రమణాశ్రమ లేఖలు 160 దీప దర్శన దృశ్యము 29- 11 - 47
రమణాశ్రమ లేఖలు 160 దీప దర్శన దృశ్యము 29- 11 - 47
https://bhagavanraman.blogspot.com/2019/03/160-29-11-47.html
అరుణాచల శిఖరం మీద జ్యోతి కనుపించగానే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించడం , ప్రసాదాలు పంచిపెట్టి “ అక్షరమణిమాల ” మొదలైనవి పాడడం ఇత్యాదులన్నీ చూడదగినవి. అందులో ఈ సంవత్సరం వాన లేనందువల్ల , ఉత్సవం చాలా మనోహరంగా జరిగింది . దీప దర్శనానికి ముందు భగవాన్ సన్నిధిలో జరిగే విషయాలన్నీ లోగడ రాసే ఉన్నాను. దీప దర్శన దృశ్యమును గూర్చి ఇప్పుడు రాస్తాను.
https://www.facebook.com/359807631501891/posts/407545503394770/?app=fbl
27 - 11 - 47వ తేదీన సాయంత్రం 3 గంటల నుండే భక్తులు ఉత్సవానికి సన్నాహం చేయడం ఆరంభించారు. జూబ్లీహాలులో చిత్ర విచిత్రపు రంగవల్లులు ఆమర్చి, మామిడి తోరణాలు కట్టారు.వేకువనుండీ ప్రదక్షిణానికి వెళ్లే పై జనమంతా దీపదర్శనార్థం మధ్యాహ్నం పన్నెండు గంటలకే అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళడం, రమణ భక్తులు మాత్రమే ఇక్కడ ఉండడం మామూలు. అందువల్ల ఒత్తిడి ఉండదు సాయంకాలము నాలుగు ముప్పావుకు భగవాన్ గోశాల వైపుకు వెళ్ళగానే పట్టి మంచం వేసి, పరుపులు పరచి భగవాన్ సోఫా ప్రక్కనే ఉండే సామానంతా తెచ్చి ఒక బల్లమీద పెట్టారు.మంచానికి ఎదురుగా ఎత్తైనకుర్చీపీట మీద పెద్ద ఇనుప బాణలి పెట్టి నెయ్యి పోసిపెద్దవత్తి వేశారు.దాని చుట్టూ పూలమాలలతో అలంకరించారు. ఇంతలో వెన్నంటి వచ్చే అనుచరులకు దీపోత్సవగాధలు వివరిస్తూ గోశాలవైపు నుండి వచ్చే భగవాన్ సాక్షాత్ సదాశివునివలే గోచరించడం వల్ల అంతా లేచి నిలబడ్డారు. భగవాన్ వచ్చి ఆసీనులైన తరువాత నమస్కరించి ఎడమ పక్కన స్త్రీలు, కుడి ప్రక్కన పురుషులుగా కొండవైపున ఉన్న మెట్లవరకు తీర్చి కూర్చున్నారు వారంతా సమర్పించిన టెంకాయలు,పళ్ళు, గంపలు నిండడమే కాక, రకరకాల భక్ష్యాలతో నింపిన టిఫెన్ క్యారియర్లు, కళాయిగిన్నెలు, ఇత్తడి డబ్బాలు భగవాన్ ముందు భాగమంతా ఆక్రమించినవి. జ్యోతికై పెట్టిన బాణలిలో అంతా తెచ్చిన నెయ్యి పోసేసరికి గిఱ్ఱున నిండింది. అందరు తెచ్చిన కర్పూరం వత్తిపైన పెట్టి ఉంచారు. ఆగరువత్తుల ధూపం మందమారుతంతో సఖ్యం చేసుకుని సభను సద్వాసనామయంగా చేసింది.
భగవాన్ భక్తులందరిని కారుణ్య దృష్టితో చూచి, సమీపస్దులకు గిరి శిఖరం మీద దీపం వెలిగించే ప్రదేశం చూపుతూ, దీపదర్శన తత్వం వివరించారు. అది ముగియగానే వేదపారాయణ ఆరంభమయింది. పారాయణ ముగియుసరికి సూర్యాస్తమయం అయింది. వెంటనే జూబ్లీ హాలు చుట్టూ పెట్టిన మట్టి ప్రమిదలలోని దీపాలన్నీ వెలిగించారు. పాకకు తోరణంవలె కట్టబడ్డ విద్యుత్ దీపాలకు స్విచ్చి నొక్కటంవల్ల అవన్నీ దివ్య జ్యోతులవలె ప్రకాశింపసాగినవి. “ న కర్మణా ” చెప్పకుండా అఖండజ్యోతి దర్శనార్థం అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు. సేవకులు దూరదర్శన యంత్రం తెచ్చి భగవాన్ చేతికిస్తే, భగవాన్ ఆ యంత్రం కంటి దగ్గర పెట్టుకొని అరుణాచల శిఖరంవైపు చూడసాగారు. శ్రీవారి దృష్టి అరుణగిరి శిఖరం మీద నిలిస్తే, మా దృష్టి వారి వదనమండలమందే నిలిచిపోయింది. మాకు అరుణగిరి వైపు చూడవలసిన అవసరం లేదు ఏమంటే అక్కడ దృశ్యం ఇక్కడ ప్రతిబింబితమే.
ఉన్నట్లుండి “ టప్పు టప్పు ” అనే గుండ్ల శబ్దంతో పాటు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనుపించింది . వెంటనే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు. బ్రాహ్మణ సమూహం లేచి “ నకర్మణా నప్రజయా ధనేన, ” అంటూ, వేదమంత్రం చదివి కర్పూర నీరాజనము ఇచ్చిన తరువాత భక్తులంతా ప్రణామం చేసి, విభూతీ కుంకుమను గ్రహించి కూర్చున్నారు. అందరు తెచ్చిన భక్ష్యాలలోనూ, పళ్ళలోనూ భగవాన్ కొంచెం కొంచెంగా గ్రహించిన తరువాత, ప్రాసాదాలు అందరికీ పంచి పెట్టబడ్డవి. ఆ వెంటనే కొందరు భక్తులు రెండు జట్లుగా ఏర్పడి " అక్షరమణిమాల" చరణాలు పాడుతూ ఉంటే, ఆనందోద్రేకంతో భక్తులంతా “ అరుణాచల శివ అరుణాచల శివ ” అంటూ పల్లవి పాడసాగారు. అది ముగియగానే “ కరుణాపూర్ణ సుధాబ్దే " అంటూ పంచరత్న శ్లోకాలూ, తమిళ వృత్తాలు పాడారు.
భగవాన్ బాలీసు నానుకొని, చెక్కిట చెయ్యిపెట్టుకొని, భక్తులు పాడే ఆ పాటలు వింటూ, అరుణగిరి శిఖరం దృష్టిని నిలిపి అచలాకృతి వహించారు. ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లివిరిసిందా అన్నట్లు గంభీరమౌన ముద్రాంకితమైన శ్రీవారి వదన మండలము కోటి సూర్యప్రభతో విరాజిల్ల జొచ్చింది. కుటుంబ ఆ వదన భాస్కరుని కాంతిని అర్థించే నిమిత్తం వచ్చాడా? అన్నట్లు వూర్వదిక్కున పూర్ణ చంద్రుడు ఉదయించాడు. నేను అక్కడి బాదంచెట్టును ఆనుకొని తూర్పు ముఖంగా కూర్చున్నాను. నా దృష్టి ఎడమ ప్రక్కకు త్రిప్పితే అరుణాచల శిఖర దీపదర్శనము, ఎదురుగా త్రిప్పితే షోడశకళా పరిపూర్ణ సుధాకర బింబము, కుడిప్రక్కకు తిప్పితే కోటిసూర్య ప్రభాభాసితమైన భగవానుని దివ్యముఖ మండలము. ఆహా ! ఎంత భాగ్యం . ఏకకాలంలో త్రివిధమైన జ్యోతిర్దర్శనం లభించింది కదా అనుకుంటూ మైమరిచి భగవాన్ వైపు చూస్తూ కూర్చున్నాను. ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో మగ్నమయింది నా మనస్సు. కళ్ళు మూతలు పడ్డవి.
భోజనశాలలో టంగున గంట మ్రోగడంవల్ల కండ్లు తెఱిచాను. భగవాన్ " నావంక పరకాయించి చూస్తున్నారు. ఆ దష్టి తేజోమూలం కావడం వల్ల ఎదురుచూడలేక నా తల వాలిపోయింది. భగవాన్ నవ్వుతూ భోజనశాలలో ప్రవేశించారు. భక్తులూ వారిని అనుగమించారు. భోజనానంతరం శ్రీ వారిని సెలవడిగి మేమంతా గిరి ప్రదక్షిణానికి బయలుదేరాము. ఆ సందర్భమంతా తరువాత రాస్తాను.
Telegram
T.me/BhagavanRaman
Comments
Post a Comment