రమణాశ్రమ లేఖలు 176. ప్రకృతి దృశ్యం 11 - 4 - 48

రమణాశ్రమ లేఖలు 176. ప్రకృతి దృశ్యం 11 - 4 - 48 
https://bhagavanraman.blogspot.com/2019/03/186-11-4-48.html
       ఈ మధ్య ఎండలు ముదిరినందువల్ల హాల్లో చోటు చాలదని దినమంతా స్వర్ణోత్సవ పర్ణశావలోనే ఉండటం సాగించారు భగవాన్ . సాధారణంగా సోఫా వెనుక తడికలు కట్టి ఉండేవి . గాలి రావాలని నిన్న సాయంత్రం సేవకులా తడికలు ఎత్తి నిలిపారట . నేనది చూడలేదు . ఈ ఉదయం ఎనిమిదింటికి వెళ్ళాను. భగవాన్ సోఫామీద చిన్ముద్రాంకితులై దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి వలే కూర్చున్నారు . వెనకవైపున ఉన్న మామిడి చెట్లు శాఖలతో మైదానమంతా పందిరి వలే కప్పుకుని ఎర్రని చిగురుటాకులతో సన్నని పూతతో వసంత శోభను తెలియజేస్తూ ఉన్నవి . ఆ ఆకులకూ , ఆ పూతకూ మధ్య చిన్న ఆ శివలింగాలవలె పిందెలు గుత్తులు గుత్తులుగా వ్రేళ్ళాడుతూ ఉన్నవి . " కుడిప్రక్కనున్న పూలతోటలోని పందిళ్లు విరబూసి ఉన్నవి . సోఫా నానుకొని వెనుక భాగంలో క్రోటన్లు పెట్టారు . ఎడమ ప్రక్క సిమెంటుతో కట్టిన నేలతొట్టిలో నీరు పోసారు . అందులో పిచ్చుకలు జలక్రీడలాడుతున్నవి . సోఫాకు దగ్గరగా చేరి రెండు ప్రక్కలా తెల్ల నెమలీ , రంగుల నెమలి నుంచున్నాయి . అగరువత్తుల ధూపం , ఘుమఘుమలాడుతూ భక్తుల నాసికా రంధ్రాలలో ప్రవేశించి, సువాసనలనిస్తోంది . ఆకుల సందుల్లోంచి నీరెండ బంగారు పూతవలె అక్కడక్కడ ప్రసరించి , భగవాన్ శరీరం మీదికి ఎగబ్రాకి , వింతశోభను చేకూరుస్తూ ఉంది. ఆ దృశ్యం చూచి నమస్కారం చేసానో లేదో అలాగే నిలబడి పోయినాను .
https://www.facebook.com/359807631501891/posts/399542067528447/?app=fbl
     ఏమమ్మా ? " అన్నట్లు సంజ్ఞ చేశాడు రామచంద్రయ్యర్. నా సంతోషం పట్టలేక , " అన్నా ! ఆ దృశ్యం చూచారా ? చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఎంత బాగుందో . ఇలాగే ఫోటో తీస్తే బాగుండునే " అన్నాను . భగవాన్ ఉలిక్కిపడి కదిలి " ఏమది ? ” అన్నారు . " ఏమీ లేదు . తడికలు ఎంతో కట్టారు కదా ఆ ప్రకృతి దృశ్యం ఎంత బాగున్నదో అంటున్నాను . పిందెలు వేళ్ళాడుతూ ఉన్న చెట్లూ పక్కనే పర్ణశాలవలే ఈ పాకా , ఆ పూలతీగలు ఈ క్రోటన్లూ ,ఆ తోట్టీ , ఆ పిచ్చుకలూ , ఈ నెమళ్ళూ , ఇన్నిటి మధ్య భగవానూ , భగవాన్ శరీరం మీద బంగారు పూతవలె పాకుతూ ఉన్న ఆ నీరెండా ,ఆహా ! చక్కని దృశ్యం , ఇల్లాగే ఫోటో తీస్తే ? ” అన్నాను .

        భగవాన్ మందహాసంతో చుట్టూ పరికించి చూచి " అవునవును . నిజమే. ఈ తడికలు నిన్ననే ఎత్తారుకాని , ఈ దృశ్యం ఎవరికీ మనసులో పడలేదు. ఫోటో తీస్తే బాగానే ఉంటుందోయ్ , " అన్నారు రామచంద్రరుతో. వారూ సంతోషించి " తీస్తాం ! ” అన్నారు . వెంటనే భగవాన్ పూర్వగాథను ఈ విధంగా సెలవిచ్చారు . “ నేను గురుమూర్తం దగ్గర వున్న అరటితోపులో కొన్నాళ్ళున్నాను కదా . అప్పుడు ఇలాగే ఒక మామిడి చెట్టుకింద నాకొక చిన్న మంచె ఉండేది . వాన పడకుండా పైన గూడులా కట్టారు . పడుకుంటే కాళ్ళు చాపేందుకు లేదు. చాపితే బయట ఉండేవి . చాలా భాగం గూట్లో పిట్టలా కూర్చునే వుండేవాణ్ణి. నా మంచే కెదురుగా పలనిస్వామికీ ఒక చిన్న మంచె ఉండేది. అంత తోటలోనూ మేమిద్దరమే ఉండేవాళ్ళం ."

   “ చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్యా గురుర్యువా అన్నట్లు ఉండేదన్నమాట . అప్పుడెవరూ ఫోటో తీయలేదు కాబోలు ? ” అన్నాను .

      " ఊ . అప్పుడీ ఫోటోలెక్కడివి ? ” అంటూ “ ఏమోయ్ , ఇప్పుడీ దృశ్యం ఫోటో తీయాలని అంటున్నదోయ్ " అన్నారు భగవాన్ . “ మధ్యాహ్నం ఏర్పాటు చేద్దాం " అన్నారు రామచంద్రయ్యర్ . భగవాన్ మళ్ళీ చెట్లవైపు చూచి " ఇదుగో , అక్కడి మామిడి చెట్టుకు ఇలాగే పిందెలుండేవి . అవి రాలుడు కాలంలో నా మంచెకు ఉన్న గూడుమీద రాలి టప్పుటప్పున శబ్దమయ్యేది . అవి పండినా తోలు పచ్చిగానే ఉండేది . అన్నీ పక్వానికి వచ్చిన తరువాత కోసి మగ్గపెట్టేవాళ్ళు , ఈ లోపల ఏమయ్యేదనుకున్నారు. ఒక గబ్బిలం నిత్యం రాత్రికి రాత్రి వచ్చి ఎలా కనిపెట్టేదోగాని , పక్వానికి వచ్చిన పండ్లన్నీ కొంచెం కొంచెం కొరికి తిని కిందపడవేసి పోయేది . ఆ శేషం మనకు లభించేది . గబ్బిలం ప్రసాదమన్న మాట , ” అని చెప్పేసరికి “ ఆ తోటమాలి ఎప్పడూ పండ్లిచ్చేవాడు కాడా ఏం ? ” అన్నారు రామచంద్రయ్యరు . “ కోసి మగ్గవేసిన తరువాత ఇచ్చేవాడే . “ స్వామీ , ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోం ” డని చెప్పేవాడుగాని , చెయ్యి పెట్టేవాళ్ళం కాదు . మనకు గబ్బిలం ప్రసాదం ఉన్నదికదూ . చెట్టునే మగ్గడం వల్ల రుచిగానూ ఉండేవి . చాలదా ఏం ? ఆ మంచెలూ , ఆ ప్రకృతీ , ఆ స్వేచ్ఛాజీవనం ఎంతో సుఖంగా ఉండేది . ప్రకృతిలో ఉండే సౌందర్యం ఎంతో సంతోషం కలిగిస్తుంది " అని సెలవిచ్చారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ