రమణాశ్రమ లేఖలు 168 సమాన భుక్తి 7-2-48
రమణాశ్రమ లేఖలు 168 సమాన భుక్తి 7-2-48
https://bhagavanraman.blogspot.com/2019/03/168-7-2-48.html
మన అబ్బాయి తిలక్* లండన్ నుంచి ఇక్కడకు వచ్చి పదునైదు రోజులయింది . పరీక్షాఫలితం ఇంకా తెలియలేదు . త్వరగా రమ్మని తండ్రి రాయడంవల్ల , మొన్న 30వ తేదీ మధ్యాహ్నం వెళ్ళదలచి , ముందురోజు సాయంకాలమే బజారుకు వెళ్ళి , భగవాన్ కివ్వాలని ద్రాక్ష , ఖర్జూరం మొదలైన పండ్లు తెచ్చాడు . 30వ తేదీ ఉదయం ఫలాహార వేళకు , అన్నీ ఒలిచి పళ్ళెంలో పెట్టుకొని ఇద్దరం వెళ్లాం . వంటఇంటి వారు వాటిని నన్నే వడ్డించమన్నారు . అలవాటు లేనందువల్ల ముందు భగవాన్ వద్దకే తీసుకొని వెళ్లాను . గద్దింపు స్వరంతో “ ఏమది ” అన్నారు భగవాన్ . “ అబ్బాయి పళ్ళు తెచ్చాడు ” అన్నాను . “ ఓహో ! సరి, ఒక్కొక్కటే వేయండి” అన్నారు భగవాన్. శ్రీవారికి వడ్డించి అందరికీ అదే విధంగా వడ్డించాను. ఈ లోపల కొండ అరటిపళ్ళు నాలుగే ఉంటే , పది మందికి మాత్రం చిన్న చిన్న తుంపులు వేసి , పెద్ద తుంపొకటి భగవాన్ విస్తట్లో వేసాడు శివానందం . భగవాన్ చిరాకుతో “ ఇదుగో ఇవే చేష్టలు . అందరికీ సమంగా రానిది నాకెందుకు ? ” అంటూ వడ్డించేవారివి పాత లోపాలూ , కొత్త లోపాలూ ఏకరువు పెట్టారు . అంతా మెదలకుండా తిని లేచి వెళ్ళారు . భగవాన్ ప్రసన్నులై , లేచేందుకు కాళ్ళు సర్దుకుంటూ ఉండగా సెలవడిగే నిమిత్తం తిలక్ , నేనూ దగ్గరకు వెళ్ళాం . నమస్కరించి లేచి “ అబ్బాయి ఊరికిి వెళతాడట" అన్నాను .
ఓహో ! అలాగా , పళ్లు తెస్తే పరీక్ష ప్యాసయినా డనుకుని అనుకున్నాను. ఊరికి వెళుతున్నాడా? మంచిది , ” అని ప్రక్కనున్న వారికి నన్ను చూపి ఇదుగో, ఈమె ఒకతె. అందరికీ వడ్డించకుండా ముందు నాకు వడ్డించింది ” అన్నారు భగవాన్. “ అయ్యో ! క్రొత్త కావడంవల్ల అలా చేసాను . అది తప్పే ” అన్నాను. " అది సరే అందుకే చెపుతున్నాను . అందరికి వడ్డించిన తరువాత భగవానుకు వడ్డిస్తే అందరికీ సమానంగా వస్తుంది . ఒకవేళ మిగలదనుకో , మనకు లేకపోయినా బాధలేదు . అందరూ తింటే భగవాన్ తిన్నట్లే అనే సంతృప్తి కలుగుతుంది. ఎప్పటికైనా అలాగే వడ్డించాలి . ఆ పద్ధతి మంచిది . అందరూ తింటే తిన్నట్లు కాదూ ? ” అని సెలవిచ్చారు భగవాన్ . “ నిజమే పొరపాటయింది అన్నాను . “ సరి సరి , దానికేమి ” అన్నారు భగవాన్.
నీవు చూచావో లేదో , ఆశ్రమంలో ముప్పొద్దులా భోజనశాలలో గంట కొట్టడానికి ముందే , ఇడ్లీలతో సహా వండిన అన్ని పదార్థాలలోనూ కొంత తీసి ఆవులకూ , కాకులకూ , కుక్కలకూ , కోతులకూ , బీదసాదలకూ , ఆశ్రమంలో ఉండే జీవరాసులన్నిటికీ వేస్తేనేకాని భగవాన్ భోజనానికి రారు. శ్రీవారి భోజన సమయంలో ఒక్కొక్కప్పుడు పిచ్చుకలు రావడం కద్దు . వాటికి ముందు అన్నంవేస్తే కాని భగవాన్ ఊరుకోరు . ఉడుతలూ , నెమళ్ళూ వస్తే వేరుశనగపప్పు వేయిస్తారు. అలా వేయడానికి ఎప్పుడైనా ఎవరైనా విసుగుదల చూపితే భగవాన్ సహించక, “పొండయ్యా పొండి . సణుగుతూ ఎందుకిచ్చేదీ . మనమెలా వచ్చామో అవి అలాగే వచ్చినవి . మనకు ఏ విధంగా వస్తున్నదో వాటికీ ఆ విధంగానే వస్తున్నది . మనని మాత్రం ' స్వామీ , స్వామీ ! ' అని పూజించి పెట్టాలి ! వారినేమో తిట్టి పెట్టాలా ? కావాలని కొనితెచ్చామా ? ఏదో వచ్చాయి . మనమంతా రాలేదూ ? ఎందుకయ్యా విసుగు ” అని మందలిస్తూ ఉంటారు . “ నేను లాప్టులో ఫస్టు , " అనీ భగవాన్ సెలవిచ్చారు . నేనది మరచి ప్రవర్తించినందుకు ప్రబోధించారన్న మాట . ఇంకొక్క విశేషం ఏమంటే , "పళ్ళు తెస్తే పరీక్ష ప్యాసయినాడనుకున్నాను " అని భగవాన్ సెలవిచ్చిన వేళకే , అంటే 30 - 1 - 48వ తేదీనాడే లండన్లో పరీక్షా ఫలితాలు తెలిసాయట. అబ్బాయి ప్యాసయినట్లు అన్నయ్య నిన్ననే తంతి ద్వారా భగవానుకు తెలియచేసాడు మహాత్ములవాణి వృధాపోదు సుమా !
Telegram
T.me/BhagavanRaman
Comments
Post a Comment