రమణాశ్రమ లేఖలు 180 అష్టావక్రజనక సంవాదము 24 - 4 - 48
రమణాశ్రమ లేఖలు 180 అష్టావక్రజనక సంవాదము 24 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/03/180-24-4-48.html
మొన్న భగవాన్ సెలవిచ్చిన కథలలో అష్టావక్రుల విషయం విన్న ఒక భక్తుడు నిన్న ఉదయం శ్రీవారితో “ నిన్న తాము సెలవిచ్చిన అష్టావక్రముని జనకునకు గీతోపదేశం చేసినవారే కదా?" అన్నాడు. "అవును . ఆ గీత ఉత్తర దేశంలో ప్రఖ్యాతి వహించిందికాని , దక్షిణాపథంలో అంతగా ప్రచారంలో లేదు. ఈ మధ్యనే విశ్వనాథం అరవంలో రాసాడు ” అన్నారు భగవాన్ .ఆంధ్రులొకరు " ఆ గీత తెలుగులో ఉందా ? ” అన్నారు . “ ఆహా ! ఉంది . ఆ గీత మాటకేమిగాని, ఆ గీతోపదేశార్థం అష్టావక్ర , జనకులకు జరిగిన సంవాద కధాచిత్రంగా ఉంటుంది ” అన్నారు భగవాన్ . “ ఆ కథ భగవానే సెలవీయాలి ” అన్నారా భక్తులు.
https://www.facebook.com/359807631501891/posts/397312527751401/?app=fbl
భగవాన్ దయతో ఇలా సెలవిచ్చారు . “ మిథిలాధినాథులు అందరినీ జనకులనే అంటారు కదా . అందులో ఒక జనకుడు ఆత్మజ్ఞానం పొందక పూర్వం అతని ఆస్థానంలో ఉన్న ఒక పండితుని పుత్రుడు శాస్త్రపఠనం చేస్తూ , ఒకనాడు 'గుఱ్ఱము రికాబులో. ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానము సిద్ధించును' అన్న వాక్యం చదివాడు . రాజు అది విని , ఒక రికాబులో కాలుపెట్టి రెండవ కాలు ఎత్తేలోపల జ్ఞానము సిద్ధిస్తుంది అన్న ఈ శాస్త్ర వాక్యం సత్యమా? ? లేక కల్పితమా ? ' అని ప్రశ్నించాడు . "సత్యమే . అందుకు అణుమాత్రం సందేహం లేదు ' అన్నాడు ఆ కుర్రవాడు . నా బుద్దికి ఇది అసంభవమని తోస్తుంది . యదార్దమే అయితే , ఇప్పుడే నా గుర్రాన్ని రప్పిస్తాను. నేను దాని పైకి ఎక్కనప్పుడు ఒక రికాబులో కాలుంచి , రెండవ రికాబులో కాలు పెట్టునంతలో బ్రహ్మజ్ఞానము సిద్ధింపచేసి , ఈ శాస్త్రవాక్య సత్యత్వం రూఢి పరచండి చూద్దాం ' అన్నాడా రాజు .
అంత సామర్థ్యం నాకు లేదుగాని , ఆ వాక్యం మాత్రం అసత్యం కాదు ! అన్నాడా వటువు. రాజు కుపితుడై ' అలాగైతే ఆ వాక్యాన్ని శాస్త్రంలో లేకుండా తీసివేయండి ' అన్నాడు . వటువు జంకక - ' ఈ శాస్త్రవాక్య సత్యత్వాన్ని గురించి నాకు ఏ సంశయంలేదు కాబట్టి దీన్ని కాదని అనను ” అన్నాడు .
"రాజు వెంటనే ఆ వటువును చెరలో పెట్టి , పట్నంలో ఉన్న పండితులందరినీ రప్పించి పై విధంగానే ప్రశ్నిస్తే , వటువు చెప్పినట్లే వారూ చెప్పారు . 'అయితే ఆశ్వాన్ని తెప్పిస్తాను రుజువు చేయం ' డన్నాడు రాజు . ' అందుకు అసమర్థుల ' మని వారంటే , అందఅనీ చెఱపట్టి , ఆ పట్నంలో ప్రవేశించే బ్రాహ్మణులందరినీ పట్టి తెండని కావలివారికి కట్టడి చేసాడు. అది మొదలు బ్రహ్మణులెవరు వచ్చినా ద్వారరక్షకులు వారిని రాజుకు ఒప్పగించడం,రాజు వారిని యథాప్రకారం ప్రశ్నించి , ఖైదు చేయడం జరుగుతూ వచ్చింది.ఈ భయంకర వార్త దశదిశల మారుమ్రోగి పండితులెవ్వరూ ఆ పట్నంలో ప్రవేశించడమే మానివేసారు . కొంతకాలానికి అష్టావక్ర మహాముని ఆ నగర సమీపానికి వచ్చి, ఒక చెట్టు క్రింద విశ్రమించబోతూ , ఇద్దరు బ్రాహ్మణు అక్కడ ఉంటే వారిని ' ఈ పట్నం పాలించే ప్రభువెవ్వరు నాయనా ? ” అన్నాడా ముని. " వారిని ఏమడగదలచుకున్నారు స్వామీ ! ఈ పట్నంలో ప్రవేశించాలని అనుకుంటున్నారు? ' అన్నారా విప్రులు . " ఔనండీ ! ప్రవేశించాలనే అడుగుతున్నాను " అన్నాడా ముని .
ఆ విప్రులు వినయంతో ' స్వామీ ! ఈ పట్నం పాలించే ప్రభువు బ్రాహ్మణులు లెందరినో చెఱవట్టినందువల్ల తామిందు ప్రవేశించవద్దని మా ప్రార్థన. దౌర్భాగ్యవశాత్తు విప్రుడెవరైనా ఈ పట్నంలో ప్రవేశిస్తే 'రికాబులో కాలుపెట్టినంతలో జ్ఞానం సిద్ధిస్తుందన్న శాస్త్ర వాక్యమును రుజువు చేయమంటారు అందుకు ఆమోదించకుంటే ఖైదు చేస్తున్నాడు బాబూ ' అన్నారు . ఆ ముని చకితుడై ' ఓహో ! అదా సమాచారం . అయితే ఒక పని చేయండి . ఒక పల్లకిలో నన్ను కూర్చోబెట్టి ఆ రాజుపద్దకు తీసుకొని పొండి . ఆ శాస్త్రవాక్యం రుజువుచేసి చెరలో ఉన్న పండితులందరినీ విడిపిస్తాను ' అన్నాడు . వారానందించి వెంటనే ఒక పల్లకి తెచ్చి , మునిని అందుంచుకొని తామే వాహకులై సభలో వున్న రాజువద్ద దింపారు .
" తేజోరాశియైన ఆ మునిని చూడగానే రాజుకు పూజించాలన్న బుద్ది పుట్టింది.
వెంటనే సాష్టాంగపడి లేచి చేతులు జోడించి ' స్వామీ ! తామిచ్చటికి దయచేసిన కారణం ఏమి ? నావల్ల కాదగిన కార్యం ఏదైనా ఉంటే సెలవీయ వచ్చును ' అన్నాడు . ఆ వినయోక్తికి ఆనందించి , ' ఏం అపరాధం చేసారని పండితులందరినీ చెఱపట్టావో ముందు చెప్పు . ఆ తరువాత నా విషయం విచారించ వచ్చును అన్నాడా ముని. ' ఒక రికాబులో కాలుపెట్టి, రెండవ కాలు ఎత్తేసరికి బ్రహ్మజ్ఞానము సిద్దించునన్న శాస్త్రవాక్యం రుజువు పరచనందున వారిని కారాగార వాసులను జేసితిని. ఆ వాక్యం సత్యత్వం గ్రహించే నిమిత్తమే ఈ పని చేసాను."అన్నాడు రాజు. " సరిపోయింది.శాస్త్రవాక్యం కానంత మాత్రాన కల్పితం అని తీర్మానింపవచ్చునా ? అది మిథ్య కాదని, ఒక్కొక్క అక్షరమూ సత్యమేనని ప్రతిజ్ఞ చేస్తున్నాను ' అన్నాడా ముని " అలాగైతే ఇప్పుడే గుర్రాన్ని రప్పిస్తాను. అనుగ్రహించి , శాస్తవాక్యం రూఢి పరచండని ప్రార్థిస్తున్నా' నన్నాడు రాజు. నీ భావం శుభావహమైనది కనుక సంతోషమే. కానీ జ్ఞానోపదేశం అపాత్రులకు చేయరాదని ఎరుగుదు కదా? అది పొందాలని ఉంటే నాయందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులను వహించి, ముందు చెరలో ఉన్న పండితులందరినీ విడుదల చేసి తరువాత నీవు అశ్వమెక్కి అడవికి వస్తే నీ పాత్రతను పరిశీలించి, తరువాత ఉపదేశం చేస్తాను." అన్నాడు ముని.
ధృఢనిశ్చయ పూరితములైన ఆ ఋషి వాక్కులు వినగానే , రాజుకు ఆసక్తి అధికమై , తక్షణం ఖైదు చేసిన వారందరినీ విడుదల చేసి , అష్టావక్రుని అందల మెక్కించి , తాను అశ్వారూఢుడై , అమాత్యాది పరివారంతో అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక వటవృక్షం క్రింద నిలువగానే “ ఈ పరివారాన్నంతా పంపివేయరాదా ? ఉపదేశానికి వీరంతా ఎందుకు ? ' అన్నాడు ముని . సరేనని అందరినీ పంపి , ఆలస్యం సహించని రాజు , అష్టావక్రుల అనుమతి పొంది , అశ్వం రికాబులో ఒక కాలు పెట్టి . రెండవ కాలు ఎత్తడానికి ఉద్యమించేసరికి ' ఆగు ఆగు ” అని అదలించి ' నీ రెండవకాలు ఎత్తకముందు నా ప్రశ్నలకు బదులుచెప్పాలి ' అన్నాడు ముని. 'ఆహా ! ఆజ్ఞకు బధ్ధుణ్ణి ' అన్నాడు రాజు . “ నీవు పరిశీలించే ఈ శాస్త్రంలో , రికాబులో కాలుంచునంతలో జ్ఞానం సిద్దించును , అన్న వాక్యం ఒక్కటే ఉందా ? ఇంకా ఏమైనా ఉందా ? ” అన్నాడు ముని . ' ఇంకా అనేక విషయాలున్నవి స్వామీ ' అన్నాడు రాజు . ఆ ముని ' జ్ఞానం పొందేందుకు గురువు కావాలని చెప్పారా , లేదా ? ' అంటే ' ఆహా ! అవశ్యంగా కావాలని చెప్పబడి ఉంది ' అన్నాడు రాజు . ' మరి నన్ను గురువుగ . స్వీకరించకుండానే అనుగ్రహించమని తొందరిస్తా వెందుకు? ' అన్నాడా ముని. 'లేదు లేదు. శాస్త్రవిధి ననుసరించి ఇప్పుడే తమరిని గురువుగా వరిస్తున్నాను ” అన్నాడు రాజు . ' గురువుకు దక్షిణో? ' అన్నాడు ముని. 'ఇదుగో ఈ క్షణమే నా తను, మనో, ధనములు తమ పాద సన్నిధిలో, సమర్పిస్తున్నాను, అనుగ్రహించండి స్వామీ! అన్నాడు రాజు.....(ఇంకా ఉంది)
Telegram
T.me/bhagavanRaman
రమణాశ్రమ లేఖలు 180 అష్టావక్రజనక సంవాదము 24 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/03/180-24-4-48.html
( తరువాయి భాగం)
https://www.facebook.com/359807631501891/posts/397900707692583/?app=fbl
అది విన్న వెంటనే అష్టావక్రులు దూరంలో ఉన్న ఒక పొదలో దూరి దాక్కున్నారు. రాజు గుర్రం రికాబులో కాలు పెట్టినట్లే ఉంచి , కదలక మెదలక నిశ్చేష్టుడై నిలిచాడు. సూర్యాస్తమయం అయింది . అమాత్యులాదులంతా రాజు రాలేదని విచారిస్తూ , అడవికి వచ్చి చూస్తే , అందలం ఉన్నదే కానీ అష్టావక్రులు లేరు . రాజు చలనరహితుడై చిత్రప్రతిమవలె ఉన్నాడు. అంతా భయపడి నిలిస్తే , మంత్రి రాజును సమీపించి ' ప్రభూ , ఈ స్థితికి కారణం ఏమిటి ? ' అన్నాడు . బదులు లేదు . ఆ ముని ఏదో మంత్ర ప్రయోగం చేసి ఉంటాడని వారి నిమిత్తం వెతికారు . కనుపించలేదు . నిరాశతో రాజును పల్లకీలో పడుకోబెట్టి పట్నానికి తీసుకొని వెళ్లి రాజమందిరంలో మంచం , పడుకోబెట్టారు . వారెలా పడుకోబెట్టారో అలాగే చలనరహితుడై ఉండిపోయాడు రాజు . మంత్రి దుఖించి ఆశ్వికుల ననేకులను రావించి మునిని వెతకి తెండనీ లేకుండా ఎవరూ తిరిగి రారాదనీ కఠినంగా శాసించి పంపాడు .
' రాజు అన్నం తినలేదు సరికదా , మాటైనా మాట్లాడలేదు . నీళ్ళు నోట్లో పోస్తే మింగనైనా మింగడు . ఆ స్థితి చూచి రాణీ , రాజబంధువులూ మొదలైన పరివారమంతా దుఃఖపరవశులైనారు . ఈ వార్త సర్వత్రా వ్యాపించి , ప్రజలలో హాహాకారం బయలుదేరింది . సూర్యోదయమైనా రాజు లేవలేదు , మునీ రాలేదు . అంతా ఎదురు చూడగా కడకు ఒక సేవకుడు సూర్యాస్తమయ సమయమునకు అష్టావక్రులను అందలం ఎక్కించుకొని వచ్చాడు . వారిని చూడగానే మంత్రికి పట్టరాని కోపం వచ్చింది . కాని , కార్యం చెడుతుందేమోనన్న భయంతో కోపం తెలియపరచక ' అయ్యా ! మా ప్రభువుకు మంత్రప్రయోగం ఏదైనా చేసారా ? అన్నాడు వినయంగా . “ మీ ప్రభువుకు మంత్ర ప్రయోగం చేస్తే నాకేమి లాభిస్తుందయ్యా ? అయినా , మీ ప్రభువునే అడుగక పోయినావా ? ' అన్నాడు ముని . ' మా ప్రభువును ఏమడిగినా బదులు రాదు . రెండు రోజులుగ అన్న పానాదులే లేవు . ఏ విధంగానైనా అన్నం తినేలా చేయండి స్వామీ ! ” అన్నాడు మంత్రి , ఆ ముని అప్పుడే రాజును సమీపించి ' రాజా ! ' అన్నారు “ ఏమి ఆజ్ఞ స్వామీ?" అన్నాడు రాజు. నీకు నేనేం చేసాను ? ' అన్నారు ముని . ' ఏమీ చేయలేదే . ఆ మాట ఎవరన్నారు? ' అన్నాడు రాజు . “ అది సరి , దానికేం కాని , లేచి అన్నం తిను ' అన్నాడు ముని . '
రాజు లేచి , అన్నం తిని తిరిగి చేష్టలుడిగి కూర్చున్నాడు ' కరుణించి మా ప్రభువును యధాస్థితికి వచ్చునట్లు చేయం' డని మంత్రి ప్రార్థిస్తే , ముని ' సరే ' అని వారందరినీ ఇళ్ళకు పంపి , ద్వారం బంధించి రాజును సమీపించి రాజా ! ఈ విధంగా చేష్టలుడిగి కూర్చున్నా వెందుకు ? అన్నారు . వెంటనే రాజు స్వామి ! ఈ శరీరం మీద నాకేట్టి హక్కూలేదు . ఈ కాళ్ళూ చేతులూ నావి కావు . ఈ జిహ్వా నాది కాదు . ఈ నేత్రకర్ణాది సర్వేంద్రియములూ నావి కావు . ఈ రాజ్యం నాది కాదు.యథార్థంగా నా తను , మనో , ధనములు మీ పాదపద్మములకు అర్పించి ఉన్నాను. మీ ఆజ్ఞ లేక ఏ విధమైన చేష్టలకు అర్హుణ్ణి కాను . అందుకే ఇలా ఉన్నాను . అన్నాడు
‘ శ్రద్దా భక్తి సమన్వితములైన ఆ పల్కులు విని ప్రసన్నహృదయుడైన ముని , ఆ చక్రవర్తి తలమీద హస్తముంచి ' నాయనా ! నీకు ముక్తుడవగుటకు తగిన ఉన్నదో లేదో తెలుసుకోవాలని ఈ ప్రథమ పరీక్ష చేయవలసి వచ్చింది. నా కిప్పుడు అనుగ్రహింప తగిన అధికారివి లభించావు . నీ విప్పుడు బ్రహ్మ స్వరూపుడవే. సదా ముక్తుడవు, కృతకృత్యుడవు, ప్రాప్తపాప్యుడవు, అఖండ సుఖస్వరూపుడవూను ' అన్నాడు . ఆ రాజు ' నేను పరిచ్చిన్నడను , వికారిని , అజ్ఞానిని కదా . బ్రహ్మస్వరూపుడను ఎలా అయ్యాను ' అని , తనలో వితర్కిస్తూ , ఆ మునికి నమస్కరించి ,
' కథం జ్ఞాన మవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి |
' వైరాగ్యంచ కథం ప్రాప్త మేతద్ర్బూహి మమ ప్రభో | | అని ప్రార్ధించాడు
. (తా . స్వామీ ! జాసం ఏ విధంగా సిద్ధిస్తుందో , ముక్తి ఏ విధంగా లభిస్తుందో , వైరాగ్యం ఏ తీరున ప్రాప్తిస్తుందో దానిని నాకు వివరింపగోరుచున్నాను . )
' ఆ తరువాతనే అష్టావక్రగీత ప్రారంభించబడి ప్రశ్నోత్తర రూపకంగా ఏర్పడి , జనకునకు తత్త్వోపదేశమయింది . ఆ ఉపదేశంతో కలిగిన పూర్ణానందంచేత , రాత్రంతా గడియవలె గడిచింది . ”
సూర్యోదయం కాగానే ద్వారం తెరువబడి మంత్రీ సామంతులు లోపలికి వచ్చి పరమానందభరితుడై ఉన్న రాజును చూచి సంతసించారు. అప్పుడా ఋషి చంద్రుడు , రాజునుద్దేశించి , “ ఏమి ? ఒక రికాబులో కాలుంచి రెండవ కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధిస్తుంది ' అన్న శాస్త్రవాక్యాన్ని గురించి ఇంకా సందేహం ఏమైనా ఉంటే నీ గుఱ్ఱన్ని రప్పించు ” అన్నారు. రాజు భక్తి భరిత హృదయుడై "నా మనస్సులో ఏ విధమైన సందేహానికీ తావులేదు.శాస్త్రవచనం యథార్థం . మీ అపార కృపావీక్షణం నాపై ప్రసరించడం వల్ల కృతార్థత చెందాను ' అన్నాడు . ఇదే ఆ కథ . ఈ అష్టావక్ర గీత కూడా ఋభుగీత వలెనే కేవలం అతీత స్థితిని తెలియజేస్తుంది . అంటే , జనకులు నిజంగా మనోధనములు సమర్పించగానే , స్వస్థితిలో లీనమై సమాధిని పొందారు.' ఆ స్థితియే నీ స్వరూపమనీ , దాన్ని సహజంగా అనుభవించుమనీ ఆ గీత వల్ల తెలియ చేసారన్న మాట ” అని సెలవిచ్చారు భగవాన్ .
“ రాముని వసిష్ఠుడు ప్రబోధించినట్లే కదా ? ” అన్నాను . “ అవునవును , అయితే వాసిష్ఠంలో కథారూపకంగా చెప్పి ఉన్నది . దీనిలో ఋభుగీతలో వలెనే స్వరూపవర్ణనమే ఎక్కువగా ఉంటుంది ” అన్నారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment