయాదులను త్రోసివేసే నిమిత్తమే శ్రవణాదులు గ్రహించాలిగాని, అవే ముఖ్యమని భావిస్తే, పండితుడను, గొప్పవాడను అనే అహంకారానికి కారణమౌతవి. అదొక పెద్ద సంసారం. వెనుక దాన్ని విడవడం కష్టం. అది మదపుటేనుగుకన్న గొప్పది. సాధారణంగా లొంగదు".  అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
       "ఆ మదపుటేనుగుకు గురుకటాక్షం సింహస్వప్నం వంటిదంటారే?" అన్నారు వారు. "అవునది నిజమే. ఏనుగు కలలో సింహం కనిపించిందంటే, ఉలిక్కిపడిలేచి కళ్ళు మూస్తే, మళ్లీ అదే కనిపిస్తుందని, నాటికి నిద్ర మానుతుంది. అట్లాగే, మానవుని జీవితస్వప్నంలో గురుకటాక్షం ఒక్కటే కాదు. శ్రవణ,మనన, నిదిధ్యాసులన్నీ సింహస్వప్న సదృశాలే. ఈ సింహస్వప్నాలు రాగా రాగా మేల్కొంటూ,  మళ్లీ పడుకుంటూ, కాలపరిపాకం వల్ల,  ఒకప్పటికి గురుకటాక్షమనే సింహస్వప్నం గాఢంగా కలిగే సరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు. అప్పుడు ఏ స్వప్నమూ  లేక జాగరూకుడై ఉండటమేగాక, జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం ఎడమీయక  అప్రమత్తుడై ఉంటాడు. ఆ యథార్థమైన జాగ్రత్ప్రబోధం కలిగే వరకూ కలలో  కలవలే సింహస్వప్నాలు  రావాల్సిందే" అన్నారు భగవాన్.  (ఇంకా ఉంది)
రమణాశ్రమ లేఖలు 117 సింహస్వప్నం (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/05/117-18547.html
          " శ్రవణాదులూ, గురుకటాక్షమూ,  స్వప్నదృశాలేనా?" అన్నరా పృచ్ఛకులు  ఆశ్చర్యంతో. "అవునయ్యా. యధార్థం తెలుసుకున్న వారికి అంత స్వప్న తుల్యమే. ఏది యథార్ధమని నీవిప్పుడు చెప్పగలవు? నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు. అనేక శరీరాలతో, అనేక చోట్ల తిరుగుతావు. ఏమేమో చేస్తావు. అప్పటికి కదంతాసత్యం గానే తోస్తుంది. అన్నీ కర్తృత్వం వహించినట్లే  చేస్తావు. మెలుకువ కలిగిన వెనుకనేగదా నేను వెంకయ్యను, నేను పుల్లయ్యను, అదంతా వట్టిది, స్వప్నం అని అనుకోవటం. అదేగాదు. ఒక్కొక్కప్పుడు రాత్రి లడ్డూ జిలేబీలతో గొంతు వరకూ  తిని పడుకుంటావు. నిద్రలో ఎంతో ఆకలైనట్లూ,  ఎక్కడెక్కడో తిరిగినట్లూ,   ఆహారం దొరక్క ప్రాణవసానస్థితికి వచ్చినట్లూ కలగని ఉలిక్కిపడి లేస్తావు. బేవ్, బేవ్ అంటూ త్రేణుపులు వస్తవి. అప్పుడు, 'ఓహో, అదంతా కలరా బాబూ'  అనుకుంటావుగాని, ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా.వేరొకరు క్షుత్పీడాబాధితులై  నిద్రిస్తారు. కలలో లడ్డూ జిలేబిలతో విందారగిస్తూ వినోదిస్తారు.  అప్పుడీ క్షుత్తుతో పడుకున్న సంగతి జ్ఞప్తి ఉంటుందా?  ఉండదు.  లేస్తారు. చచ్చే ఆకలి. ఉస్సో. అదంతా భ్రాంతి, వట్టి కలరా దేవుడా' అనుకుంటారు. అంతేగదా? ఈ జాగ్రత్తలోనూ నీవున్నావు.  ఆ స్వప్నంలోనూ నీవున్నావు. గాఢసుషుప్తిలోనూ నీవున్నావు. ఎప్పుడూ ఉన్న ఆ నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు, ఇదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది. తెలిసిన వెనుక, గురువు వేరు, నేను వేరు అన్న భావంపోతుంది. అయితే, గురుకటాక్షం వల్లనే ఈ మెలుకువ కలగటం వల్ల, ఆ గురుకటాక్షం సింహ స్వప్నం వంటిదని అంటారు.  ఆ స్వప్నం ఘాటంగా అచ్చుగుద్దినట్లు రావాలి. అప్పుడుగానీ సరియైన మెలుకువ కలగదు. దానికి కాలం అనుకూలించాలి. సాధన చేస్తూ ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు కాలం అనుకూలిస్తుంది. అంతే" నంటూ, భగవాన్ గంభీరమైన మౌనం వహించారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
       గడియారం టంగుటంగున నాలుగు గంటలు కొట్టింది. భగన్ముఖస్థ వాగ్విలాసమనే సమ్మోహనాస్త్రం వల్ల, తన్మయులై  ఉన్న సభ్యులంతా చకితులై యథాస్థితికి వచ్చారు. అలౌకికమైన వేణునాదంవలే నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది. గురు కటాక్షమనే ఆ సింహస్వప్నం అచ్చుగుద్దినట్లు నా కెప్పుడైనా వస్తుందా? అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ