రమణాశ్రమ లేఖలు 127 పూల పూజ 30.6.47

రమణాశ్రమ లేఖలు 127 పూల పూజ 30.6.47
https://bhagavanraman.blogspot.com/2019/04/127-30647.html
   ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నురాలు తమ తోటలో పూసిన బొడ్డుమల్లెపూలు, నిత్యం పూల బుట్టతో తెచ్చి, సువాసినులందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది. భగవాన్ నాలుగైదు రోజులు చూస్తూ ఊరుకున్నారు. ఆమె మానలేదు. ఒక దినం, పూలబుట్ట కుర్చీపీటమీద పెట్టి, నమస్కరించి లేచింది. భగవాన్ సమీపవర్తులను చూచి "అదిగో, ఆమె ఏమో తెచ్చిందే? పూలు కాబోలు, ఎందుకవి?" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/426615031487817/?app=fbl
       ఆమె జంకుతూ "భగవానుకు కాదు. సవాసినుల"  కని అందరికీ ఇవ్వటం ప్రారంభించింది. "సరిపోయింది. ఇవ్వదలుచుకుంటే, ఇంటి వద్దనే ఇచ్చుకునేది. ఇక్కడెందుకు?  ఒకరివ్వగానే అంత ఆరంభిస్తారు. అది చూచి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కాబోలనుకొని కొనైనా  తెస్తారు. అదొక ఉపద్రవం. నే నెప్పుడూ పూలు తాకి యెరుగను. కొన్నిచోట్ల పూలమాలలు వేయటం మామూలు గదా? అందువల్ల, చాలామంది పువ్వులు తెస్తారు. నేను మాత్రం ఎప్పుడూ ఆ పాదపూజలు చేయాలని ఎవరు యత్నించినా, అవకాశం ఇవ్వలేదు. ఆ వాడుక అంత మన కెందుకు?" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
          పాపమామె భయభక్తులతో  "లేదు . ఇక తీసుకొనిరా" నన్నది. భగవాన్ "సరి. మంచిది". అని, మందహాసం చేస్తూ, సమీపవర్తులతో  "ఇదిగో, ఒకసారి జయంతికి ఏమయిందనుకున్నావు?  ఒక భక్తుడు, పుష్పాంజలి అనే పుస్తకం అచ్చువేయించి తెచ్చి చదువుతా నన్నాడు. సరేనంటే , కొంచెం వెనుక నిలిచి చదువుట కారంభించాడు. ముందే ఒళ్ళో పూలు దాచి ఉంచాడు కాబోలు, చదవటం పూర్తి కావచ్చేసరికి, పువ్వులు మస్తుగా నా కాళ్ళమీద పడినవి ఎవరి పనా ఇది  అని చూస్తే వారి చేష్ట, చెపితే ఒప్పనని అట్లు చేశారు. ఏం జేసేది? ఆ విధంగా చేస్తే గాని పూజ కాదు కాబోలు" అన్నారు.

       నేనిక్కడికి వచ్చిన కొత్తలో వరలక్ష్మీవ్రతం నాడు ఒకరిద్దరు సువాసినులు భగవాన్ పాదాలమీద పూలు చల్లి, నమస్కరించి,  పూజకు సెలవడిగి వెళ్లారు.
మరుసంవత్సరం అంతా అదే విధంగా చేయసాగారు . భగవాన్ తీవ్రదృష్టితో చూచి," అదిగో మొదలు. ఒకరిని చూచి  ఒకరుగా అంతా సాగించారు. ఎందుకిది? అప్పుడే ఖండించక  పోనీలే అని ఉపేక్షించి నందుకిది ఫలం. చాలు చా" లని వారించారు.

       భగవాన్ తన విషయమేగాక దేవతాపూజ విషయంలో గూడా పత్రపుష్పాదుల నుపయోగించుటను గురించి భక్తులలో కొందరిని చలోక్తిగా మందలించటం కూడా ఉన్నది. ఎచ్చమ్మగారి లక్షపత్రిపూజను గురించి ప్రథమ భాగంలో వ్రాశాను గదా.  మరొక విషయం ఏమంటే, శ్రీవారు భక్తులతో సహా మజిలీలు మజలీలుగా మకాం చేసుకుంటూ గిరిప్రదక్షిణానికి వెళ్లే రోజుల్లో ఒకనాటి ప్రదక్షిణ సందర్భమందు మధ్యాహ్నవేళకు గౌతమాశ్రమం మజలీగా నిలిచారుట. స్త్రీ పురుషులంతా వండి, తిని విశ్రమించి, లేచిన వెనుక సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ (ఆమె జన్మభూమి తిరుచ్చుళియే) అనే ఒక భక్తురాలు అక్కడ విరబూసివున్న స్మశాన మల్లెపూలూ, తంగేడుపూలూ చెట్ల నున్న వన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నదట. భగవాన్ అది గమనించి నవ్వుతూ "లక్ష్మి ఏం జేస్తున్నావమ్మా?" అన్నారట. ఆమె "పూలు కోస్తున్నా" నన్నదట.  "సరి సరి. అదా పని. మంచిదే గాని అన్ని  పూలెందుకు?" అన్నారట భగవాన్. "పూజకు" అన్నదామె. "ఓహో! పూలతో పూజిస్తే గాని పూజకాదు కాబోలు?" నన్నారట భగవాన్. "ఏమో! ఈ చెట్లు విరబూసి ఉన్నవి. అందువల్ల కోస్తున్నా" నన్నదామె. "అవునవును, విరబూసి వుంటే యేంబాగుంటవని మొండాలు చేస్తున్నావన్నమాట. ఆ సౌందర్యమంతా మనం చూచాంగా, ఇంకొకరెందుకు చూడాలని. అయినా, ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచావాయె. అంత మాత్రం హక్కు లేదా యేమి? మరెవ్వరూ ఆ అందం చూడకుండా బాగా మొండాలు చేసి వెయ్యి, అప్పుడుగాని పూజలకు ఫలం ఉండదులే" అన్నారట భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ