రమణాశ్రమ లేఖలు 159 విచార మార్గం 25.11.47

రమణాశ్రమ లేఖలు 159 విచార మార్గం 25.11.47
https://bhagavanraman.blogspot.com/2019/03/159-251147.html
  ఈ మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాన్నుద్దేశించి "స్వామి!జ్ఞానం పొందేందుకు 'నేనెవడను?' అనే విచారణయే సాధనమంటారా?" అని ప్రశ్నించాడు.
https://www.facebook.com/359807631501891/posts/408048056677848/?app=fbl
  భగవాన్ ప్రసన్నవదనంతో "ఒక్క విచారణయే కాదు,రూపమో,నామమో,యోగమో,తపమో,జపమో ఏ ఒకటికానీ అవలంబించి పట్టుదలతో సాధన చేయగాచేయగా అదే తానవుతాడు.
అధికారి తారతమ్యాన్ని అనుసరించి ఒకటి కన్న ఒకటి మేలని అంతరాంతరాలుగ చెప్పారు. తిరువణ్ణామలకు కొందరు చాలదూరంగా ఉంటారు కొందరు దగ్గరగా ఉంటారు కొందరు ఊళ్ళో వుంటారు. కొందరు హాలులోకే వస్తారు. హాలులో అడుగు  పెట్టినవారికి అరుగో మహర్షి అంటే చాలును . తక్కిన వారికి ఆ రైలెక్క ఆ మార్గంగా పోయి , అక్కడ మారాలని ఆ రైలెక్కి ఇక్కడ  దిగితే చాలనీ , ఇదుగో ఈ దోవన పోయి ఈ మలుపు  తిరగండనీ చెప్పవలసి వస్తుంది . అదేవిధంగా అధికారి ననుసరించి సాధనలు చెప్పారు. అంతటా పూర్ణంగా ఉన్న తన్ను తెలుసుకోవడానికి కాదీ సాధనలు . పై విషయాలను తోసి వేయడానికే. పైవన్నీ తోసివేస్తే , తాను ఉన్నట్లు ఉంటాడు . సదా ఉండేది ఏదో అదే తాను. అన్నీ తనలో పుట్టినవే . ఆ విషయం ఎప్పుడు తెలియగలదంటే తన్ను తానెఱిగినప్పుడే . ఎఱుగనంతవరకూ ఈ దృశ్యమంతా యథార్థంగానే  తోస్తుంది.ఒకడు ఈ హాలులో పడుకొని నిద్రపోతాడనుకో , ఆ నిద్రలో ఎక్కడికో పోయి  దారితప్పి , ఆ ఊరు ఈ ఊరు , కొండలు , గుట్టలూ తెగ తిరిగి ఎన్నాళ్ళో తిండిలేక , నీళ్ళులేక మలమలమాడుతూ కష్టపడి , ఎవరెవరినో మార్గమడిగి తెలుసుకొని ఈ ఊరు చేరి , ఈ హాలులో అడుగుపెట్టినట్లు తోచి ' అమ్మయ్యా' అని ఉలిక్కిపడి లేస్తాడు . ఈ కథంతా ఒక్క క్షణంలోనే . లేచిన తరువాత కదా తానెక్కడికి పోలేదని తెలిసేది . ఇదీ అంతే . జ్ఞాననేత్రం తెరిచినపుడు తాను తానుగనే ఉన్నానని తెలుస్తుంది ” అని సెలవిచ్చారు . “

   అన్ని సాధనలూ విచారమార్గంలో అణగినవేనని అంటారే , నిజమేనా ? అన్నాడా పృచ్ఛకుడు . “ అవును , ' నేనెవడ ' ననే విచారణయే వేదాంతబోధలన్నిటికి మొదలూ , చివరాను . సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచారణకు అధికారి అని అంటారు . ఆ నాల్గింటిలో మొదటిదే ఆత్మానాత్మ వివేకం , ఆత్మ నిత్యం , జగత్తు మిథ్య అని తెలుసుకోవడమేనని దాని తాత్పర్యం , తెలుసుకోవడం ఎలా ? అంటే , నేనెవరు ? నా ఆత్మస్వరూపమేమి ? అని విచారించడమే . ఇది ముందే చెప్తారు కానీ అది నచ్చదు . ఏవేవో సాధనలు చేసి చేసి కడపటకానీ దానిని అనుసరించరు . ఏ . బి . సి . డీ . లు చిన్నప్పుడే నేర్పారు కదా . బి. ఏ , ఎమ్ . ఏ లైనా ఆ ఎ - బి - సి - డి లలో ఇమిడినవే . ఆ పెద్ద చదువులెందుకంటే నచ్చుతుందా.. అంతా చదివి విమర్శిస్తే కదా అన్నీ ఏ , బి , సి , డి లేనని తేలేది. అన్ని శాస్త్రాలూ అకారాది అక్షరాల్లో అణగలేదా ? అలాగని శాస్త్రాలు వల్లెవేసిన తరువాత కదా తేలేది . అల్లాగే ఒక్కొక్కటీను . ఎన్నో నదులున్నవి. కొన్ని సూటిగానూ , కొన్ని వంకరటింకరగానూ అక్కడక్కడ ప్రవహించి కడపట కడలిలో కలిసినట్లే అన్ని మార్గాలూ విచారమార్గంలో  అణుగుతవి.అన్ని భాషలూ మౌనంలో అణగినట్లే . మౌనమంటే ఎడతెగని భాషన్న మాట . అంటే , శూన్యంగా ఉండడం కాదు . తానుగానే భాసిస్తుంది . అంతా తనలోనే ఉన్నట్లు తోస్తుంది . తమిళనాడులో పెద్దలొకరు ' ఏమిరా మనం తెఱగా ఉన్నాము . లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నవి ? ' అని ఒక పాటలో పాడారు . మౌనమంటే అంతటా పూర్ణమై ఉంటుంది . ' ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ' అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది . వారు చూచినా చూడనివారే ” అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ .
Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ