రమణాశ్రమ లేఖలు 132 దేశాంతర గతులు 12.7.47.

రమణాశ్రమ లేఖలు 132 దేశాంతర గతులు 12.7.47
https://bhagavanraman.blogspot.com/2019/04/132-12747.html
     చాలాకాలం నుంచీ భక్తుడుగా ఉంటూ ఉన్న బెంగాలు దేశస్థుడగు అరవింద బోసుక ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు. చెట్టల్లే పెరిగిన కొడుకు 18 ఏండ్లయినా నిండకుండా గతించాడు. దాని కారణంగా అతడు ఖిన్నుడై ఆ ఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ రోజున కూడా ఏదో ప్రశ్నించాడు. అందులోనూ ఆ విచారం వ్యక్తమౌతూనే ఉన్నది. భగవాన్ యధాప్రకారం నిన్ను నీవు తెలుసుకొమ్మనే బోధ చేశారు. అతనికింకా తృప్తి చెందలేదు. భగవాన్ "విచారసాగరంలో ఒక కథ ఉన్నది, చెప్తాను వినం" డని ఇట్లు సెలవిచ్చారు.
https://www.facebook.com/359807631501891/posts/423315565151097/?app=fbl
      "రాముడు, కృష్ణుడు అనే యువకులిద్దరు విద్యాభ్యాసమొనరించి విశేష ధనం ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పి, విదేశమునకు వెళ్ళారు. కొన్నాళ్లకు ఒకడకస్మాత్తుగా మరణించాడు. ఒకడు విద్యాభ్యాసం మొనరించి విశేష ధనార్జనపరుడై సుఖంగా ఉన్నాడు. ఆ వెనుక కొన్నాళ్ళకు ఒక వర్తకుడక్కడ నుండి బయలుదేరి వీరి తల్లిదండ్రులున్న దేశానికి వెడుతుంటే, జీవించియున్నవాడు, తన తండ్రికి తాను ఐశ్యర్యవంతుడై సుఖంగా ఉన్నాననీ తనతో వచ్చినవాడు గతించాడనీ చెప్పి పంపాడు. ఆ వర్తకుడు పొరపాటుపడి అట్లు చెప్పక, బ్రతికున్నవాని తల్లిదండ్రులతో మీవాడు గతించాడనీ, గతించినవాని తల్లిదండ్రులతో మీవాడు విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడనీ  చెప్పాడు. గతించినవాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు. ఉన్నవాని తల్లిదండ్రులు పోయినాడని దుఃఖిస్తున్నారు. వాస్తవానికి వారి కొడుకుని వారు చూడలేదు. వీరి కొడుకును వీరూ చూడలేదు. ఎక్కడో ఉన్నాడనీ పోయినాడనీ హర్షశోకాలను అనుభవించారు. అంతే. ఆ దేశం వెళ్ళి చూస్తేగదా యధార్థం తెలియడానికి. మనమూ అంతే. మనస్సు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు లేనిదిగా, లేని వస్తువు ఉన్నదిగా తలచి భ్రమిస్తాం. మనస్సు మాటలు నమ్మక హృదయంలో ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయటి బిడ్డలతో పని లేదు".
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
     ఒక సంవత్సరం క్రిందట బొంబాయి రాష్ట్రంలోని రాణి ఒక ఆమె వచ్చింది. ఉత్తమ ఇల్లాలు. బిడ్డల తల్లి. ఆమె భర్త విదేశాలలో వుంటూ ఉన్నాడు. ఎంతో ధైర్యవతి. కానీ భర్త లోటు మనసులో వుండదా? భగవాన్ దర్శనంవల్లా, వారి బోధవల్లా శాంతి లభించగలదని వచ్చిందని అనుకున్నారంతాను. దానికి తార్కాణంగా ఏం జరిగింది అనుకున్నావు !మురుగనార్ భగవానుని గురించి అరవంలో పాటలు పద్యాలు చాలా వ్రాశారని విని మంచివి కొన్ని చదివించి ఇంగ్లీషులో తర్జుమా చేయించమని స్నేహితురాలి ద్వారా శ్రీవారితో మనవి చేసింది.

      భగవాన్ "నాకేం తెలుస్తుంది. మురుగనారునే అడుగుట మంచిది. అని ముందు చలోక్తిగా అన్నారేగాని, మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి పుస్తకంలో పుటలు తిప్పుతూ గుర్తులు పెట్టి, సుందరేశయ్యరుకు చూపుతున్నారు. ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి, "ఆ రాణి మురుగనార్ పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీషులో చెప్పమని కోరింది. వారు వ్రాసిన 'సన్నిధిమురై' అనే ఈ పుస్తకంలో బృంగసందేశమనే ఒక భాగం ఉన్నది. ఆ భాగంలో ముఖ్యమైనవి గుర్తులు పెట్టాను. నాయిక నాయక భావం. మనస్సు నాయిక రమణుడు నాయకుడు. తుమ్మెద (నిశ్చలాత్మక బుద్ధి) చెలికత్తె. గుర్తుపెట్టిన ఈ పాటల సారాంశమేమంటే, నాయిక తన చెల్లితో 'నా రమణుడు ఎటో మాయమైనాడు, వెతుక్కుని రావే" అంటే, తుమ్మెద నాయికతో ఇట్లా అంటుందట. ఓ అమ్మా నీ రమణుడు నీలోనే ఉంటే నన్నెక్కడ వెతకమంటావు. ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో, నా రమణుడు, నా నాథుడు హృదయంలో ఉన్నాడే, ఈ వేడికి కాగిపోడా? అనే దానవే ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమి ? నీ నాథుడు నీలోనే ఉంటే నేనెక్కడ వెదికేదీ ? ఈ భ్రాంతి వదలి నీలోవున్న నీ నాధుని కలుసుకొని శాంతించు. అని తుమ్మెద చెప్పిందట. ఇదీ ఆ పాటల సారాంశం. ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను. పాపం, భర్త ఎక్కడో ఉన్నాడు. మనసుకు కించ. ఆమె చిత్తవృత్తి ననుసరించి చెప్పవలసి ఉన్నది. అందుకివి అనుగుణ్యంగా ఉంటాయనిచూచా" నన్నారు.

       ఇంతలో రాణి వచ్చింది. లోకమ్మచేత పాటలు పాడించి, రామచంద్రయ్యరు చేత ఇంగ్లీషులో అర్థం చెప్పించారు. ఆమెకు తృప్తి కలిగింది. దూరమందున్న భర్తకై  దుఃఖించక మనస్సును అంతర్ముఖంచేస్తే, ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల నెపంతో బోధించారని అంతా అనుకున్నాము.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ