రమణాశ్రమ లేఖలు 204 (11-9-48)
రమణాశ్రమ లేఖలు 204 (11-9-48) స్వామి ఎక్కడ?
https://bhagavanraman.blogspot.com/2019/02/204-11-9-48.html
"మట్టి అడుసుతో కట్టిన అరుగుమీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు స్కందాశ్రమానికి వెడతామని భగవాన్‌తో చెప్పి వెళ్ళి, విరూపాక్ష గుహవైపుగా దిగుతూ అక్కడి విశేషాలు అన్నీ చూచివచ్చి “భగవాన్ సెలవిచ్చిన అరుగు విరూపాక్ష గుహకు ముందున్న వసారాలోనిదేనా? అది భగవాన్ స్వయంగానే కట్టారటే? అని శ్రీవారిని అడిగారొక భక్తులు. “అవునది నిజమే. వచ్చేపోయే వారు కూర్చునేందుకు అనుకూలంగా వుంటుందని అంతా అనుకున్నాము.సరేనని రాళ్లు పెట్టి మట్టి అడుసుతో నేనే కట్టాను. ఆ తరువాతనే సిమెంటు వేసారు" అని సెలవిచ్చారు భగవాన్. “ఆ అరుగు కడుతూ ఉండగా కొత్త వారు ఎవరో వచ్చి 'స్వామి ఎక్కడ?” అని భగవాన్నే అడిగితే 'ఎక్కడికో వెళ్ళారని చెప్పి పంపారట కదూ?? అన్నాను. “ఆ సంగతి మీకెలా తెలిసింది?” అని నవ్వారు భగవాన్. “ఎచ్చమ్మగారు చెప్పారు” అన్నాను.
“ఓహో! సరిసరి. నిజమే. ఒకనాటి ఉదయాన్నే రాళ్లు పేర్చి కాళ్ళతో మన్ను తొక్కి ఆ అడుసుతో అరుగువేస్తూ ఉన్నాను. వారెవరో కొత్తవారు వచ్చారు. స్వామి ఎక్కడ?' అని నన్ను అడిగారు. నేను తప్ప అక్కడ మరెవ్వరూ లేరు. అందువల్ల నేనే బదులు చెప్పవలసి వచ్చింది. 'స్వామియా. ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు' అన్నాను. 'ఎప్పుడు వస్తారని వారంటే “ఏమో'నన్నాను. ఎంతసే పవునో ఏమోనని వారు కొండ దిగి పోతూవుంటే, ఎచ్చమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నే చూపుతాను రం'డని వెంట పెట్టుకుని వచ్చింది. ఈ లోపల నేను స్నానంచేసి పచ్చి కూర్చున్నాను. పళనిస్వామి వాళ్ళూ వచ్చారు. ఎచ్చమ్మ అన్నంగిన్నె లోపల పెట్టి, నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో 'అరుగో వారే స్వామి' అంది. పాపం వారు తెలిబోయి నమస్కరించి స్వామివారు వీరేనా అమ్మా, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు. ఎవరో అనుకొని 'స్వామి ఎక్కడ? అని అడిగాను. ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు. నిజమే ననుకొని వెనక్కు వచ్చేసానమ్మా అన్నారు. 'అదేమి స్వామీ! అలా మాయమాటలు చెప్పి పంపారు. పాపం అని ఎచ్చమ్మ నాతో జగడం పెట్టింది. 'ఓహో! సరిపోయింది. నేనే స్వామినని మెడలో బోర్డు కట్టుకోనా ఏమి!” అన్నానేను, అదొక తమాషా" అని సెలవిచ్చారు భగవాన్.
“ఇక్కడకు వచ్చిన తరువాత కూడా ఒకసారి ఎవరో వచ్చి స్వామి ఎక్కడ?" అని భగవాన్నే అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి పంపారట కదూ?" అన్నారొక భక్తులు. “అవును. అదీ నిజమే. అప్పుడు ఇన్ని కట్టడాలు లేవు. నేను కూర్చుండే ఈ హాలు ఒక్కటే ఉండేది. అది కూడా వంటకని పొగగూడు అదీ పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిళ్ళె ఉన్నారే, వారి తండ్రి గోపాలం పిళ్ళై మొదలైన భక్తులంతా పట్టుబట్టి 'భగవాన్ కూర్చునేందుకు హాలు లేకుండా వంటయింకేమి తొందర ?"అని పొగగూడు తీసివేసి హాలుగా తయారుచేసారు. ఈ హాలుకూ అమ్మకోవెలకూ మధ్యన వంటపాకా, స్టోర్ రూమూ ఉండేవి. ప్రస్తుతం కరివేప చెట్టుందే దాని ప్రక్కనే స్టోర్ రూమ్. అదీ పాకే, నిత్యం వేకువన లేచి అక్కడ కూర్చుని కూరగాయలు తరిగేవాళ్ళం. ఒకనాటి వేకువన, అదే విధంగా లేచి సామానుగది తలుపులు తెఱచి, కూరలు తరుగుతూ కూర్చున్నాను.
అక్కడివారంతా ఏవో పనులమీద ఎక్కడికో వెళ్ళారు. గిరిప్రదక్షణలు వెళ్ళే వారు ఇద్దరు ముగ్గురు వచ్చి హాలులో ఖాళీగా ఉన్న సోఫా చూచి ఉగ్రాణంవైపు తిరిగారు. వారు వస్తూ పోతూ వుండేవారే. అయితేనేమి? నేను తలంతా కప్పుకొని కూరలు తరుగుతూ కూర్చున్నానా. ఎవరో ఎవరో అనుకోని ' అయ్యా! సోఫా మీద స్వామి లేరే,ఎక్కడున్నారు? అని నన్ను అడిగారు. 'ఇదుగో ఇప్పుడే అలా బయటికి వెళ్లారు. కొంచెం సేపుంటే వస్తారు' అన్నాను. వారు ప్రదక్షిణానికి వేళ మించుతుందని వెళ్ళిపోయారు. ఈ సంగతి ఇక్కడివారెవరో చూచి 'అదేమి స్వామి! అలా చెప్పి పంపారు?' అన్నారు. 'ఏం చేసేది? స్వామి ఎక్కడ?' అని స్వామినే అడిగితే, నేనే స్వామినని చెప్పుకోనా ఏమి?” అన్నాను. ఆ విధంగా ఎన్నోసార్లు జరిగింది” అని సెలవిచ్చారు భగవాన్.
ఇదంతా విని ఆ నాటినుండీ ఉంటూ ఉన్న భక్తులొకరితో నేనంటే “అదే కాదమ్మా. అప్పుడిక్కడ దండపాణిస్వామి ఉండేవారు కదా,వారు ఇంత బొజ్జా అంత లావూ, పెద్దగొంతూ, కౌపీనం, కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనిషి. అందువల్ల కృత్తికదీపోత్సవం సందడి సమయంలో భగవాన్ నవ్వుతూ 'దండపాణిస్వామిని ద్వారంవద్ద కూర్చోబెడితే బాగుండునే, వచ్చేవారంతా వారే స్వామి అనుకొని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు. మనం సుఖంగా ఉండవచ్చును' అనీ అనేవారు. భగవానుకు ఏ విధంగానైనా తమ గొప్ప బయటపడకుండా తప్పించుకోవడమంటే మహా సంతోషమమ్మా” అని చెప్పారా భక్తులు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment