రమణాశ్రమ లేఖలు 109 అనన్య శరణాగతి.10.4.47
ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో "స్వామీ, భగవానునియందు అనన్యశరణాగతి చెందితే, సర్వం లభిస్తుందంటారు గదా. అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదులు చింత గూడా వదిలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్తుడైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థితప్రజ్ఞుని గురించి "విహయ కామాన్ యస్వర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్చతి" -అ.2. శ్లో 71 అనటంవల్ల, సమస్త కోరికలు త్యజించుటనిగదా తేలుతుంది. అందువల్ల మనం భగవంతుని స్మరిస్తూ ఆహారపానీయాదులు భగవదాదేశమై అయాచితంగాలభిస్తే, స్వీకరించట? లేక, స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా" లని ఉన్నది.
భగవాన్ చూచి, సావధానులై సమీపస్థులతో "ఇదిగో, అనన్యశరణాగతి అంటే, ఏ చింతలూ లేకుండా ఉండాలనటం సత్యమేగాని, దేహపోషణ అవస్యకాలైన అన్నపానాదుల చింత గూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం. భగవాదాదేశమై అయాచితంగా వస్తే తినవలెనా? కొద్ది ప్రయత్నం చేయవలెనా అంటారే; దానంతటదే వస్తుందనుకో. తినటం ఎవరు తింటారబ్బా? నోట్లో గూడా పెడతారనుకో, మింగైనా మింగాలా? అది మాత్రం యత్నంకాదూ? 'వ్యాధిగ్రస్తుడైతే అయితే ఔషదం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేసి, ఊరుకోవాలా?' అంటారు. క్షద్వ్యాధేః ఆహారం' అన్నారు. దీనికి రెండర్ధాలున్నవి. క్షుత్తున్నూ, వ్యాధివంటిదే గనుక క్షుత్తనే వ్యాధికి ఆహారమనే ఔషధం మవసరమనీ వ్యాధికి ఔషధంవలే, ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు. శంకరులు వ్రాసిన సాధన పంచకంలో 'క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యాతాం ప్రతిదినం భిక్షౌషధంభుజ్యతాం" అని ఉన్నది. క్షుత్తినే వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు. భిక్షకైనా పోవాలి గదా? అంతా కళ్ళు మూసుకొని కదలక కూర్చుని 'వస్తే తింటా' మంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ననుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాహిత్యంగా ఉండాలి. నేను చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగాని, ఆకలికి ఆహారం, వ్యాధికి మందు, ఇవ్వవచ్చునా? లేదా? అని శంకలు పెట్లుకుంటే, అంతులేకుండా శంకలు వస్తనే ఉంటవి. ఊ అని మూల్గవచ్చునా? ఊపిరి పీల్చవచ్చునా? అన్న శంకగూడా బయలుదేరుతుంది. (ఇంకాఉంది)
తరువాత భాగము
ఈశ్వరుడనుకో, కర్మనుకో ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్ని తానే నడుపుతాడు. భారం అతనిమీద వేసి, బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం. అడుగడుక్కూ కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా, దానంతటది నడక సాగటం లేదూ? ఉచ్చ్వాస నిశ్వాసాలు అంతే.క్షణం క్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించడం లేదే. ఆ విధంగానే ఇదీను. ఏదైనా విడవాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా.తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరుగలేదా? ముందు జరుగునా? భగవానునందు అనన్యశరణాగతి చెందటమంటే, ఇతర చింతలన్నీ వదిలి మనస్సు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో, అంతంతగా ఇతర చింతలు దూరమౌతయవి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయనమీద ఉంటుంది. కృష్ణభగవాన్ అర్జునినితో -
"అనన్యా శ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం"
అ.9 శ్లో .22.
అన్నారు అర్జునునకు యుద్ధం చేయవలసిన పని ఉన్నది. అందువల్ల భారం నామీద వేసి, పని చేయవోయ్, నీవు నిమిత్తమాత్రమే సుమా. అంతా నేనే చూచుకుంటాను. నిన్నేది భాదించ" దన్నారు కృష్ణ భగవాన్. అయితే, ఈ అనన్యశరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతనా లేకుంటేగాని, శరణాగతి కాదు. ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే గదా? తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే, భగవానునందే భారంవేసి తన కర్మసాగిస్తుంటే, క్రమంగా తానెవరో తనకే భోదపడుతుంది. ఏదైనా ఫలితం ఒక్కటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకొని, తాను తానుగ నిలుచుటే; తన్ను విడిచి అన్యం ఏమున్నది?" అన్నారు భగవాన్.
"అది తెలుసుకునే మార్గమో?"అన్నాడా యువకుడు. "గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. చేయమన్నారు. దానిక శక్తి లేదూ, భక్తి, కాకుంటే యోగం, నిష్కామకర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదో ఒక మార్గాన్ననుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి. చేసేది నేననే భావనే బంధం. విచారణవల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూసుకొని కూర్చున్నంతనే శరగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెట్లా?" అని భగవాన్ అంటూ ఉండగా భోజనశాలలో గంట మ్రోగింది. "అదిగోనయ్యా గంట, లేచిపోవద్దూ?" అని నవ్వుతూ లేచారు భగవాన్.
Comments
Post a Comment