రమణాశ్రమ లేఖలు 153  ఉపాధి 26.10.47

రమణాశ్రమ లేఖలు 153.  ఉపాధి. 26.10.47
https://bhagavanraman.blogspot.com/2019/03/153-261047.html
  ఈ ఉదయాన వేద పారాయణ ముగిసిన తరువాత కొద్దిరోజుల క్రిందట వచ్చిన వారొకరు భగవానుని సమీపించి "స్వామీ! జ్ఞాని సర్వకార్యాలూ చేస్తున్నా తానేమీ చేయనివాడే అంటారే. అది ఎలా సమన్వయిస్తుంది? " అనిప్రశ్నించారు.  "ఎలాగా,దానికొక కథ ఉన్నది. ఇద్దరు స్నేహితులు కలిసి పనిమీద ఎక్కడికో వెడుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు. ఒకనికి గాఢంగా నిద్రపట్టింది. రెండవవానికి స్వప్నం. ఆ స్వప్నంలో తనూ, తన స్నేహితుడూ కలిసి ఎంత కాలమో ఎక్కడెక్కడో తిరిగి, ఏవేవో చేస్తున్నట్లు కలలు కంటున్నాడు. తెల్లవారింది. మొదటివాడు లేచి,వీణ్ణి లేపి "ఏమోయ్ - నీవూ, నేనూ కలిసి అక్కడికి వెళ్ళాం,ఆ పని చేసాం, అది చూచాం ఇది చూచాం, ఇక్కడికెప్పుడు వచ్చాము"  అంటాడు. ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల ' నే నెక్కడికీ పోలేదు ఇక్కడే ఉన్నానన్నా'డు వాస్తవానికి వాడూ పోలేదు. వీడూ పోలేదు. వాడికి ఆ స్వప్న భ్రాంతివల్ల తానే కాక , తనతో వీడూ వచ్చినట్లు తోచింది. వీడికా భ్రాంతి లేదు కనుక “ నీవు పోలేదు, నేనూ పోలేదు. ఇద్దరం ఇక్కడే పడుకున్నాం. అది కలరా నాయనా అంటాడు.  ఇదంతా ఎందువల్ల? దృష్టి భేదం వల్ల, అదే విధంగా జ్ఞాని సకల కార్యాలూ చేస్తున్నట్లు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేననే భ్రాంతితో ఉన్నవారికి తోస్తుందే కాని, వాస్తవానికి వారికేదీ అంటదు అని సెలవిచ్చారు భగవాన్.
    https://www.facebook.com/359807631501891/posts/411218983027422/?app=fbl
  “ జ్ఞాని కళ్లు చూస్తున్నట్లే ఉంటవి. కాని, వారేదీ చూడరని కూడా అంటారు కదా ? ” అన్నారింకొకరు.    “ అవును, జ్ఞానియొక్క దృష్టి చచ్చిన  గొర్రె కన్నులాగా ఉంటుందని ఉపమానం చెప్తారు . కళ్ళు బాగా తెఱచి తళతళమంటూ వుంటవి. కాని తామేదీ చూడరు. బయటివారికి చూచినట్లే వుంటుంది . వారికే మున్నది " అన్నారు భగవాన్.  “ అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో? ” అన్నారా భక్తులు “ అది సరి. ఉపాధి అనేదే లేదని అనే మాట నిజమేగాని  ఉపాధి లేకుంటే పనులెట్లా చేస్తారన్న శంక వస్తుంది. అందువల్ల వారికీ ఉపాధి ఉందనే చెప్పాలి. అది అతిసూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుందని అంటారు. అది ఎలాగంటే, నీటిమీద గీతవలె వుంటుంది. గీత గీస్తున్నప్పుడు కనుపడుతుందే కాని తరువాత ఉండదు. అంతే " నన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
  " అలాగైతే ఆ సిద్ద పురుషులకు స్థూలశరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా. ఈ కొండలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవానూ అనేకసార్లు సెలవిచ్చి ఉన్నారు. ఉపాధియే లేనప్పుడు సిద్దపురుషులనే వారు విడిగా ఉండటం ఎలా? ” అన్నారా భక్తులు. “ అదా, సందేహం. అందుకే ఆ సిద్ధపురుషులలో కొంచెం భేదం చెప్తారు. ఏమంటే,

*క్షీరం క్షీరే యథా క్షిప్తం, తైలం తైలే జలం జలే|*
*సంయుక్త మేకతాం యాతి తథాత్మ న్యాత్మనిన్మునిః||*

   అని వివేక చూడామణిలో అన్నట్లు, కేవల జ్ఞానసిద్ధిని పొందినవారు పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీరపతనానంతరం  ఆత్మలో లీనమై ఉంటారనీ, కొందరికి మాత్రం కొన్ని కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటవనీ, ఆ సంస్కారాలే సంకల్పరూపంగా నిలుస్తవనీ, ఆ సంస్కారాలు | తీరేంతవరకూ ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ, అదృశ్యు - లౌతూ ఉంటారని అంటారు . ఏదో ఒకటి, ” అని సెలవిచ్చారు భగవాన్. " ఈ భేదం ఎందువల్ల వస్తుందో? ” అన్నారా భక్తులు. వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది. ” అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ