రమణాశ్రమ లేఖలు 109. అనన్య శరణాగతి 10౼4౼47
ఈ మధ్యన ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక జాబు రాసి చేతికిచ్ఛారు. అందులో "స్వామీ, భగవానుని యందు అనన్య శరణాగతి చెందితే , సర్వం లభిస్తుందంటారు కదా. అనన్య శరణాగతి అంటే ఒకచోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదుల చింత కూడా వదిలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్థుడనైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థితప్రజ్ఞుని గురించి "విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ, నిర్మమో నిరహంకార స శాంతి మధిగఛ్ఛతి" _ అ.2.శ్లో 71 అనటం వల్ల , సమస్త కోరికలు త్యజించుట అనికదా తేలుతుంది. అందువల్ల , మనం భగవంతుని స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవదాదేశమై అయాచితంగా లభిస్తే , స్వీకరించటమా ? లేక స్వల్పంగా యత్నించటమా ? భగవాన్ , ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా " లని ఉన్నది.
భగవాన్ చూచి , సావధానులై సమీపస్థులతో “ ఇదుగో , అనన్య శరణాగతి అంటే , ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమేకానీ , దేహపోషణకు ఆవశ్యకాలైన అన్నపానాదుల చింత కూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం ' భగవదాదేశమై అయాచితంగా వస్తే తినవలెనా ? కొద్ది ప్రయత్నం చేయవలెనా ? ' అంటారే . దానంతటదే వస్తుందనుకో , తినటం ఎవరు తింటారబ్బా ? నోట్లో కూడా పెడతారనుకో , మింగనైనా మింగాలా ? అది మాత్రం యత్నంకాదూ ? వ్యాధిగ్రస్తుడనైతే ఔషధం సేవించాలా ? స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేసి , ఊరుకోవాలా ? ' అంటారు . ' క్షుద్ వ్యాధే ఆహారం ' అన్నారు . దీనికి రెండు అర్థాలున్నవి . క్షుత్తు కూడా వ్యాధివంటిదే కనుక క్షుత్తనే వ్యాధికి ఆహరమనే ఔషధం అవసరమనీ , వ్యాధికి ఔషధంవలె , ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం' అని ఉన్నది. క్షుత్తనే వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు. భిక్షకైనా పోవాలికదా? అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని వస్తే తింటా ' మంటే లోకం లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాహిత్యంగా ఉండాలి . నేను చేస్తున్నానన్న బావనే బంధం . ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగానీ, ఆకలికి ఆహారం , వ్యాధికి మందు ఇవ్వవచ్చునా ? లేదా ? అని శంకలు పెట్టుకుంటే , అంతులేకుండా శంకలు వస్తూనే ఉంటవి . ఊ అని మూల్గవచ్చునా ? ఊపిరి పీల్చవచ్చునా ? అన్న శంకగూడా బయలుదేరుతుంది .
ఈశ్వరుడనుకో , కర్మనుకో , ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు . భారం అతనిమీద వేసి , బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది . భూమిమీద నడుస్తూ ఉంటాం . అడుగడుక్కు కాలు ఎత్తాలి , నిలపాలి అని గమనిస్తామా , నడక దానంతటది సాగటం లేదూ ? ఉచ్చ్వాస నిశ్వాసాలూ అంతే . క్షణక్షణం ఊపిరి పీల్చాలి , విడవాలి అని ప్రయత్నించటం లేదే . ఆ విధంగానే ఇదీను . ఏదైనా విడవాలంటే విడవగలమా ? చేయాలంటే చేయగలమా . తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరగలేదా ? ముందు జరగవా ? భగవానునిలో అనన్య శరణాగతి చెందటమంటే , ఇతర చింతలన్నీ వదలి మనస్సు అతనియందే లగ్నం చేయాలి . ఎంతెంత మగ్నం చేస్తామో , అంతంతగా ఇతర చింతలు దూరమౌతవి . మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే , మన కార్యభారం ఆయనమీదే ఉంటుంది . కృష్ణభగవాన్ అర్జునునితో --
“ అనన్యా శ్చింతయన్తోమాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం ” అ.9 శ్లో , 22 అన్నారు . అర్జునునకు యుద్ధం చేయవలసిన పనిఉంది . అందువల్ల భారం నామీద వేసి , పని చేయవోయ్ , నీవు నిమిత్తమాత్రమే సుమా . అంతా నేనే చూచుకుంటాను , నిన్నేదీ బాధించ ” దన్నారు కృష్ణ భగవాన్ . అయితే , ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి . ఏ చింతనా లేకుంటేగాని శరణాగతి కాదు . ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే కదా.
తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట . భక్తిపరమైతే , భగవాన్ పై భారంవేసి తనకర్మ సాగిస్తుంటే , క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది . ఏదైనా ఫలితం ఒకటే . శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకొని తాను తానుగా నిలుచుటే . తన్ను విడిచి అన్యం ఏమున్నది ? ” అన్నారు భగవాన్ “
"అది తెలుసుకునే మార్గమో ? ” అన్నాడా యువకుడు . “ గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు . ధ్యానం చెయ్యమన్నారు . దానికి శక్తి లేదూ , భక్తి ,కాకుంటే యోగం, నిష్కామ కర్మ , ఇంకా ఎన్నో చెప్పారు . ఏదో ఒక మార్గాన్ని అనుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడేకదా ? సంస్కారాన్ని అనుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి . చేసేది నేననే భావనే బంధం . విచారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు . కళ్లు మూసుకొని కూర్పున్నంతనే శరణాగతి కాదు . అంతా అదేవిధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెల్లా ? ” అని భగవాన్ అంటూ ఉండగా భోజనశాలలో గంట మ్రోగింది . " అదుగోనయ్యా గంట . లేచిపోవద్దూ ? ” అని నవ్వుతూ లేచారు భగవాన్ .
Comments
Post a Comment