రమణాశ్రమ లేఖలు 198 శ్రధ్ధ 27 - 7 - 48

రమణాశ్రమ లేఖలు 198 శ్రధ్ధ 27 - 7 - 48  
https://bhagavanraman.blogspot.com/2019/02/198-27-7-48.html

  ఈ ఉదయం ఎనిమిదింటికి సమీపవర్తులలో ఒకరు భగవాన్ పూర్వం అరవంలో రాసిన నోటుపుస్తకం తెచ్చి శ్రీవారి కిచ్చారు . అందులో వారికి కావలసిన పద్యాలేవో చూపి , ఆ తరువాత మరికొన్ని పుటలు తిరగవేసి , మరికొన్ని పద్యాలు చూపి , ఆ తరువాత వాటికి అర్థం చెపుతున్నారు భగవాన్ . నాకది సరిగా వినపడక ఆత్రంతో చూచాను . భగవానది గ్రహించి గంభీర స్వరంతో . ఈ విధంగా సెలవిచ్చారు . “ మునుపు ఒక పర్యాయం మురుగనారు స్తుతిగా రెండుపద్యాలు రాసారు . ఒకటి కాయికం , రెండవది వాచికం ,  సారాంశం ఏమంటే :

  ( 1 ) ' స్వామీ ! నీవు వరాహావతారమెత్తి మున్నీట మునిగి భూమండలమును  లేవనెత్తి ప్రజలను పాలించావు . ఆ భూమి మీద నివసించే ఒకానొక జీవినైన నేను ఉపకృతిచేత నిన్నేగతి మెప్పించగలను ?
 
( 2 ) ' లోకము ఏకార్ణవమైనది రక్షింపుమని దేవతలు వేడుకొన్నప్పుడు హంసరూపివై అవతరించి రెండు రెక్కలతో ఒక్కసారి విసరగా జలము ఎల్లదిక్కులకూ తొలగి భూమి బయట పడ్డది . అట్టి నిన్ను ఏమని వినుతింప గలను ? ' ఇదీ తాత్పర్యం .

“ ఆ రెండూ రాసి మూడవది భగవాన్ రాయాలని పట్టుబట్టారు . రాయక తప్పిందికాదు . అప్పుడు ' అరన్దాళ వాళమరమన్ రెల్లాన్దోన్రి ' అన్న పద్యం రాసాను. దాని తాత్పర్యం ఏమంటే :

( 3 ) ఓ స్వామీ ! నీవు భూభార హరణార్థమై కడపటిదైన కృష్ణావతారమెత్తి ' యదా యదా హి ధర్మస్య ‘ పరిత్రాణాయ సాధూనాం ' ఇత్యాది గీతా ప్రవచనాల వల్ల ఇంకా యెన్నో అవతారాలు ఎత్తుతానన్నావు . ఇటువంటి నిన్ను నీ రూపాలనూ ఎన్నడానికి ' నేనెవడను ? ' - ఎన్నడం అంటే లెక్కపెట్టడం  ఒక అర్థం . తలపోతలని ఒక అర్థం . ' నేనెవడను ? ' అంటే , నిన్ను విడిచి . నే నెక్కడున్నాను ' అనీ ఒక అర్థం . ఇంకా ఎన్నెన్నో శ్లేషార్థాలున్నవి . నేను వైష్ణవపరంగా రాసిన కారణం వారి పట్టుదలే . కాయికం , వాచికం వారు చెప్పి " మానసికం భగవానే రాయాలంటారు ' ఏం చేసేదీ ? ” అని సెలవిచ్చారు .

“ మానసికం రాయడం భగవానుకు తప్ప మరెవరికి సాధ్యం ?  అన్నాను. భగవాన్ ఎదురుగా కూర్చున్న ఒక అయ్యరును చూచి అదుగో ! ఆ కృష్ణ స్వామి అయ్యరు భగవద్గీతకొక వ్యాఖ్యానం రాసి ఆ రాతప్రతిలో ముఖచిత్రంగా కృష్ణుని బొమ్మ అంటించి తెచ్చి ' భగవాన్ దీనిక్రింద ఏమైనా రాయా ' లని పట్టుబట్టారు ' అప్పుడు 'పార్ధన్ తేరినల్ ' అన్న పాట రాసాను .
అదే తరువాత :

"పార్థసారధి రూపేణ శ్రావయిత్వ శుభాం గిరం| 
పార్దస్యార్తి హరో దేవః కృపామూర్తి స్స పాతు నః||

అన్న శ్లోకంగా మార్చాను.ఆ శ్లోకం భగవద్గీతా రత్నమాలికలో ఉన్నదకదా. నేను వైష్ణవపరంగా రాసినవి ఈ రెండే. పై కారణం వల్ల రాయవలసి వచ్చింది." అని సెలవిచ్చారు.

   "అలాగా" అని ఊరుకున్నాను.  భగవాన్ సోఫా పక్కన కూర్చున్న భక్తుల వైపు చూచి " ఇదుగో! హంస సముద్ర జలం రెక్కలతో చిమ్మిందన్న ఈ కథ పరిపాడలు అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రచారంలోకి లేదు కానీ గరుడుడు చిమ్మాడన్న కధ మాత్రం చాలా మంది రాసారు. భారతంలో కూడా ఉండాలి" అన్నారు. " ఆ కధ ఏమిటి?" అన్నారొక భక్తులు. " ఏమిటా! ఒక పిచ్చుక తన గుడ్డును ముక్కున కరచుకొని ఎగిరిపోతుంటే గుడ్డు జారి సముద్రంలో పడ్డది. ఆ గుడ్డును బయటకు తీసి రక్షించాలని దాని పట్టుదల. సముద్రంలో నీళ్ళన్నీ  బయట పోస్తానని విసుగూ విరామం లేకుండా సముద్రంలో మునిగి ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయట పోయడం చేస్తున్నదట.నారాదుడు ఆ దారిన పోతూ ఈ పిచ్చుక చేసే పని చూచి విషయం అడిగి  తెలుసుకోని "వెర్రి పిచ్ఛుకా ! నీకిది సాధ్యమేనా?" అన్నాడట ‌ "సాధ్యమా? అసాధ్యమా? అన్న చింత నాకు లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తాను. పైన దైవమున్నాడు." అన్నదట పిచ్చుక. నారదుడు ఆ శ్రధ్ధ కానందించి గరుడుని వద్దకు వెళ్ళి కథ అంతా వివరించి " ఏమోయ్ ! , నీ జాతి పక్షి అంత శ్రద్ధతో  పని చేస్తుంటే నీవు ఊరకే ఉండటం ధర్మమా? సహాయపడరాదా ? అన్నాడట.

  'గరుడుడా మాట విని పరుగు పరుగున వచ్చి రెండు రెక్కలతో ఒక్కసారి విసరితే నీరంతా రెండు పాయలై చెదిరి గుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆ గుడ్డును ముక్కున కరుచుకుని చక్కా పోయిందట. అదే విధంగా ఆత్మ చింతన కలవారు, సత్కార్యాచరణపరులూ ఈ పని పెద్దదే, సహాయం లేదే, మనకు సాధ్యమా అని జంకి విడువక, శ్రద్ధతో పాటుపడితే దైవ సహాయం దానంతటది వస్తుంది. పిచ్చుక ముక్కుతో పీల్చి బయట పోస్తేనేనా సముద్ర జలం తరిగేది? కాదు .అయితేనేమి ?శ్రద్ధా , పట్టుదలా ఉండి పనిచేసింద. ఎవరైనా అదే విధంగా ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఫలితం కలుగకపోదు. అన్నిటికీ  శ్రధ్ధ ప్రధాన వస్తువు .సత్కార్యాచరణపరులు శ్రద్ధకలిగి పనిచేసస్తే గరుడుడు  సహాయ పడినట్లే దైవసహాయం ఒక్కసారిగా వస్తుంది .వచ్చేచరకూ  నిరాశ చెందక పట్టుదలతో పనిచేయాలి ' అని బోధించి విరమించారు.

  భగవాన్ సెలవిచ్చిన ఈ కథ వినగానే విస్మయం కలిగి  లేఖారచనకు కలిగే అంతరాయాలన్నీ లక్ష్యపెట్టక ఆ పిచ్చుక వలెనే శ్రద్ధతో పట్టు విడువక  పనిచేస్తే గరుడుని సహాయం వలెనే దైవసహాయం ఏదో విధంగా  ఎప్పటికైనా రాకపోదని ఈ కథారూపంగా భగవాన్ నాకు బోధించారు కాబోలని అనుకున్నాను .ఎంతో ధైర్యం వచ్చింది .
https://www.facebook.com/2502038086477054/posts/2604163632931165/?app=fbl
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ