రమణాశ్రమ లేఖలు 112 తెల్లనెమలి 20.4.47
రమణాశ్రమ లేఖలు 112 తెల్లనెమలి 20.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/112-20447.html
మొన్న 12వ తేదీన బరోడా రాణి పంపిందని ఒక తెల్ల నెమలిని తెచ్చి, భగవత్సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చూచి "ఆ పది పన్నెండు నల్ల నెమళ్ళు వస్తున్నవే చాలదా? అవి దీనిపైకి జగడానికి వస్తవేమో? ఈ జాతి వేరు. అదిగాక పిల్లులు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి. ఎందుకివి మనకు? వారి బసలోనే ఉంచుట మంచిది" అన్నారు. వారు వినక ఇక్కడే వదిలి వెళ్లారు. కృష్ణస్వామి దాని సంరక్షణకర్త. తక్కిన వారు వారికి సహాయం.
https://www.facebook.com/359807631501891/posts/436610757154911/?app=fbl
మొన్న మధ్యాహ్నం నేను వెళ్లేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టలను గురించి సమీపస్థులతో మాట్లాడుతూ "ఇదిగో, వల్లి అనే జింక పిల్లను అగ్గి పెట్టెలు చేసే వర్తకుడొకడు తెచ్చి, ఇట్లాగే విడిచి వెళ్ళాడు. ఇక్కడే పెరుగుతూ ఉండేది. సెనగపప్పు, మరమరాలు కలిపి పళ్ళెంలో పోస్తే ఒక్క గింజయినా క్రిందపడకుండా ఏరి పప్పంతా తిని, మరమరాలు వదిలేసేది. కొన్నాళ్లకు మేకలమందతో కలిసి అడవికి పోతుంటే ఎరిగినవారు ఇది ఆశ్రమానిదని పట్టి తెచ్చేవారు. తరువాత తానే తిరిగివచ్చేది. పోనిమ్మని ఊరుకున్నాం. ఒకనొడెవరో పంచములు మాంసం కొఱకు కాలు విఱగగొట్టటం చూచి, "అయ్యో, అది ఆశ్రమానిదే?" అని ఎరిగిన వారొకరు ఎత్తుకొని తెచ్చారు. రక్తం కారుతూ వచ్చింది. ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నా ఒళ్ళోనే ప్రాణం విడిచింది. అణ్ణామలస్వామీ, నేనూ కలసి అదిగో ఆ కొండవైపునవున్న మెట్ల నానుకొని ఉన్నదే, ఆ సమాధి కట్టాం" అన్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
నాకాశ్చర్యం కలిగి "భరతఖండంలో భగవంతుడు పలుమారవతరించి పశుపక్ష్యాదులకు సహితం మోక్ష మీయగలడన్న పెద్దల వాక్యం ప్రత్యక్షగోచర మౌతున్నదే' అన్నాను. భగవానందుకొని 'సందేహమేమీ? ఆ విధంగా ఎన్నో జరిగినవి" అన్నారు.
ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకొని వచ్చాడు కృష్ణస్వామి. భగవాన్ దాని మెడమీద చేయిపెట్టి, గుండెలదాకా రెండోచేత్తో రాస్తూ "ఏమిరా ఎక్కడికి వెళ్లావ్. ఇట్లాపోతే ఎట్లా? పోకమ్మా, దుష్టజంతువులుంటవి. ఈ హాలు చుట్టూ తిరుగుతూ ఉండరాదూ ?" అని బుజ్జగించారు.
చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమ కట్టడాలన్నిటిలోనూ సహజంగా తిరగటం నేర్చుకున్నది. భగవానది చూచి "ఇప్పుడిది సర్వాధికారికి సమంగా ఉన్నదోయ్" అంటూ ఉంటారు. ఈ మధ్యాహ్నం రెండున్నరకు నేవెళ్లేసరికి రేడియో పాడుతున్నది. ఎలక్ట్రిక్ ఫాను తిరుగుతున్నది. ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమిలిత నేత్రాలతో, ధ్యానమగ్నమైనట్లు తన్మయంగా కూర్చున్నది. ఒకరది చూచి "ఎంత శ్రద్ధగా వింటున్నదో?" అన్నారు. "అవును, వాటికీ గానమందెంతో ప్రీతి. మురళీ వాయిద్యమంటే, ఇంకా ఆనందం" అన్నారు భగవాన్.
ఈ నెమలి తెలపన్నమాటేగాని ఇంతకన్నా ఆ నెమళ్ళే అందంగా ఉంటవే?" అన్నారొకరు. శ్రీవారా నెమలిని చూపుతూ "ఇట్లాగుంటే ఇదొక శోభ. ఆ నెమళ్ళకు ఎన్నో చిత్ర విచిత్ర రంగులు. ఇది రంగుల కలయిక లేని స్వచ్ఛమైన తెలుపు. గుణవికారముల కూడికలేని శుద్ధసత్త్వమన్నమాట. చూడండి. వేదాంతపరిభాషకు నెమలిని కూడా ఉపమానంగా చెప్పవచ్చు. ఆ నెమళ్ళకూన్నూ పుట్టినప్పుడన్ని రంగులుండవు. ఒకే రంగు. ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు. పింఛం వచ్చిందంటే కావలసినన్ని కళ్ళు, ఎన్ని రంగులో ఎన్ని చూపులో చూడండి. మన మనస్సూ అంతే. పుట్టినప్పుడు ఏ వికృతులూ ఉండవు. తరువాత చిలవలు పలవలుగ ఎన్నో వృత్తులూ, ఎన్నో చూపులు, నెమలివలెనే" అన్నారు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment