రమణాశ్రమ లేఖలు 162 బండిలో నిద్రించువాడు 30-11-47
రమణాశ్రమ లేఖలు 162 బండిలో నిద్రించువాడు 30-11-47
https://bhagavanraman.blogspot.com/2019/03/162-30-11-47.html
కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో అణ్ణామలై దాటాము. వేటమల మండపం వద్దకు వచ్చేసరికి కుంజుస్వామి “ అమ్మా ! ఉన్నది నలుబది పుస్తకపు అనుబంధంలో భగవాన్ ' బండి తుయిల్ వానుక్కు' అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా ? ' అన్నారు . “ లే ” దన్నాను . “ అయితే వినండి ఒకనాటి రాత్రి భగవానూ,మేమూ కలిసి ప్రదక్షిణకి వచ్చి , ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి రెండు మూడు బళ్ళు పోతూ ఉన్నవి . ఆ బళ్ళలోని వాళ్ళు కాళ్ళు చాచి పడుకొని గుఱ్ఱు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు . భగవాన్ వారిని మాకు చూపి , “ ఇదిగో చూచారా? ఇదే సహజనిష్ట వంటిది . దేహంలో నిదురించు ఆత్మజ్ఞానికి వ్యవహారం , సమాది నిద్ర మూడూ ఒక్కటే . ఎల్లాగంటే : ఇప్పుడు ఈ బండి పోతున్నది . బండిలో ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడు . ఇది జ్ఞానియొక్క శారీరక వ్యాపారం వంటిది . ఈ బండి నిలిచినా ఆసామి నిద్రిస్తూనే ఉంటాడనుకో,అది జ్ఞానియొక్క (సమాది ) నిష్ఠవంటిది . బండి గమ్యస్థానం చేరగానే విప్పుతారు . ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు . అది జ్ఞాని యొక్క నిద్రవంటిదన్న మాట , శరీరం వారికొక బండి . నడిచినా , నిలిచినా , విప్పినా ఆసామి నిద్రిస్తూనే ఉంటాడు ' అని సెలవిచ్చారు . తరువాత ఆ భావమే ' బండితుయిల్ వానుక్కు ' అనే వెణ్పా రాసారు భగవాన్ . తెలుగులో వచనంగా కూడా రాసారు ” అన్నారు కుంజుస్వామి భగవాన్ రాసిన తెలుగు వచనం క్రింద రాస్తున్నాను.
https://www.facebook.com/359807631501891/posts/406484690167518/?app=fbl
దేహములో నిదురించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార,సమాధి,నిద్రలు, బడిలోనిదురించువానికి బండిబోవుట నిలుచుట విప్పియుండుటకు సమానమే.
ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్లే రోడ్డు మలుపుకు వచ్చాము. కుంజుస్వామి “ అమ్మా ! భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణకి బయలుదేరితే మధ్య దోవలో ఉరుములు మెరుపులతో వాన పట్టుకునేది. కూడా ఉన్నవారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవారు. భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వారున్న చోటుకు చేరేవారుగాని రవ్వంతైనా తొందపడేవారు కారు . ఒకసారి ఈ మలుపువద్ద పెద్దవాన వచ్చింది. అంతా పరుగెత్తి ఈశాన్య మఠం చేరారు . భగవాన్ మాత్రం మామూలుగానే నడుస్తూ తడిసి ముద్దయి మఠానికి చేరారు . సాధారణంగా అటువెడితే ఆ మఠంవారు పట్టుకొంటారని , ఈ కొండప్రక్కనే పోయి , అదుగో , ఆ మునిసిపాలిటీ బంగళా ఉందే ఆ బంగళా వీధి అరుగుమీద కూర్చునేవారు . సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతావారంతా అక్కడ నమస్కారం చేసుకొని ఎవరి దోవన వారు పోవలసిందే . గుంపుగా వెడితే టవున్ లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అలా అందరినీ పంపి , తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకొని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డదోవన బడీ ఆశ్రమం చేరుకునేవారు .
అలా చేసినా ఏ కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు . రాత్రి ప్రదక్షిణకి వస్తే టవును సమీపిస్తుందనగానే ఎవరూ పాడవద్దనీ , పెద్దగా మాట్లాడవద్దనీ , అనేవారు భగవాన్ . ఊళ్ళోవాళ్ళకు నిద్రాభంగం కలుగుతుందనీ , మన మూలంగా వారికెందుకా కష్టమనీ శ్రీవారి" తలపు ” అని చెపుతూ ఉంటే టవునుకు వచ్చాము . రెండు గంటలయిందేమో . అంతా నిశ్శబ్దంగా ఉంది . మళ్ళి కుంజుస్వామి “ అమ్మా ! ఇంకొక పర్యాయం వేసంగిలో ఒక వెన్నెలరాత్రి భోజనం కాగానే , భగవానూ , మేమూ ప్రదక్షిణకి బయలుదేరి , ఇక్కడికి వచ్చేసరికి ఇదేవేళ అయింది . ఊరంతా నిద్రపోతూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంది . వేసంగి కనుక అన్నీ ఇళ్ళవి కిటికీలు తెరిచే ఉన్నవి అంగళ్లన్నీ తలుపులు బిగించి తాళములు వేయబడి ఉన్నవి కావలి వాళ్ళు మాత్రం గస్తీ తిరుగుతున్నారు.
భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ “ ఇదిగో , నగరమంతా ఎలా ఉందో చూచారా ? రాజవీథులూ , మేడలూ , మిద్దెలు లైట్లు అన్నీ ఉన్నట్లే ఉన్నవి . కావలివారు తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు. అందువల్ల నిశ్శబ్దంగా ఉంది . అయితే , ఈ అంగళ్ళ వారంతా తలుపులు బిగించి తాళాలు వేసుకొని నిద్రిస్తున్నారు . తెల్లవారితే లేస్తారు. ఒకటే కోలాహలం, ఇది సవికల్ప సమాధికి సమానం . అవిగో ఆ మేడలూ , మిద్దెలూ చూడండి . కిటికీలు ఉన్నవి . కాని చూచేవాడు నిద్రిస్తున్నాడు . అది తురీయస్థితి వంటిది . జ్ఞాని స్దితి ఇంతేననీ , అదికూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చును . కన్ను తెరిచి ఉన్నట్టే ఉంటుంది . వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు . ” అని సెలవిచ్చారు . భగవాన్ ప్రదక్షిణకి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు ” అన్నారు .
ఈ కథ ముగింపుతో ఇళ్ళకు చేరాము . మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారమంతా సమీపస్తులను విచారించి తెలుసుకొని “ ఏమోనయ్యా ! మీరంతా అంత సరదాగా వెళ్ళీ వచ్చారంటే నాకు కడుపుబ్బుగా ఉంది . మనం ఇప్పుడు ఎక్కడకు పోయేందుకు లేదు” అన్నారు నవ్వుతూ. ఒక భక్తుడు “భగవాన్ అడవిమార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్ళేవారట? ” అన్నాడు. “ నిజమే, చాలామంది ఉంటే రోడ్డున వెళ్ళేవాణ్ణి కాని , ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్ళేవాణ్ణి. ఒంటరిగా వెడితే కొండపాదాన్ననుసరించిన మార్గంలో వెళ్ళిపోయే వాణ్ణి ” అన్నారు భగవాన్ . " ప్రదక్షిణకి మూడు దోవలా ? ” అన్నాడా భక్తుడు . "అవును . రోడ్డు ఒకటీ , గిరిపాదం ఒకటి , ఆ రెంటికీ మధ్యన కాలిబాట ఒకటి ఉన్నది ” అని సెలవిచ్చారు భగవాన్ . “ భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు ” అన్నాడా భక్తుడు . “ సరిపోయింది . అదొక్కటేనా , కొండంతా తిరిగేవాణ్ణి . ఈ కొండమీద నా కాలుపడని చోటే లేదని చెప్పవచ్చు . ఈ కొండమీద ఎన్నో ఓషధులు ఉన్నవి, ఎక్కడపడితే అక్కడ నీటి ఊటలూ ఉన్నవి, అందువల్లనే ఈ పర్వతం సిద్దనివాసమని అంటారు. ఈమధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళిన తరువాత కోన్ని రాళ్ళు పంపవలసినదిగా , ఇక్కడకి రాస్తే వీరు పంపారు . వారు,హిమాలయపు రాళ్లూ , ఈ రాళ్లూ పరిశీలిస్తే ఇదే పురాతనమైనదని తేలిందట . ఈ విషయం వారే ఇక్కడికి రాసారు ” అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/BhavanRaman
Comments
Post a Comment