రమణాశ్రమ లేఖలు 125 బలవంతపు భోజనాలు 27. 6. 47
రమణాశ్రమ లేఖలు 125 బలవంతపు భోజనాలు 27. 6. 47
https://bhagavanraman.blogspot.com/2019/04/126-28647_27.html
ఈ మధ్యాహ్నం మూడు గంటలకు అరుణగిరికి ఈశాన్యంలోని మఠంనుంచి ఒక భక్తులు వచ్చి , నమస్కరించారు . భగవాన్ చూచి “ కోవిలూరు మఠంలో ఉన్న స్వామి గతించారని తంతివచ్చిందే ? నటేశస్వామి వెళ్ళారా ? ” అన్నారు . “ వెళ్ళారు . రెండు రోజులయింది . అనారోగ్యంగా ఉన్నారని ముందే తెలిసింది . ” అన్నారు వారు. “ నటేశస్వామి అంటే ఎవరు ? ” అన్నారొకరు . “ ఇప్పుడు ఈశాన్య మఠాధిపతిగా ఉన్నవారే . కోవిలూరు మఠంలో గతించారన్నానే , వారూ లోగడ ఇక్కడి ఈశాన్యమఠంలో ఉన్నవారే. కోవిలూరులో అప్పటి మఠాధిపతి గతించినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి , ఆ పీఠాధిపత్యం ఇచ్చారు . ఈ వైపున వేదాంతమఠాల్లో అదే ముఖ్యమైనది. వీరికి పాండిత్యం తక్కువైనా, మంచి సాధువగుట వల్ల, వీరే కావాలన్నారు. ఇరువది ఏండ్లయిందనుకుంటా"అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/427776948038292/?app=fbl
"భగవాన్ని బండి ఎక్కించింది వీరేనా ? ” అన్నా నేను . " కాదు . వీరికన్న ముందున్నవారు . వారు వీరివలె కాదు . చాలా గంభీరమైన వ్యక్తి ” అన్నారు భగవాన్. " బండి ఎక్కిందెప్పుడు ? ” అన్నారొకరు . “ విరూపాక్షగుహలో ఉండగానే అక్కడకు వచ్చిన నాలుగైదేండ్లకు . అదొక చిత్రకథ . ఒకనాడు నేనూ , పళనిస్వామి గిరిప్రదక్షిణం వెళ్ళి కోవెల వద్దకు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది . అలసటగా ఉండటం వల్ల , కంబత్తిల్ సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో పడుకున్నాను , పళని అన్నం తెస్తానని సత్రానికి వెళ్ళాడు . వారు గుళ్ళోకి వెడుతున్నారట . వారిచుట్టూ శిష్యులుంటారు కదా ? అందులో , ఒకరు నన్ను చూచి బాహ్మణస్వామి ఇక్కడున్నారని చెప్పారట . ఇంకేం , తిరిగి వెళ్ళుతూ పదిమందితో వచ్చి , చుట్టూ నిలిచారు. “ లేవండి స్వామీ , పోదా ’ మంటారు . నేను మౌనస్వామినాయే . రానని సంజ్ఞ చేసాను . వారా వినేది . ' ఎత్తండిరా ఎత్తండి 'అన్నారు . సరే , ఇక తప్పదని లేచాను . బయటికి వస్తే , బండి సిద్దంగా వుంది . ' ఎక్కండి స్వామీ ' అన్నారు . ' నేనెక్కను . నడిచే వస్తాను . మీరెక్కి వెళ్ళం ' డని సంజ్ఞ చేస్తే వింటారా ? ' ఊ . చూస్తారేంరా ? స్వామిని ఎత్తి బండిలో కూర్చోబెట్టండి . ' అన్నారు . అంతా పదిమంది ఉన్నారాయె . మనవైపున మాట్లాడేవా రేవరూ లేరు . సరే , ఎత్తి బండిలో కూర్చోబెట్టారు . పలక్కుండా మఠానికి వెళ్ళాను .
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
పెద్ద విస్తరి వేసి వడ్డించి ' ఇక్కడే ఉండిపోండి స్వామి ' అంటూ ఉపచారం చేసారు . పళనిస్వామి కోవెలకు వచ్చి చూచి , విషయం విచారించి తెలుసుకొని , మఠానికి వచ్చారు . వారు వచ్చిన తరువాత ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయాను . ఈ ఊరు వచ్చిన తరువాత అదే బండి ఎక్కటం . ఆ తరువాత , ఒకటి రెండుసార్లు కొత్తవారెవరో వస్తే , నన్ను రమ్మని బండి పంపారు . ఇప్పుడు సందిస్తే వదలరనీ , ఈ ఉపద్రవమంతా మనకెందుకనీ , రానని చెప్పి బండి తిప్పిపంపాను . అంతటితో బండి పంపటం మానారు . అదొకటేనా వారి ఉపద్రవం . పిలిచినప్పుడు వెళ్ళకున్నా ప్రదక్షిణం వెళ్ళి వస్తూనో , మరెప్పుడైనా మఠానికి వెడుతుండేవాణ్ణా. వెడితే , నన్నక్కడ కూర్చోబెట్టి లోపలకు వెళ్ళి వంటవారితో గుసగుసలాడి వచ్చేవారు . భోజన సమయంలో అరటియాకు పెద్దది వేయించి , తాము నా ప్రక్కనే కూర్చుని ' వేయండిరా వేయండని ఎన్నో పదార్థాలు వడ్డింప చేసేవారు . మిగతా దినాలలో వారు పంక్తికి వచ్చేవారు కారు . ఇందుకుగాను నా ప్రక్కనే కూర్చుండేవారు . నేనవన్నీ తినగలనా ? కాస్త కాస్త రుచి చూచి లేచి వెళితే , ఆ శేషం అన్ని పదార్థాలతో కలిపి స్వామి ప్రసాదమని తినేవాళ్ళట .
రెండు మూడుసార్లది గమనించి , ఇదికాదని బుద్ధిపుట్టినప్పుడు చెప్పకుండా వచ్చి పచ్చెయమ్మన్ కోవెల్లోనో , ఎక్కడో ఉండి , నైవేద్యపు గంట కొట్టగానే వెళ్ళి , వీధి గుమ్మంలో నిలిచి ఆ నివేదన చేసింది తెమ్మంటే తెచ్చేవాళ్ళు. దోసెట్లో వేయించుకొని తినేవాణ్ణి . దాల్లో ఉప్పుగూడా ఉండేది కాదు . * ఏదైతేనేమి ? ఆకలి తీరటం ప్రధానం . ఆ మఠాధిపతి మేడమీదనే ఉంటూ ఉండటం వల్ల కొన్నాళ్ళిది తెలియలేదు . ఒకనాడు అకస్మాత్తుగా వారి కంటబడింది . 'ఎవరురా? స్వామికి మర్యాద చేయక ఉప్పులేని ఆహారమిచ్చిం ' దని కోపగించుకున్నారు తరువాత విషయం విచారించి తెలుసుకొని పై ఉపద్రవం మానారు . ఇపుడు గతించారే వీరు మాత్రం అలా కాదు . మహాసాధువు . అందరితో పాటు నా ప్రక్కనే కూర్చుని తినేవారు . అందరివలెనే నాకూ పెట్టించేవారు ” అన్నారు భగవాన్ .
“ అక్కడొకసారి భగవాన్ ప్రవచనం కూడా చేసారట కదూ ” అన్నారొకరు . “ అవును . ఇప్పుడు గతించిన వారుండగానే . వారు పాఠం చెపుతుండగా వెళ్ళా నొకసారి . మర్యాదచేసి కూర్చోబెట్టారు . కానీయండి పాఠం అన్నాను . ' స్వామి ఎదుట నేనా పాఠం చెప్పేది . స్వామే చెప్పాలి . తప్పదని గీతాసారం తెప్పించి , శిష్యునిచేత చదివించి చెప్పమన్నారు . ఇక తప్పదని అర్థం చెప్పాను ” అన్నారు భగవాన్ .
“ రామచంద్రయ్యరు తాత వారింటికి ఒకసారి పిలుచుకొని వెళ్ళారని విన్నామే?" అన్నారు వారు. అది ఇంకా ముందే, 1896లో. నేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉన్నాను. వారు నిత్యం నా వద్దకు వచ్చి , కాసేపు కూర్చుని వెళ్లేవారు . నేను మౌనంకదా? మాట లేదు, మంతి లేదు. అయినా వారికి అమిత భక్తి . ఒక దినం మధ్యాహ్నం భోజనానికి ముందే ఇంకొకరిని వెంటబెట్టుకుని నా వద్దకు వచ్చారు . చెరి ఒక పక్క నిలిచి 'స్వామీ లేవండి పోదా ' మంటారు . ఎందుకని సంజ్జ చేసాను . విషయం చెప్పారు . నేను రానన్నాను . వింటారా ? చెయ్యి పట్టుకొని అమాంతం లేవదీశారు. ఎత్తుకొని పోదామన్నంత తీవ్రంగా ఉన్నారు . ఇంత లావూ, అంత పొట్టా , ఆజానుబాహువు మనిషి . నేనప్పుడు బక్కచిక్కి ఉన్నాను . వారి వేలుకైనా చాలెట్లు లేను . వెంట వచ్చినవారు వీరిని మించి ఉన్నారు . ఏం చేసేదీ? ఎత్తుకునైనా పోయేట్టున్నారు . చాలా భక్తితో పిలుస్తున్నారని తెలుసు . ఇక వాదించి లాభంలేదని నడిచే వెళ్ళాను . సింహద్వారం వద్దనుంచే ఎన్నో మర్యాదలతో లోపలకు తీసుకొని వెళ్ళి , అరటాకులో భోజనం సుష్టుగా పెట్టి పంపారు . ఇక్కడి గృహస్థుల ఇళ్ళల్లో ఆకువేసుకొని తిన్నది ఆ ఒక్క యింట్లోనే ” అన్నారు భగవాన్ .
(శివాలయాల్లో నివేదనకు ఉప్పులేని ఆహారమే ఉపయోగిస్తారు .)
Comments
Post a Comment