రమణాశ్రమ లేఖలు 115 ఉన్నది ఒకటే శక్తి 16.5.47
రమణాశ్రమ లేఖలు 115 ఉన్నది ఒకటే శక్తి 16.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/115-16547.html
ఈ మధ్యాహ్నం ఉత్తర హిందుస్థానీయులొకరు నిన్నటి వారి వలెనే "లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు?" అనే అర్థమిచ్చే ప్రశ్నలతో నిండిన కాగితం శ్రీవారికిచ్చారు. భగవాన్ చూచి, సమీపస్థులతో "ఇదిగో చూడూ, నిన్ననూ ఇటువంటి ప్రశ్నలే. లోకోద్ధరణ చేయాలని బోధించేే వీరంతా తమ్ము తాముద్ధరించుకుంటే చాలును. తానెవరో విచారించి, తెలుసుకోలేక, లోకాన్నుధరించాలని చింతిస్తారు. ఈ చింతించేదెెవరో తెలుసుకోవాలి ముందు. అది చేయరు. లోకాన్నుద్ధరిస్తారట. అచ్చంగా కుంటివాని కథవలెనే ఉంటుందిది". అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/434803764002277/?app=fbl
"స్వామీ, తమవంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటే ఎట్లా? లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడి, శాంతిని ప్రసాదింపవద్దా?" అన్నారా పృచ్ఛకులు. "ఔనయ్యా, జ్ఞానులు ఏ సహాయము చేయుట లేదని నీకెట్లా తెలుసును? వారు ఉన్నట్లుండుటే లోకానికి సహాయం. చూచేందుకు ఊరికే ఉన్నట్లే ఉంటారు. వారి శక్తి ఎన్నోవిధాల పనిచేస్తుంది. అయితే, నేను చేస్తున్నానన్న అహంభావన ఉండదు. ఒక ధనవంతుడుంటాడనుకో. కలలో బిచ్చమెత్తుతాడు, కూలీ చేస్తాడు, వీధులూ ఊడుస్తాడు. మెలుకువరాగానే అవేవి నేను కాదు, నేను ధనికుడను, అనే ధీరత్వంతో ఉంటాడు. అదే విధంగా జ్ఞాని అయినవాడు ప్రారబ్ధానుసారం ఏది చేసినా, నేను కాదని దేనికీ అంటక ధీరుడై ఉంటాడు. వారి శక్తి అనేక విధాల పనిచేస్తుంది. కాని, ఫలితాఫలితాలకు ఖేదమోదాలు వారికుండవు. ఎందువల్లనంటే, అంతా బ్రహ్మమయంగా తోచటంవల్ల కష్టం, సుఖం అనేది గోచరించదు. 'నేను, ఈ శరీరంలో ఉన్నాను, ఈ మనిషిని, ఇది లోకం' అనే భావన ఉంటేగదా! ఖేదమోదాలు చెందే టందుకు. 'దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్బ్రహ్మమయమ్ జగత్' అన్న ఉపనిషద్వాక్యానుసారం ఎప్పుడు జ్ఞానదృష్టి కలుగుతుందో, అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. నేను చేస్తున్నాననే భావనకిక తావేది? ఏదో ఒక శక్తి వల్ల, కార్యం జరుగుతున్నదని భావిస్తారు అంతే" నన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
"జ్ఞానులు, శాపానుగ్రహ సమర్ధలంటారు గదా? వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు?" అన్నారింకొకరు. "అవునండీ, సమర్థులు కారని ఎవరన్నారు? అయితే, తాము వేరు, ఈశ్వరశక్తి వేరు అన్న భావన వారికి లేదు. ఉన్నది ఒక్కటే శక్తి. ఆ శక్తిచేతనే, తాము చలిస్తున్నామని గ్రహించి, అహంకర్తృత్వ రహితులై ఉంటారు. వారు ఉండుటే లోకానికి మేలు. ప్రారబ్ధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు అంతే" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment