రమణాశ్రమ లేఖలు 163 షడ్విధ సమాధులు 7 - 12 - 47
రమణాశ్రమ లేఖలు 163 షడ్విధ సమాధులు 7 -12-47
https://bhagavanraman.blogspot.com/2019/03/163-7-12-47.html
ఈ ఉదయం చొరవగల భక్తులొకరు భగవానుని సమీపించి , “ స్వామీ ! కొందఱు నిర్వికల్ప సమాధిలో చాలాకాలం ఉంటారని అంటారే , అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా ? ' అని ప్రశ్నించారు . “అదెలా ? నీవు నిద్రలో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా ? ” అన్నారు భగవాన్ . “లేదు . అయితే , నిర్వికల్పసమాధిలో మనస్సు ఉన్నదంటారా? లేదంటారా?” అన్నారా పృచ్చకులు . “ఆహా! లేకేమి. నిద్రలో ఉన్నదే అప్పుడూ ఉన్నది. చూడండీ. ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకూ తలుపులు బిగించి హాలులో పడుకుంటాము. అదీ సమాధే . భలే సమాధి. మనస్సు ఉన్నదో లేదో ఎవరు చూచారు ? ” అన్నారు భగవాన్ .
https://www.facebook.com/359807631501891/posts/406022326880421/?app=fbl
" సహజ సమాధిస్థులకో ? ” అని మళ్ళీ ప్రశ్న . “ ఆ , దానికే వాసిష్ఠంలో తురీయస్థితిని గుఱించి ప్రశ్నించిన రామునికి వశిష్టుడు మునివ్యాధోపాఖ్యానము అనే ఒక కథ చెప్పాడు. " ఒక అడవిలో ఒక మునీశ్వరుడు పద్మాసనస్థుడై కన్నులు తెరిచే తదేకనిష్టతో కూర్చున్నాడు . వేటాడవచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే , అది ఈ మునికి ముందుగా పరుగెత్తి దగ్గర ఉన్న పొదలో దూరింది . ఆ వేటగాడు దాని వెనకనే వచ్చి ' స్వామీ ! ఇప్పుడిటు వచ్చిన మృగం ఎటు పోయింది ? ” అని అడిగాడు . ' నాకు తెలియదు నాయనా ! ” అన్నారా ముని . ' మీ ముందుగానే పరుగెత్తిందే ! మీరు కళ్ళు తెఱచి చూస్తూనే ఉన్నారు కదా ' అని వేధించాడా బోయ . ఇక సమాధాన మీయకుంటే వదలడని "నాయనా మేము సర్వసములమై తురీయస్థితిలో ఉన్నాము . జాగ్రత్ ,స్వప్న సుషుప్తులు మూడూ మాకు లేవు . అవి అహంకార లక్షణాలు . ఆ అహంకారము మాకు లేదు . అహంకారమే మనస్సు . అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది. అహంకారము మానుండి ఎప్పుడో పోయింది . ఇక కన్ను మూసినా , తెరిచినా ఒకటే . మీ లేడిని గురించి నేనేం చెప్పేది ? ' అన్నారా ముని . ఇదేమిరా ఈ వెర్రిమాటలని తన దారిన తాను వెళ్ళాడా బోయవాడు . ' అహమే లేకుంటే వీరెలా మాట్లాడారు ? ' అన్న ప్రశ్న వస్తే , లోగడ అహంగా తోచిందే యదార్థం తెలుసుకున్న తరువాత స్వరూపంగా పరిణమిస్తుంది . దానినే మనోనాశనమని అంటారు . ఆ నిర్వకల్పేత్యాది సమాధులన్నీ లయమే కాని నాశం కాదు. అణగటం , లేవటం ఉన్నంతవరకూ సాధక స్థితే ' అని సెలవిచ్చారు భగవాన్.
వేరొక భక్తుడు అందుకొని “ సవికల్పమూ , నిర్వికల్పమూ అని సమ లక్షణాలు ఏవో చెప్తారు కాబోలునే ? ” అన్నాడు . “ అవును . శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధులు వివరించారు . ఎలాగంటే : సవికల్పము, నిర్వికల్పము అని సమాధి రెండు విధములు . సవికల్ప సమాధి దృశ్యానువిధ్ధము, శబ్దానువిద్దము అనీ రెండు విధములు . కామాదిదృశ్య చిత్తవృత్తులకు సాక్షియై తన్నే చింతించడం , ఆంతర దృశ్యానువిద్ద సవికల్పసమాధి . నేను అసంగ, స్వప్రకాశ , సచ్చిదానంద , అద్వైత రూపుణ్ణని తెలుసుకోవడం ఆంతరశబ్దానువధ్ధి సవికల్ప సమాధి . వీటిచేత కలిగిన స్వానుభవరసావేశం వల్ల దృశ్యం , శబ్ద రెంటినీ వదలి నివాతస్థల దీపంవలె నిశ్చలంగా ఉండడం ఆంతరనిర్వీకల్ప సమాధి . హృదయంలో వలెనే బయటను దృశ్య వస్తువుల నామరూపాదులను ఉపేక్షించి సద్రూపాన్నే చూడడం బాహ్య దృశ్యానువిద్ధ సవికల్పసమాధి. ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైకరస బ్రహ్మమని ఎప్పుడూ ఎరుక కలిగి ఉండడమే బాహ్య శబ్దానువిద్ద సవికల్పసమాధి. ఈ రెండింటి అనుభవం వల్ల నిస్తరంగ జలధివలె అఖండంగానూ , నిశ్చలంగానూ ఉండడం సమాధి . ఈ షడ్విధ సమాధులూ దృగ్దృశ్య వివేకంలో చెప్పినవే. ఈ ఆరువిధసమాధుల నిరంతరాభ్యాసం చేత, సహజ నిర్వికల్పస్థితిని అలవరచుకోవాలి. ఆ సహజస్థితి కలిగితే కాని అహం నాశనం కాదు. అది నశించినవారు చూచినా చూడనివారే, తిన్నా తిననివారే, విన్నా విననివారే, నిద్రించినా నిద్రించనివారే. వారు ఏది చేసినా చేయనివారే” అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/BhagavanRaman
Comments
Post a Comment