రమణాశ్రమ లేఖలు 196 గోలక్ష్మి పూర్వగాథ  (24-7-48)

రమణాశ్రమ లేఖలు 196 గోలక్ష్మి పూర్వగాథ  (24-7-48)
https://bhagavanraman.blogspot.com/2019/02/196-24-7-48.html

   నిన్న మధ్యాహ్నం నాలుగింటికి ఒక తమిళ    యువకుడు వచ్చాడు . "  ఇదుగో ఇతను లక్ష్మిని తెచ్చి ఇచ్చిన వారి మనుమడట. ” అన్నారొక భక్తులు , అలాగా! లక్ష్మి పోయింది.తెలుసునో లేదో. అన్నారు భగవాన్ . " ఇప్పుడే విన్నాను.స్వామీ. లక్ష్మిని చూద్దామని గోశాలకు  వెడితే ఈ  సంగతి చెప్పారు . సమాధి చూసి వచ్చాను." అన్నాడతడు.మీదేఊరు? అన్నారొకరు.
 
   మాది కన్నమంగళం అనే గ్రామం. ఇక్కడికి 40 మైళ్ళు ఉంటుంది .  మా తాత అరుణాచలం పిళ్ళై భగవానుకు మంచి పొడిఆవు నియ్యాలనీ 1926 లో ఈ లక్ష్మి  ఆరునెలల పిల్లగా ఉన్నప్పుడు , తల్లితో సహా ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను కూడా వచ్చాను . నాకప్పుడు చిన్న వయస్సు . నాటినుండి ఈ ఊరు ఏదైనా పనిమీద వస్తే చూచిపోతూ ఉండేవాణ్ణి . ఇప్పుడు ఈ  వార్తను  అన్నాడాతడు . భగవాన్ , “ అవునవును నిజమే ” నని చెప్పి వారిని పంపి మా అందరినీ చూచి  "వారలా తెచ్చినప్పుడు ఏమయిందనుకున్నారు . ' ఇదంతా ఎందుకయ్యా ' మాకు అన్నాను . ' ఎన్నాళ్ళనుంచో భగవానుకు ఆవునీయాలని నా సంకల్పం . నేటికది లభించింది . పడవెక్కించీ , రైలెక్కించీ ఎంతో శ్రమపడి తెచ్చాను . ఉండనీయండి స్వామీ ! ” అన్నాడు . ' ఇవ్వడం అయింది కదా . ఇక్కడ చూచేదెవ్వరు? మాదేనని నీ దగ్గరుంచుకో ' అన్నాను . అతడో,' నా గొంతు కోసినా తీసుకుపోను'  అన్నాడు. రామనాధ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి ' నేను చూచుకుంటా' నని గుండె గుద్ధుకున్నాడు. . అయితే నీ తలకే కట్టుకో ' అన్నాను . ' సరే' అన్నాడు. శుక్రవారంనాడు  రావడంవల్ల దూడకు ' లక్ష్మి ' అనీ పేరు పెట్టాం .రామనాధుడు రెండు మూడు  నెలలు ఎలాగో వాటిని సాకాడు . ఈ లక్ష్మి బహు  చిలిపి.గంతులేస్తూ చెట్లపాదులన్నీ తినేది . ఎవరన్నా చూచి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా వద్ద నిలిచేది . నేనామెను లాలించి ' కావాలంటే కంచె వేసుకోక , ఆమెనెందుకు అంటార'ని ఆశ్రమవాసులతో జగడం వేసేవాణ్ణి. పాపం రామనాథుడు ఇదంతా భరించలేక టవున్లో ఒకరు పాడీ పశువులూ పెట్టుకొని వుంటే ఏవో నిబంధనలతో వారి వశం చేసాడు . వారి పేరేదో ఉండాలి " అని సెలవిచ్చారు .

  " పశుపతి అని పేరు . కన్నడ జాతివారట . లక్ష్మి తల్లి కొద్దిరోజులకే గతించిందట. లక్ష్మిని మాత్రం కోడెదూడలు పుడితే ఆశ్రమానికిచ్చేట్టు, పెయ్యదూడలైతే  అతడుంచుకునేట్టు నిబంధన చేసుకున్నారట. అన్నారొక భక్తులు. ఉండవచ్చును . అక్కడికి వెళ్ళిన తరువాత ఒక సంవత్సరానికి ఒక గ్రహణపర్వం నాడు అతడు గోవత్ససహితంగా స్నానార్థం వచ్చాడిక్కడికి . ముందు నన్ను చూచి నమస్కరించి ఆవూ , దూడతో సహా పాలితీర్థంలో స్నానంచేసి ఇంటికి తోలుకొని వెళ్ళాడు . అప్పుడీ ఆశ్రమమంతా చూచింది లక్ష్మి . దోవ బాగా గుర్తుంచుకొని నిత్యం రాకపోకలు సాగించింది . ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేది . నా సోఫా ప్రక్కనే పడుకునేది . నేనే పళ్ళివ్వాలి . కొండ అరటిపళ్లుగాని పనికివచ్చేవి కావు ” అని సెలవిచ్చారు భగవాన్ . “ వెళ్ళేప్పుడు హాలుకు ప్రదక్షిణం చేసేదట కదా ? ” అన్నారొకరు . ' ఆ - అదొక్కటేనా ! పూర్వం భోజనశాలలో గంటలేదు . ఎల్లా కనిపెట్టేదో సరిగా ఆహారసమయాలకు వచ్చి నాముందు నిలిచేది , ' వచ్చిందే యిది . వేళ కావచ్చిందా ' అని గడియారం చూస్తే గంట అయ్యేది , అరే కొంటె . ఎలా తెలుసుకుందోనని నవ్వేవాళ్ళం . నిత్యం , లక్ష్మి రావడమే గుర్తుగా వుండేది . టవునుకు పోవాలంటే కష్టంగా ఉండి పోలేక పోలేక పోయేది ” అని సెలవిచ్చారు భగవాన్ .

  నిన్నా , నేడూ విచారిస్తే 1930 ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి వచ్చిందనీ , అప్పటికి మూడీతలైనవనీ , ఆ మూడూ కోడెదూడలే కావడంవల్ల నిబంధనానుసారం ఆశ్రమానికే అర్పించారనీ తెలిసింది . మూడవసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవానుని విడచి వెళ్ళలేక ఒకనాటి సాయంత్రం వశిష్టుని విడువలేక తపించిన నందినీ ధేనువువలె కళ్ళవెంట నీరుకారుస్తూ సోఫా నానుకొని పడుకుంటే , భగవాన్ హృదయం నవనీతంవలె కరిగి ఆమె ముఖం నిమురుతూ “ ఏమ్మా , పోలేనంటావా ? ఇక్కడే ఉంటానంటావా ? ఏం చేసేదమ్మా? అని అందరినీ చూచి. “ ఇదుగో చూచారా ? లక్ష్మి పోలేనని ఏడుస్తోంది. నిండు చూలాలు . అంతదూరం పోవాలి . రావాలి . రాకుండా ఉండలేదు . ఏం చేస్తుంది,? అని సెలవిచ్చారట . కడకు భగవాన్ ఎలాగో సమాధానపరచి  పంపింతే వెళ్ళి ఆ రాత్రే కన్నదట . దైవాద్వా అప్పుడే ఆ పశుపతి యింట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఈ రాకపోకలుగల లక్ష్మినీ , సంతానాన్ని భరించలేక మూడు దూడలనూ తల్లినీ తోలుకొనివచ్చి భగవానుకు అర్పిస్తే చరణ సన్నిధిని సాష్టాంగపు పడ్డట్లూ పడుకొని లేవలేదట లక్ష్మి , భగవాన్ ఆమె శిరస్సున దక్షిణహస్తం పెట్టి “ ఏమమ్మా వచ్చావా ? ఇక్కడే ఉండిపోతావా ? ” అని , అభయమిచ్చినట్లు అదిమితే సమాధిస్థవలె నిమీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండిపోయిందట . భగవానది చూచి“ ఇదుగో ! చూడండి లక్ష్మి ఎల్లాగున్నదో . “ హమ్మయ్యా ! నా పిల్లల్నీ , నన్నూ నీక అప్పగించాను . నీ యిష్టం . నా భారం తీరింది ' అన్నట్లు నిశ్చలంగా సమాధిలో కూర్చుంది ” అని సెలవిచ్చారట .
 
  ఈ కథంతా విని చూచాయగా భగవాన్తో మనవిచేస్తే “ నిజమే . అమ్మవచ్చిన తరువాత వంటా , భోజనాలూ ఏర్పడినట్లే లక్ష్మి వచ్చిన తరువాత , పశువులు పాడీ ఏర్పడినవి . మూడు నాలుగు కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది . ఆ తరువాత ఆ మామూలు తప్పింది . మొత్తం తొమ్మిది కానుపులనుకుంటాను . ఇది నివాసం ఏర్పరచుకున్న తరువాత ఎక్కడెక్కడినుండో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదయింది . ముందు అక్కడా , అక్కడా పాకు కట్టేసేవాళ్ళు . సేలం సుందరం శ్రేష్టి ( జడ్జి ) వచ్చి గోశాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు . ఆ ముహూర్తం ఇంకొక్క అరగంట ఉందనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే ఈ లక్ష్మి కట్టుతాడు తెంచుకుని నన్ను పిలిచేందుకు పరిగెత్తి వచ్చింది. తనకు ఇల్లు కడుతున్నారట.నన్ను రమ్మంటుంది. ' పోదాం పద' అనేసరికి తానే వారి తీసింది. ముందు అదీ,వెనకాలే నేనూ వెళ్ళాం. గోశాల కట్టిన తరువాత గృహప్రవేశమపుడూ అంతే చేసింది. ఎలాగో అన్నీ గ్రహించేది.బహు శిక్షణ శూక్ష్మ బుధ్ధి"అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

https://www.facebook.com/2502038086477054/posts/2607406252606903/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ