రమణాశ్రమ లేఖలు 201 అర్ధనారీశ్వరుడు 30-7-48
రమణాశ్రమ లేఖలు 201 అర్ధనారీశ్వరుడు 30-7-48 https://bhagavanraman.blogspot.com/2019/02/201-30-7-48.html
ఈ ఉదయమే మద్రాసునుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రిగారు భగవానుతో అరుణాచలక్షేత్ర మహిమను గురించి మాట్లాడుతూ “ పార్వతికి శివుని అర్ద శరీరం పచ్చిన కారణం ఏమి ? " అని అడిగారు . భగవాన్ ఉత్సాహపూరితులై " ఏమా! ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనకనుండి వచ్చి, వినోదార్థం ఒక్కక్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది . వెంటనే సూర్యచంద్రకళారహితమై లోకం అంధకారబంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు . దేవతలు ' ఓ యీశ్వరా ! ఇదేమి అకాల ప్రళయం' అని మొఱపెట్టారు . పరమేశ్వరుడు సమయజ్ఞుడగుట వల్ల తక్షణం ఫాలనేత్రం తెరిచి , ప్రజల ఆర్తిని పాలద్రోలాడు . పార్వతి భయపడి చేతులు తీసింది . పరమేశ్వరుడు పలుకలేదు . దేవి కంపించింది . స్వామి అనునయంగానే "దేవీ ! మనకిది వినోదమే కాని , నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్రపు రహితమైనది . ప్రజలు ఎంత తపించారో చూడు . ఒక్క క్షణమే కదా అంటావేమో. మనకు క్షణమైతే లోకానికది యుగంకదా . ఇదేమి పని ? ' అని చల్లగా మందలిచాడు .
“ పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకుని , లజ్జించి ' ఈ పాపపరిహారార్ధమై తపస్సు చేయగలను . అనుజ్ఞ నీయం ' డని పరమేశ్వరుని ప్రార్థించింది . ' లోకమాతవు . నీకు పాపమేమున్నది తపస్సు చేయనక్కరలేదు ' అన్నాడు శివుడు . ఆమెకు తృప్తి కలుగలేదు , ' లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుని ప్రార్థించి , అనుమతిపొంది దక్షిణాభిముఖియై దేవి బయలుదేరింది . అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టిదోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు . ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి , సంకల్పమాత్రంచేత పెద్ద భవనం ఒకటి కల్పించి , అన్నపూర్ణ అనే నామధేయంతో వేలకొలది ప్రజలకు అక్షయపాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది . కొద్దిరోజుల్లోనే ఆమెకీర్తి దశదిశల వ్యాపించింది . రాజు గారి కొటారములో ధాన్యం లేకపోవడంవల్ల , వారు ఏదీతోచక , బెంగ పెట్టుకొంటూ వుంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో , అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమాసుడై ' నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే . ఇదేమి వింత పరీక్షింతా ' మని కొన్ని గరిసెల ధాన్యం అరువు కీయవలసిందని వర్తమానం పంపాడు . 'ధాన్యం ఇవ్వబడదు . వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది .
సరే చూద్దామని రాజూ , మంత్రులూ మారువేషంలో వచ్చి పంక్తిన కూర్చున్నారు. వడ్డించినకొద్దీ అక్షయమౌతున్న ఆ పదార్దజాలం చూచిన రాజు వివేకి గనుక ' ఇది మానవసాధ్యమైన పని కాదు . ఈమె దివ్యాంగనయే ' నని నిశ్చయించి , భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి ' తల్లీ ! నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి ' అని ప్రార్ధించాడు . అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి ' అప్పా ! నీ భక్తికి సంతోషించాను . ఇక్కడ నేనిన్నాళ్ళు నివసించినందువల్ల , నీ యీ దేశంలో అనావృష్టిదోషం తొలగి పోతుంది . వర్షం కురిస్తే ఈ క్షామం వుండదు . నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలుకాదు . దక్షిణాభిముఖినై తపస్సుచేయడానికి వెళ్ళాలి . నీవు సుఖివై ప్రజలను పాలించు ' అని దేవి అంటే , ' మాకు సేవ్యమానవై ఉండు ' మనీ రాజు ప్రార్థించాడు . సరే ' నని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమయింది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది . దేవి అన్నపూర్ణగా వెలసిన కారణమూ ఇదే .
“ ఆ విధంగా బయలు దేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి , పూజించి , పాపవిముక్త నైతినని భావించి , భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది . తరువాత అక్కడే వృషభవాహనా రూఢయై , అరుణగిరికి వెళ్ళేదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది . ఈ గిరిపాదమైన ప్రవాళపర్వతంమీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి . గౌతమ పుత్రుడైన శతానందుడు , అంబను చూచి హరపరవశు డై ' అమ్మా ! రా రా ' అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి ' మా తండ్రి కుశసమిధల నిమిత్తం అడవికి వెళ్ళివున్నారు . నేను పో వచ్చెదను . నీ విచ్చటనే ఉండుమమ్మా ' అని చెప్పి పరుగెత్తాడు.
ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురైనారు. వారిని చూడగానే శతానంద హర్షపరవశుడై “ అమ్మ వచ్చింది . అమ్మ వచ్చింది"అని అదే పనిగా అరిచాడు . చూస్తుండగానే ఆశ్రమప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్పఫలభరితమయింది . గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి 'అమ్మ ఎవరురా ? ' అన్నారు . శతానందుడు గద్దదకంఠంతో ' అమ్మ పార్వతి దేవి వచ్చింది ' అన్నాడు . గౌతములు హర్షపులకిత గాత్రులై పరుగుపరుగున . పార్వతిని దర్శించి , పూజించి , వినుతించారు . ఆ తరువాత గౌతముల యోచన ననుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై ' వర మడుగుము' , అంటే , దేవి వినయంతో ' స్వామీ ! ప్రసన్నుడవైతివేని నీ శరీరంలో అర్థభాగము నాకిమ్ము , నేనిక వేరొక శరీరంతో ఉండజాలను . ఉంటే , మునుపటివలెనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది . అనుగ్రహించు ' అని ప్రార్థించింది . పరమేశ్వరుడు అదేవిధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు . ఇదే అంబ శివుని అర్ధశరీరిణి అవడానికి కారణం అని భక్తిపరవశమైన శరీరకంపంతో సెలవిచ్చి ఆనందబాష్పపూరిత నేత్రాలతో గద్దదకంఠులై గంభీరమైన మౌనముద్ర ధరించారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment