రమణాశ్రమ లేఖలు 123 కరతల భిక్ష 20.6.47
రమణాశ్రమ లేఖలు 123 కరతల భిక్ష 20.6.47
https://bhagavanraman.blogspot.com/2019/04/123-20647.html
నాలుగయిదు రోజుల క్రితం ఆశ్రమంలో మాధవస్వామి నోటుబుక్ ఒకటి దొరికింది . శ్రీవారది చూస్తుంటే తామెప్పుడో రాసిన తమిళపద్య మొకటి కంటపడింది . మళయాళపు అక్షరంలో ఉన్న ఆ పద్యం అరవ అక్షరంలో రాస్తూ దాని భావం మాకిలా చెప్పారు : “ మనుష్యునకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరం పై లక్ష్యం ఉండదు . ఎంత చక్కని విస్తరికానీ భోజనానంతరం విసరి పారేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారవేద్దామా అని చూస్తాడు . ఇదే ఈ పద్యంలోని సారాంశం ”.
https://www.facebook.com/359807631501891/posts/429413531207967/?app=fbl
“ ఏ కారణం వల్ల భగవాన్ ఈ పద్యం రాసారో ” అన్నారొక భక్తులు . " తమిళ్ భాషలో ప్రభులింగలీల అనే ఒక గ్రంథంలో ఇదేభావం నాల్గు పాదాల పద్యంగా ఉండటం చూచి , సంగ్రహంగా రాస్తే మంచిదని తోచి ఈ చిన్నగీతం రాసాను . రెండే పాదాలిది ” అని చెప్పి , దానిని తమిళాక్షరంలో రాసి ముగించి , “ చూడండి . ఈ ఎంగిలాకు ఉపమానాలు ఎందరో చెప్పారు . ఎంత బాగా కుట్టిన విస్తరైనా, భోజనమయ్యేవరకే. ఆ తరువాత దానియందు లక్ష్యం ఉంటుందా ? వెంటనే పారవేస్తాం . ధనవంతులైతే వెండితో చేయించి , బంగారు పూలు వేయిస్తారు .
భగవంతుడిచ్చిన చేతులుండగా అవన్నీ ఎందుకో. నేను కొండమీద ఉండగా, ఒకరు వెండితో విస్తరి చేయించి తెచ్చి 'స్వామీ, దీనిలో భోజనం చేయా లన్నారు'. నాకెందుకని పంపేసాను. ఏమో, చేతిలో వేయించుకొని తింటే తీరేదానికి వెండి , బంగారమూ, ఎందుకూ. నేను చాలాకాలం విస్తరి వేయించుకు తిననేలేదు . ఎవరైనా ఆహారం తెస్తే , ఇలా చెయ్యిచాచి , చేతులో వేస్తే తినేవాణ్ణి . ఈ మధ్య కదా ఆకులో భోజనం ” అన్నారు భగవాన్ .
అందుకే, కరతామరసేన సుపాత్రవతా ' అని గణపతి ముని స్తుతించారు ” అన్నారొకరు. “నిజమే . సహజమైన చేతులుండగా ఇవన్నీ ఎందుకో . నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది . ఇలా దోసిలిపట్టి భిక్ష తీసుకొని . వీధుల మధ్య పోతుండేవాణ్ణి . తినటం అయిపోతే , చేయి నాకుతూ పోయేవాణ్ణి. ఏదీ లక్ష్యం ఉండేది కాదు . ఎవరినిగానీ , ఎప్పుడూ ఏదీ అడుగుటకు అభిమానం కదా ? అప్పుడు కరతలభిక్ష ఎంతో వేడుకగా ఉండేది . ఈ పక్కా ఆ పక్కా పెద్ద పెద్ద శాస్త్రులవారుండేవారు . ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగస్థులూ ఉండేవారు . ఎవరుంటే నాకేమి ? దరిద్రుడై భిక్షకు వెళ్ళితే దీనత్వం తోస్తుందికాని , అహం నాశనమైన అద్వైతికి అది మహాభాగ్యంగా తోస్తుంది . అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యం ఉండదు . నేనా విధంగా భిక్షకు వెళ్ళి చప్పట్లు కొట్టగానే , నన్నెరిగినవారు స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు . ఎరుగనివారు . ' ఏమయ్యా , బాగా బలిసి ఉన్నావే . భిక్షకు రాకుంటే కూలికి పోరాదూ ? ” అనేవారు . నవ్వు వచ్చేది . మౌనస్వామిని కదా ? మాట్లాడనాయె . ఇలా అనటం సహజమేనని నవ్వుతూ వెళ్లేవాణ్ణి . వాళ్ళన్నకొద్దీ సరదా ఎక్కువయ్యేది . అదొక వేడుక సుమా . ”
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
“ భగీరథుడు గంగను భూమికి రప్పించక పూర్వం జరిగిన కథ వాసిష్ఠంలో ఉంది . వారు చక్రవర్తులుకదా ? వారికి ఆత్మజిజ్ఞాస వల్ల , ఆ రాజకీయం భారంగా తోచింది . సద్గురుని సలహా ననుసరించి, యాగమనే నెపంతో,ధనధాన్యాదులన్నీ దానమిచ్ఛారు. రాజ్యం ఎవరూ అంగీకరించలేదు. పక్కనే వేచి ఉన్న శతృరాజును చేరబిలిచి స్వరాజ్యం ధారాదత్తం చేసారు. ఇక దేశ పరిత్యాగం చేయాలి. అర్థరాత్రి మారు వేషంతో పలాయనం అంగీకరించి పరదేశంలో తమను ఇతరులు ...
గుర్తించకుండా అక్కడక్కడ దాక్కొని , రాత్రి రాత్రి భిక్షాటనతో కాలం కొన్నాళ్ళకు పగలే భిక్షమెత్తి , అభిమానరహితమైన మనఃపరిపాకం కలిగిందని నిశ్చయించారు . ఆ తరువాత స్వదేశమేల పోరాదని అక్కడికి వచ్చి భిక్షాటన సాగించారు. ప్రజలు గుర్తింపనట్లుగా కొన్నాళ్లుండి కరతల భిక్ష గ్రహిస్తూ అన్ని చోట్లూ తిరిగి మన అంతఃపురమన్న అభిమానం ఎందుకని , ఒకనాడక్కడికే వెళ్లారు . కావలివారు గుర్తించి , మహారాజా వచ్చారని ఆదరాభిమానములు చూపి , వణకుతూ అప్పటి రాజుకు విన్నవించారు . వారు ఆత్రంతో వచ్చి , రాజ్యం గ్రహింపుడని ప్రార్థిస్తే , సుతరాం ఒప్పుకోలేదు. భిక్ష పెడతావా ? లేదా ? అంటారు . వారికిక విధిలేక భిక్షపెడితే , మహాసంతోషంతో గ్రహించి వెళ్ళారు . ఆ తరువాత ఏదో నెపంతో , ఏదో రాజ్యానికి రాజయి . తమ రాజ్యమేలే రాజు గతిస్తే , ప్రజల ప్రార్థనానుసారం దానినీ పాలించారట . ఆ కథంతా వాసిష్ఠంలో విపులంగా ఉంది . మొదట భారంగా తోచిన రాజ్యం అప్పుడేమీ బాధించలేదట . ఇంతకూ చెప్పవచ్చిందేమంటే , భిక్షయొక్క సుఖం వారికే తెలుస్తుంది . దరిద్రుడై భిక్షమెత్తటం , ఎంగిలాకుల్లో మెతుకులు ఏరి తినడం ఘనం కాదు . చక్రవర్తి భిక్షమెత్తాడంటే , ఆ భిక్షయొక్క ఘనం చెప్పాలా ? భిక్ష అంటే ఆ భిక్ష భిక్షగాని , ఇప్పటి భిక్షలా ఏమి ? ఇప్పుడిక్కడ భిక్షంటే వడా పాయసం తప్పదు . కొన్ని కొన్ని మఠాలలో మరీ గొడవలు . పాదపూజలకే పైసా తెమ్మంటారు . మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితేకాని ఆపోశనం పుచ్చుకోమంటారు . మహత్తరమైన ఆ కరతలభిక్ష యొక్క తాత్పర్యం ఈ తీరున పరిణమించింది ” అన్నారు భగవాన్.
శ్లో :
*మూలం తరోః కేవల మాశ్రయంతః|*
*పాణిద్వయం భోక్తు మమత్రయంతః||*
*కంథామివ శ్రీమపి కుత్సయంతః|*
*కౌపీనవంతః ఖలుభాగ్యవంతః||* (ఆచార్యకృత యతిపంచకం)
T.Me/BhagavanRaman
Comments
Post a Comment