రమణాశ్రమ లేఖలు 202 (26-8-48)  తిర్యక్ జాతి యందు ప్రేమ

రమణాశ్రమ లేఖలు 202 (26-8-48)  తిర్యక్ జాతి యందు ప్రేమ
https://bhagavanraman.blogspot.com/2019/02/202-26-8-48.html

  ఈ మధ్యాహ్నం మూడుగంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవారెవరో పళ్ళతో నింపిన పట్టుకొని భగవాన్ సన్నిధికి వచ్చారు. ఆ వచ్చే దారిలో వానరవీరుడొకడు అకస్మాత్తుగా అడ్డు  తగిలి తన భాగం పళ్ళు ఎగరదన్నుకొని ఎవరికీ చిక్కకుండా పారిపోయాడు. “హా…హూ", అనే అదలింపులు వినీ, ఆ చేష్టచూచీ భగవాన్ నవ్వుతూ “ఇక్కడిదాకా వస్తే తమకు చిక్కనీయరని దారిలోనే తమ భాగం కాజేశారు. ఇప్పుడేం చేస్తారయ్యా"  అన్నారు ఛలోక్తిగా, అందరికీ నవ్వు వచ్చింది. ఈ సందడి సర్దుకునేలోపు ఒక ఆడకోతి పొట్టకు కరుచుకున్న పసిపాపతో సహా పళ్ళబుట్ట వద్దకు వచ్చింది. అక్కడున్న వారు 'పో పొమ్మని తరిమారు. భగవాన్ చూచి పాపం, పిల్లతల్లయ్యా. ఏమైనా యిచ్చి పంపరాదూ” అన్నారు జాలితో, వారికా మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాక్కున్నది.

  భగవాన్ హృదయం కరిగి “ఇదుగో ఇదే మన ధర్మం. సంన్యాసులమని పేరు పెట్టుకునేది. నిజమైన సంన్యాసి వస్తే ఏమీ యివ్వక తరిమేదీను. ఎంత దౌర్జన్యమో చూడండి. ఏళ్ళతరబడి తిని బ్రతకాలని, మనం ఉగ్రాణంలో సామాను దాచి తలుపులకు తాళాలు పెట్టి, తాళపు చెవులు దగ్గరుంచుకున్నాము. దానికేమి ఇల్లా వాకిలా? పోనీ రేపటికని ఏమైనా దాచుకుంటుందా? ఏది దొరికితే అది
తిని ఏ చెట్టుమీదనో పడుకుంటుంది. బిడ్డలను కడుపుకు కట్టుకొని తిరిగి, కాలు రాగానే, వదలి వేస్తుంది. నిజమైన సన్యాసి అదా? మనమా? అందుకే ఇందాక వారు తోవలోనే కాజేసారు. వారు మగవారు. ఇది ఆడది. పాపం ఏం చేస్తుంది” అంటూ దానివైపు చూచి “రా అమ్మా రా' అని పిలిచారు. ఆ కోతివచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫాపక్కనే నిలిచింది. దానికి కావలసిన పండ్లు ఇప్పించి పంపారు భగవాన్.

  మరి కొంత సేపటికి తెల్లనెమలి ఒయ్యారంగా నడుస్తూ వచ్చింది. భగవాన్ దానినే చూస్తూ నన్నుద్దేశించి “ఇదిగో! వీటికి చెవులు కనపడవు. ఆ స్థానంలో పెద్దబెజ్జం వుంటుంది. దానిపైన విసనకర్రవలె ఈకలు కప్పి వుంటవి” అని సెలవిచ్చారు. “అలాగా! చిత్రమే. భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది” అన్నాను. “ఈ విమర్శ కొండమీద ఉండగనే నేను చూచాను. అప్పుడు మావద్ద రెండు నెమళ్ళుండేవి. అందులో ఆడనెమలి ఎప్పుడూ నా ఒళ్ళోనే పడుకునేది. ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూచాను. మగవాడు దగ్గరకు వచ్చేవాడు కాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు. ఆడదిమాత్రం నన్నెప్పుడూ వదిలేది కాదు, పక్కనే కూర్చునేది. ఒళ్లోనే పడుకునేది. మహా చనువు. మగవాడు తానెక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచేవాడు. చంటిబిడ్డవలె నన్ను విడిచి పోయేది కాదు." అంటూ వాత్సల్యపూరితులైనారు భగవాన్.

  "భగవానునివద్ద ఆడపిల్లలకు చనువెక్కువ. భగవానుకు వాత్సల్యమూ ఎక్కువే” అన్నాను. భగవాన్ ఆమోదం చూపుతూ “ఒకనాడు వాడు బలవంత పరిచి దాన్ని ఎక్కడికో లాక్కొని పోయినాడు. తిరిగి రానేలేదు. ఏం చేసాడో" అంటూ గద్గదకంఠులై “మగవాడు మాత్రం చివరకు నా ఒళ్ళోనే ప్రాణం విడిచారు. అప్పుడే అక్కడున్న సమాధి కట్టాం” అని సెలవిచ్చారు. “వారూ ఏ పుణ్యాతులో అన్నాను. “ఊ ఊ” అని తల వూపుతూ మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ