రమణాశ్రమ లేఖలు 175 ముక్తి అంటే ఏమి? 9-4-48

రమణాశ్రమ లేఖలు 175 ముక్తి అంటే ఏమి? 9-4-48
https://bhagavanraman.blogspot.com/2019/03/175-9-4-48.html
   ఈ మధ్యాహ్నం మూడింటికి ఒక ఆంధ్ర యువకుడు భగవానుని సమీపించి ఖిన్నవదనంతో " స్వామీ! నాదొక విన్నపం ఉన్నది. చిత్తగించాలి. బెంగుళూరు నుంచి కొత్తగా వచ్చాను. ముక్తి పొందడానికి ధ్యానం ఎలా చేయాలో తెలియక విచారిస్తున్నాను . అందుకు సాధనను సెలవిచ్చి తరింపజేయాలి. అనుగ్రహించి నా విచారం పోగొట్టి కడతేర్చాలి" అని ప్రార్ధించాడు . " ఇప్పుడేం చేస్తున్నావ్?" అన్నారు భగవాన్ . “ ఏమీ చేయడం లేదు స్వామీ . అందుకే ,ధ్యానం ఎలా చేయాలో సెలవీయండని అంటున్నాను . " అన్నాడాాతడు . "ధ్యానం ఎందుకు చేయాలి ? ముక్తి అంటే ఏమి ? దేనినుండి తరించాలి ? అసలు ఎందుకీ విచారం. కలిగింది ? " అన్నారు భగవాన్ .
https://www.facebook.com/359807631501891/posts/400029524146368/?app=fbl
   పాపం అతడేమీ చెప్పలేక ఊరుకున్నాడు . ఏదో ఆందోళన పడుతున్నట్లు ముఖంలో గోచరిస్తున్నది . భగవాన్ కొంచెం నిదానించి దయతో చూస్తూ  " పైన వచ్చేదంతా తోసివేసే నిమిత్తం ఇష్టదేవత మీద మనస్సు నిలిపి ధ్యానించడమో లేక స్వరూపమందే మనస్సుంచి విచారించడమో చేస్తే క్రమంగా పైదంతా పోయి , ధ్యానమే ఉంటుంది . ధ్యానం వేరే చేయనక్కర లేదు . తానుగానే ధ్యానిస్తే సదా ఉంటుంది . ఉన్నదే ధ్యానం. ముక్తిని వేరే పొందడమనేది లేదు. పైదంతా పోగొట్టుకోవడమే ముక్తి .మనస్సును ఒకచోట నిలువుకోవడానికే ప్రాణాయామాది సాధనలు . ప్రాణాయామం అంటే బయటికి విజృంభించే మనస్సును లోపల నిలుపుకోవడమే . రవంత వాయునిరోధం చేస్తే లోపల నిలుస్తుంది . జపతపాదులన్నిటికీ ముందే ప్రాణాయామం చెప్పారు. ప్రాణాన్ని కొంచెం నిరోధిస్తే అంతర్విచారణకు అవకాశం కలుగుతుంది . ఇష్ట దేవతా ధ్యానం గానీ  స్వరూపధ్యానంగానీ చేస్తే , ప్రాణం దానంతట అదే నిరోధింపబడుతుంది . అలా చేయగా చేయగా ఆ ధ్యానమే తానవుతాడు . అప్పుడు చేసేవాడూ, చేయబడేదీ అనే రెండుండవు. అంతా ఒకే స్వరూప మవుతుంది." అని సెలవిచ్చారు .

    ఆ యువకుడు అదంతా వింటూ చిత్రప్రతిమవలె కూర్చున్నాడు . భగవానే తమ పక్కనే ఉన్న ఇంకొక భక్తునితో “ ఇదిగో చూడూ . ఈశ్వరుడను , ఆత్మ అను, ఏదో ఒక పేరు . అతడు ఎప్పుడూ ఎక్కడా ప్రత్యక్షమయ్యే ఉన్నాడు . కాని , చూడలేరు . ఏదో తపస్సు చేస్తే ఎక్కడినుండో దఢీలున ఇలా ప్రత్యక్షం కావాలంటారు . ఏం చేసేదీ . అతనిలో మనమున్నాము , అతనెక్కడ , అతనెక్కడ అని వెతుకుతాం. 'నేను' అనే ఈ రవంత అహము లేచి ఇంత పని చేస్తుంది. దాని సామర్థ్యం చూడు" అని చెప్పి విరమించారు.
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ