రమణాశ్రమ లేఖలు 91 . మాయ 9-2-47
ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నిన్న ప్రశ్నించినవారే మాయను గురించి ప్రశ్నిస్తూ , “ స్వామీ , మనస్సుకు ఆభాసగా తోచే గుణవికారాలన్నీ మాయన్న మాటే కదా ? ఆ వికారాలన్నీ తోసివేస్తే , మాయ లేకుండా పోతుందా ? ” అన్నారు . “ తాను వేరు , ఈశ్వరుడు వేరు అనే భావం ఉన్నంతకాలం , మాయ , మాయగానే తోస్తుంది . ఆ మాయను తోసిపుచ్చి , తానే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు మాయ తనకన్న భిన్నం కాదని గ్రహిస్తాడు . మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు గాని , ఈశ్వరుడు లేక మాయ లేదు." అన్నారు భగవాన్." అంటే అప్పుడు మాయ శుద్దమాయగా మారుతుందన్నమాట. అంతే కదా? " అన్నారా పృఛ్ఛకులు."అవును . అలాగే చెప్పవలసి వస్తుంది. తానొకడుంటే కదా ఈశ్వరుని తెలుసుకోవడం? మాయలేక తాను లేడు . తానెవరో తెలుసుకుంటే , మాయ దోషాలు తనకంటవు . శుద్ధ మాయనుకోండి , ఏమన్నా అనుకోండి , ఉన్న దోషాలు తనకంటవు . ఈ సమాచారమది ” అన్నారు భగవాన్.
మరొకరందుకొని “ జీవుడు , మాయా దోషాలైన కించిజ్ఞత్వాది గుణాలు కలవాడనీ , ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడనీ , ఆ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటే , జీవేశ్వరైక్యం కలుగుతుందనీ అంటారే ? ఆ యీశ్వరుడి వరజత్వాది గుణాలు మాత్రం పోవద్దా ? అవి మాత్రం మాయ కాదా ? ” అన్నారు . " అదా సందేహం ? ముందు ఈ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి . ఆ తరువాత సర్వజ్ఞత్వాది గుణాలను గురించి యోచిద్దాం . మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు . ఈశ్వరుణ్ణి గుజించి మీకేల చింత ? ఆయన సంగతి ఆయనే చూచుకుంటాడు . మనపాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా ఏం ? ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు ? పోతే మనకెందుకు ? మన సంగతి మనం చూచుకుంటే అదే పదివేలు ” అన్నారు భగవాన్ .
“ ఈ గుణాలు పోగొట్టుకోటానికి తగిన సాధన నెటిగించే గురువును వెదకాలి కదా ముందు ? ” అన్నారు వారు . “ ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే , గురువు దొరకడా ఏమి ? పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి ముందు . కలిగితే , గురువే వెతుక్కుంటూ మనవద్దకు వస్తాడు . కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు . ఆ గురువు మన్నెప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు . ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు . తన బిడ్డల క్షేమం తండ్రీకంటే విచారించేవారెవరు ? ఆయన , సదా మనచుట్టూ ఆవరించే ఉన్నాడు . పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు . అయితే , మనం హృదయపూర్వకంగా నమ్మాలి ” అన్నారు భగవాన్ .
లోగడ , భయస్తురాలైన శంకరమ్మ అనే భక్తురాలు ఇలాటి మాటలన్నీ విని “ స్వామీ , సాధనకు , గురూపదేశం అవసరంగా ఉన్నట్టున్నదే ? " అని , సమయం చూచి చల్లగా అడిగింది . “ ఓహో , అలాగా , సదా ఉపదేశం జరుగుతూనే ఉంది . కావలసినవారు గ్రహింపవచ్చునే ” అన్నారు భగవాన్ " గ్రహించేటట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నా ' అందామె . “ ఉన్న అనుగ్రహం ఉండనే ఉంది ” అన్నారు భగవాన్ .
Comments
Post a Comment