రమణాశ్రమ లేఖలు 116 ప్రారబ్ధం 17.5.47
రమణాశ్రమ లేఖలు 116 ప్రారబ్ధం 17.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/116-17547.html
ఈ ఉదయము 9 గంటలకు ఒక భక్తుడు భగవాను నుద్దేశించి "స్వామీ నిన్న జ్ఞాని ప్రారబ్ధనుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని, తాము సెలవిచ్చారే, అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారుగదా?" అన్నాడు.
https://www.facebook.com/359807631501891/posts/434260154056638/?app=fbl
భగవాన్ సావధానులై "ప్రారబ్ధం లేనిది దేహమెట్లా వచ్చింది? పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలకే ప్రారబ్ధమంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలక్కునూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పిఉన్నది. రామ, కృష్ణాద్యవతారాలూ అంతే. ' పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం, దుష్టులపాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి, ధర్మసంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు.దాన్నే పరేచ్ఛా ప్రారబ్ధమంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటదే జరుగుతుంది" అన్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
"గీతలో కర్మయోగమే ప్రాధాన్యం గా చెప్పారే?" అన్నారు నిన్నటివారు. "ఓహో, అట్లాగా, కర్మయోగం ఒక్కటేనా వారు చెప్పింది. మిగతావన్నీనో? అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది. అది విచారించరు.
*అహం క్రతు, రహం యజ్ఞ , స్స్వధా2హ, మహమౌషధం౹*
*మన్త్రోహ మహమే వాజ్య, మహ మగ్ని రహం హుతం'౹౹* అ. 9శ్లో16.
అన్న గీతాకారుడు, దీనికి ముందే
*'న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ౹*
*ఉదాసీన వ దాసీన మస్తకం తేషు కర్మసు'౹౹* అ.9శ్లో. 9.
అన్నాడు. అదే గాక
*"ఉదాసీనవ దాసీనో గుణైర్యోన విచాల్యతే౹*
*గుణావర్తంత ఇత్యేవ యో-వతిష్టతి నేంగతే'౹౹*. అ.14శ్లో23
అనీ,
'సమదుఃఖసుఖః స్వస్థ స్సమలోష్ఠాశ్మకాంచనః౹
తుల్యప్రియాప్రియోధీర స్తుల్యనిందాత్మసంస్తుతిః'౹౹. అ.14 శ్లో 24
అన్నీ
*'మానావమానయో స్తుల్య, స్తుల్యో మిత్రారిపక్షయోః౹*
*సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే.'౹౹* అ.14శ్లో25.
అనీ చెప్పి ఉన్నాడు. పైవిధంగా ఉన్న మహాపురుషులు బాహ్యానికి ఏ విధంగా ఉన్న సదా కర్మసిద్ధులే. శిష్య, భక్త, ఉదాసీన, పాపాత్మాది నాల్గు తరగతులవారూ వారి అనుగ్రహ రక్షితులే. శిష్యులు గురువుభావంతో సేవించి, తత్వమెరిగి తరిస్తారు. భక్తులు భగవత్స్వరూపునిగా భజించి, పావనులౌతారు. ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులౌతారు. దుష్టులు, అటూ యిటూ వచ్చిపోయేవారి మాటల వల్ల వీరి కథకలాపాలు చెవికి సోకి, పాప విముక్తలౌతారు. ఈ నాల్గుతరగతుల వారున్నూ జ్ఞానుల అనుగ్రహ రక్షితులే' నన్నారు భగవాన్.
" దుష్టులు, పాపవిముక్తులౌతారని సెలవిచ్చారే, ఇతరులనుకుంటే వినుటవల్లనా? వాళ్లే మాట్లాడుకుంటూనా?" అన్నారొకరు. "ఇతరులనుకుంటే వినుటవల్లనే. వాళ్లసలు పాపులుగదా? సజ్జనులమాట ఎట్లా చెప్పుకుంటారు?" అన్నారు భగవాన్. "పాపలకు విమోచనం కలుగుతుందన్నారే,శరీర బాధలనుంచా?మనస్సుకా?" అన్నారు నిన్నటివారు. "మనస్సుకేనండీ. మనస్సు సరిగా ఉంటేనే అన్ని సుఖాలున్నూ, మనస్సు సరిలేకుంటే, ఎదెట్లాగున్నా శాంతి లేదు. వారి వారి అర్హత ననుసరించి క్రమంగా మనస్సు పరిపక్వతస్థితికి వస్తుందన్నమాట. నాస్తికుడు ఆస్తికుడౌతాడు, ఆస్తికుడు భక్తుడౌతాడు, భక్తుడు జిజ్ఞాసుడౌతాడు, జిజ్ఞాసువు జ్ఞాని ఔతాడు. ఈ రక్షణ మనస్సుకే చెప్పాలిగాని, శరీరానికి చెప్పి లాభమేమున్నది? తన మనస్సు సుఖంగా ఉంటే, శరీరమేగాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది. అందువల్ల, ముందు తాను సుఖంగా ఉండేమార్గం చూచుకోవాలి. తానెవరో విచారించి తెలుసుకుంటేగాని, అది తెలియదు. అది విచారించక లోకాన్ని మరమ్మతు చేయాలనటం ఉన్నదే, లోకంలో ఎన్నో రాళ్ళూ, ముళ్ళూ ఉంటవి. తోలుతో కుట్టిన చెప్పులు కాళ్లకు తొడుక్కుంటే తీరేపనికి భూమంతా తోలుతో కప్పాలన్నట్లుంటుంది. ఎండకు నెత్తిన గొడుగు పట్టుకుంటే పోయేదానికి, ఆకాశమంతా చాందినీ కట్టాలని యత్నిస్తే సాధ్యపడునా? తాను తన స్థితిని ఎరిగి, ఉన్నట్లుంటే, జరిగేది జరుగుతుంది. జరగనిది జరగదు. ఉన్నశక్తి ఒక్కటే. మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటేనే ఇన్ని చిక్కులూనూ" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment