రమణాశ్రమ లేఖలు 161 కుచేలుని చేతి అటుకులు 30-11-17

రమణాశ్రమ లేఖలు 161 కుచేలుని చేతి అటుకులు 30-11-17 
https://bhagavanraman.blogspot.com/2019/03/161-30-11-17.html
    దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరం భగవానుల సెలవు పొంది ప్రదక్షిణకి వెళ్ళామని రాసే ఉన్నాను.లోగడ దీపదర్శనానికి ముందే తప్ప , దీప దర్శనం అయిన వెంటనే ప్రదక్షిణకి వెళ్ళటం అంతగా అలవాటు లేదట. భగవాన్ ఆవిధంగా ఆరంభించటం వల్ల రమణ భక్తులకది ముఖ్యమయింది. రాత్రివేళ పైవాళ్ళు ఉండరు . టవునులో ఉండే రమణభక్తులు మాత్రము చిన్న చిన్న జట్లుగా వెడుతూ ఉంటారు . మా గుంపులో స్త్రీలు , పురుషులు నూటికి పైగా ఉన్నారు . భావవీధిలో భగవాన్ దివ్యసుందర విగ్రహాన్నీ , బాహ్యంలో పర్వతశిఖరం మీద ప్రకాశించే జ్యోతినీ చూస్తూ పిండి ఆరబోసినట్లున్న పండువెన్నెలలో నడువసాగాము. భగవాన్ ప్రదక్షణానికి వెళ్ళే రోజులలో వారిని అనుసరించిన భక్తులు “ ఇదుగో ఇక్కడ భగవాన్ కూర్చునేవారు , ఇక్కడ వంట చేసేవాళ్ళం , ఇక్కడ ఈ సంగతి జరిగింది , అక్కడ భగవాన్ ఆ సమాచారం సెలవిచ్చారు ” అని చెప్పసాగారు . వారట్లా చెపుతూ ఉంటే నడిచినట్లు లేదు .
ఉషఃకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణవేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలన్న తొందరవల్ల మూడోయామం ముగిసేసరికి ఇళ్ళకు చేరామేకాని , లేకుంటే తెల్లవారవలసిందే . భక్తులు చెప్పిన ఆ సంగతులు కొన్ని రాస్తున్నాను

      అంతా మాట్లాడుకుంటూ ఉణ్ణాములై తీర్ధంవద్దకు వచ్చేసరికి "భగవాన్ ప్రదక్షణానికి వచ్చే రోజులలో వెనకబడ్డ వారంతా వచ్చి కలుసుకోవాలని ఇక్కడ కొంచెంసేపు కూర్చునేవారు. మనం కూడా కూర్చుందాము ” అన్నారొక భక్తులు. ,సరేనని అంతా కూర్చున్నాము . “ భగవాన్ ప్రదక్షిణకి బయలుదేరడం విరమించి ఎంత కాలమయిందో ” అన్నాను . “ 1926 వరకూ భగవాన్ ప్రదక్షిణానికి వెడుతూనే ఉండేవారు . అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది , ” అన్నారు కుంజుస్వామి . “ అప్పటి సంగతులలో కొన్నైనా మాకు చెప్పరాదా ? ” అన్నాను . “ సరే" నని తరువాత చేరినవారందరినీ కలుపుకొని నడవసాగగా , ఆయన ఇలా చెప్పడం ఆరంభించారు.
           https://www.facebook.com/359807631501891/posts/406724910143496/?app=fbl
   ఒకనాడు మాకందరికీ ప్రదక్షిణం వెళ్లాలన్న కుతూహలం కలిగింది . భగవాన్ తో మనవి చేస్తే సమ్మతించి , మధ్యాహ్నం భోజనం అవగానే బయలు దేరారు . భగవాన్ ప్రదక్షిణం వస్తే నిదానంగా నడవటం మామూలు . అందువల్ల ఎవరో మా ఈ ప్రయాణం చెప్పగా విని వేణమ్మ , కలుసుకోలేనా అన్న ధైర్యంతో తినుబండారాల మూట నెత్తిన పెట్టుకొని వెనక రాసాగింది .
మేము శోణతీర్థం దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి " అదుగో వస్తున్నది వేణమ్మ , ఎవరో చెప్పి పంపినట్లుంది . ఎంత వద్దన్నా ఈ చేష్టలు విడువరే "అంటూ తిరిగి చూచి  " అదిగో నెత్తిన మూట . సరే ఇందుకిదే శాస్తి ” అంటూ గబగబా నడవడం ఆరంభించారు . ఆమె వారి నడకతో కలుసుకోగలదా ? అయితేనేమి ? రొప్పుతూ రోజుతూ వస్తున్నదే కాని నిలవలేదు . భగవాన్ గౌతమాశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనక్కు తిరిగి చూచారు . ఆమె వడివడిగా నడుస్తూ వుండడం గోచరించింది . హృదయం కరిగి రోడ్డు ప్రక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారితీశారు . మేమూ శ్రీవారిని అనుసరించాము.
     
        భగవాన్ ఆ చెట్టు నీడన నిలిచి ' ఇక ఇక్కడ ఆగుదామయ్యా . బావి ఉంది . ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీటి వసతి ఎక్కడాలేదు . విడుస్తుందా అంటే అది ( వేణమ్మ ) విడువదు . అలిసిపోయింది . రొప్పుతోంది . చూడండి పాపం ! ” అంటూ కూర్చున్నారు . ఆమె మా జాడ తెలుసుకోలేక అటూ ఇటూ చూచుకుంటూ బిక్కమొహంతో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డుదాకా వచ్చి ' భగవాన్ ఎటు వెళ్లారో ఆ జాడైెనా తెలియటం లేదే ' అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు . కడకామె మా ఉనికి గుర్తించి వచ్చింది , ఆ తరువాత తెచ్చిందేదో  అందరితో పాటు తామూ తిని , ఆమెను కూడా వెంట పెట్టుకుని నడిచారు భగవాన్ , నాటినుండి మేమంతా ఆ చెట్టుకు వేణమ్మ మామిడి చెట్టని పెరు పెట్టాము .  
 
         ఈ ప్రదక్షిణకి రాత్రిళ్లు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి  రావడము, ఉదయమే వంటపాత్రలతో సహా అన్నీ తీసుకొని బయలుదేరి శోణతీర్ధం వద్ధనో, గౌతమాశ్రమంలోనో , పచ్చెయమ్మన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంటచేసి విశ్రమించి , సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడము , ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో రెండు రోజులూ , మూడు రోజులూ , దాదాపు వారం వరకు కూడా మజిలీలు మజిలీలుగా మకాములు వేసుకొని ఉండిరావడం, ఇత్యాదులన్ని పూర్వం జరిగేవని భగవానే సెలవిస్తూ ఉంటారుకదా . అలా ఉదయం బయలుదేరి  సాయంకాలానికి తిరిగివచ్చే ఏర్పాటుతో వెళ్లిన ఒక ప్రదక్షిణంలో , గౌతమాశ్రమం వద్ద ఆగి , వంటా భోజనాలూ అయి , విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలూ , పంచదారా , మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకొని నడుస్తున్నాము . అడి అణ్ణామలను సమీపించేసరికి రోడ్డుకు అడ్డంగా తొలిగి అతి తొందరగా నడువసాగారు భగవాన్ . జనసంకులం తప్పించుకొనడానికి కాబోలని అనుకుంటూ మేమంతా శ్రీవారిని అనుసరించాము .
       
  
  భగవాన్ ఆ దోవన అరఫర్లాంగు పోయేసరికి కోనేరు వచ్చింది . ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం క్రింద ఒక వృద్దుదు గొంగడి కప్పుకొని, ముంత ఒకటి ముందుంచుకొని కూర్చున్నాడు . అతనెప్పుడూ భగవాన్ ప్రదక్షిణం వస్తే , తినేందు కేదైనా తెచ్చి ఎదురుగా వచ్చి ఇచ్చేవాడు . అతి బీదకాపు . ప్రతిసారీ అతని కేందుకీ ఉపద్రవం , తప్పించుకొందామనే , భగవాన్ ప్రక్కదోవగా పోబోతే అతడు అక్కడే ప్రత్యక్షం . తప్పించుకునే వీలులేకపోయింది . వెంటనే అతణ్ణి పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నిలిచారు భగవాన్ . ఆ వృద్దుడు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు . “ ఏమి ? ఎక్కడా జాడయే లేదే ? పాడిపంటలు బాగున్నవా ? పిల్లలు సుఖమే కదా ? ' అంటూ ' ఆ ముంత ఏమిటోయ్ ? ' అన్నారు భగవాన్ ఆ వృద్ధుడు , చేతులు నలుపుకుంటూ ఏమి లేదు స్వామి, స్వామి వస్తున్నారని తెలిసింది . ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమి కనిపించలేదు మాఆడదాన్నడిగితే 'కుండలో సంకటి దండిగా ఉన్నది . తీసుకెళ్ళు ' అంది. ఏమి తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకొని వచ్చాను . ఎదురుగా వచ్చి ఇచేందుకు లజ్జించి ఇక్కడ కూర్చున్నాను స్వామీ ! ' అన్నాడు.
        
        భగవాన్ సంతోషంతో ' అరరే , కూళా ? ( సంకటా ) భేష్ , సిగ్గెందుకోయ్.అది చాలా మంచిది . ఏది, ఇల్లా తే ' అన్నారు . అతడు సంకోచిస్తుంటే తామే ఆముంత అందుకొని , ఆ చెట్టు క్రిందనే కూర్చొని , సేవకులతో మనం తెచ్చిన సామానంతా దింపండయ్యా ' అన్నారు భగవాన్ . సరే దింపాము . భగవాన్ ఒక పాత్ర తీసి , ఆ కూళు దానిలో వేసి , నీళ్లు పోసి బాగా పిసికి , మా సామాగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి , ఆ కూళులో పిండి , మజ్జిగ పోసి ద్రవ పదార్థంగా తయారు చేసారు . ఆ తరువాత దానిలో ఉప్పూ , శోంఠి వేసి ఒక లోటాతో ముంచి త్రాగుతూ “ ఆహా ! ఎంత రుచిగా ఉంది ” అంటూ  మాఅందరినీ చూచి “ మీరంతా ఆ పాలూ , చక్కెరా కలుపుకొని తాగండయ్యా , సామాను ఖాళీ అవుతుంది ” అన్నారు భగవాన్ . “ ఇవి భగవాన్ తీసుకోరా ? ' అని మేమంటే “ మనకు ఈ కూళు ఉందిగా . అదెందుకు ? ఇది ఫష్టుగా ఉంది . వడతీరుతుంది , బలకరంగానూ ఉంటుంది . ఎన్నో సుగుణాలున్నవి . మీకు ఇది బాగుండదు కనుక అవి తాగండి . నా వంతు పాలు , చక్కెరా ఆ వృద్దుడికీయండి ” అని సెలవిచ్చారు భగవాన్ .
        
       “ సరే , మేమంతా పాలూ చక్కెరా కలిపి ఆ కాపుకిచ్చిన తరువాత , అంతా తాగాము . భగవాన్ ఆ కాపుతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆ సంకటిని అమృత తుల్యంగా రెండు మూడు లోటాలు త్రాగి , “ కడుపు నిండిపోయిందయ్యా , రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తున్నది . మిగిలింది ఇంటికి పట్టుకొనిపో ” అని శేషం ఆ కాపుకిచ్చారు . అతడు దానిని అమృతతుల్యంగా గ్రహించి , పొర్లిపొర్లీ వచ్చే ఆనంద బాష్పములను తుడుచుకుంటూ మమ్ము సాగనంపి తన కుటీరానికి చేరుకున్నాడు . మొన్న మొన్నటి వరకూ భగవాన్ సన్నిధికి వస్తూనే ఉండేవాడు . "

  కృష్ణుడు కుచేలుని కొంగు విప్పి అటుకులు తిన్నాడని  వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా రాసాడు. ఈ ప్రభునిఈ కరుణా విలాసాలు చూస్తే ఇంకా ఎంత రాసేవాడో" అన్నాను.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ