రమణాశ్రమ లేఖలు 195 ముళ్ళ చెట్టుకు మోక్షం 21 - 7-48

రమణాశ్రమ లేఖలు 195  ముళ్ళ చెట్టుకు మోక్షం  21 - 7-48
https://bhagavanraman.blogspot.com/2019/02/195-21-7-48.html

   భగవాన్ లక్ష్మి ముక్తిని గుణించి రాసిన పద్యం విన్న ఒక భక్తుడు ఉదయం శ్రీవారిని సమీపించి “ స్వామీ ! తమ సన్నిధిలో పశుపక్ష్యాదుకు సైతం మోక్షం లభిస్తున్నట్లు ప్రత్యక్షంగా కనపడుతున్నదే , మర తిర్యక్ జాతికి మోక్షార్హత లేదని కదా సిద్ధాంతం ? ” అన్నాడు , “ అదేమి ? ఒక మహాపురుషుడు ముళ్ళచెట్టుకూ మోక్షమిచ్చినట్లు చెప్పిఉందే ” అంటూ చిరునవ్వుతో సెలవిచ్ఛారు భగవాన్ . ఆ భక్తుడాత్రంగా " భగవాన్ , ఆ మహాత్ముడెవరు ? ఆ కథ ఏమి అని అడిగాడు .

   భగవాన్ సావధానులై “ అదా ! చిదంబరంలో ఉమాపతి శివాచార్య దీక్షితులనే  జ్ఞాని ఒకరు కవీ పండితుడూ అయి ఉండేవారు . వారు ఆతీతస్థితిలో వుండడం వల్ల కర్మానుష్టానాదులు అంతగా పాటించేవారు కారు . అందువల్ల ఆ గ్రామస్తులైన పండితులందరు చదివినవాడైనా భ్రష్ఠుడుగా ఉన్నాడే , ఇదెక్కడి అన్యాయమని కోపించి శివాచార్యులను కోవెలకు రారాదనీ , గ్రామంలో ఉండ రాదని బహిష్కరించారు . అందువల్ల వారు ఊరిబయటనున్న చిన్న మిట్టమీద పర్ణశాల నిర్మించుకొని అందులో నివసిస్తూ వచ్చారు . పెత్తాన్ సాంబన్ అనే కడజాతివాడు వారికి కావలసిన సామగ్రి తెచ్చిస్తూ , అన్ని పనులకూ సహాయ పడుతూ ఉండేవాడు . ఆ విధంగా కొంతకాలం గడచింది . ఓనాడు ఆ పేత్తాన్ కట్టెలమోపు తలపై పెట్టుకొని ఆ దీక్షితుల పర్ణశాలకు పోతుంటే మారమధ్యంలో కోవెల యాజమాన్యంలో భాగస్తుడుగా వున్న ఒక దీక్షితుల రూపంతో పరమేశ్వరుడాతని వద్దకు వచ్చి , ఒక పద్యం రాసివున్న తాళపత్ర మొకటి ఆ పెత్తన్ చేతికిచ్చి * ఉమాపతి శివాచార్యులకి ' మ్మని చెప్పి అదృశ్యుడైనాడు .
  
      పెత్తాన్ పత్రంతెచ్చి శివాచార్యుల కిచ్చాడు . వారది విప్పగానే “ ఆడియార్ కు  అడియేన్ చిట్రంబలవన్ ' ( భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు ) అన్న మొదటి పాదం కంటబడ్డది . వెంటనే భయభక్తులతో కూడిన సంభ్రమం కలిగి పులకిత  శరీరుడై పద్యం పూర్తిగా చదువుకున్నారు . దాని తాత్పర్యం ఏమంటే ' భకులకు దాసుడైన చిదంబర నాధుడు  కొత్త కాపురమున్న ( శివాచార్యుల ) వారికి రాసిన  చేతి చీటీ అది.భూజనులకు ఆశ్చర్యకరంగా ఈ పెత్తాన్ సాంబనికి భేదమెంచక దీక్షనిచ్ఛి ముక్తి నొసగుటయే ధర్మము '.

    ఈ తాత్పర్యంగల ఆ పద్యం చదివి ఆనందపరవశుడై పెత్తాన్ కడజాతి వాడైనా భగవదాజ్ఞ అయినందువల్ల విధి విధానంగా శైవ సంన్యాసదీక్ష నిచ్చి , కడపట నయనదీక్ష అనుగ్రహించిన మాత్రంచేతనే వాడు తత్క్షణం ఉన్నవాడు  ఉన్నట్లే జ్యోతిర్మయమై పోయినాడు . శివాచార్యులు కూడా వాని పక్వతకు ఆశ్చర్యపడ్డారు.

  "ఈ దీక్ష నిమిత్తం శివాచార్యులు చేసిన హోమాలు వారి ప్రతిపక్షులు చూసి 'పెత్తాన్ ఏదో అపరాధం చేస్తే , వాళ్లి శివాచార్యులు అగ్నిలో పడవేసి చంపారని రాజాస్థానంలో ఫిర్యాదు చేసారు . ఆ రాజు పరివార సహితంగా వాచార్యులున్న చోటికి వచ్చి విచారిస్తే వారు నటరాజమూర్తి రాసిన పత్రిక రాజుకు చూపి “ 'ఈశ్వరాజ్ఞ వల్ల నేను వానికి దీక్షనివ్వగానే వాడు జ్యోతిరూపంతో అదృశ్యుడైనాడు . అంతే ' అని చెప్పారు . రాజు ఆశ్చర్యపడి “ అలాగైతే ఇక్కడ ఉందే , ఈ నేలములగ చెట్టు . దీనికీ దీక్ష యిచ్చి మోక్షానికి పంపగలరా ? ” అన్నాడు ' ఆహా ! సందేహమేమి ! ” అని చెప్పి వారు ఆ చెట్టుకూ అప్పుడే నయనదీక్ష యిస్తే , ఆ చెట్టు కూడా జ్యోతిరూపంతో వెంటనే అదృశ్యమయింది .  “

     రాజు అతిశయించిన ఆశ్చర్యంతో ' ఇది ఇంద్రజాలంవలె ఉన్నదే . నిజమే అయితే ఈ పత్రం నటరాజస్వామి రాసిందని అంటున్నారు కదా . ఆ నటరాజ మూర్తినే అడుగవచ్చును . పోదాం రండని శివాచార్యులను తొందరించాడు . నాకు అక్కడకు రారాదన్న ఆంక్ష ఉందే ' అన్నారు వారు . ఆ రాజు ' నా వెంట తీసుకొని పోతాను రండని చెప్పి , వెంట పెట్టుకొని బయలుదేరాడు . వీరి రాక విని శివాచార్యులకు తప్పక శిక్ష కాగలదని వారి ప్రతిపక్షులూ , రాజు వస్తున్నారని " గురుకులులూ , వేడుక చూడడానికి ప్రజలూ గుంపులు గుంపులుగా స్వామి సన్నిధికి చేరారు . రాచమర్యాదకై వీరిద్దరూ ఆలయ ప్రవేశం చేయగానే  అర్చకులు స్వమికి కర్పూర నీరాజనమెత్తగా స్వామికి రెండు ప్రక్కలా పెత్తానూ , నేలములగ చెట్టూ ప్రత్యక్షంగా    అందరికీ గోచరించినవి . వెంటనే దీక్షితులందరికీ ఆశ్చరమూ భయమూ కలిగి , శివాచార్యుల పాదముల మీద వాలి ' మీ మహిమ తెలియక బహిష్కరించినందుకు మన్నించవలసిన ’ దని ప్రార్థించి , వారిని గౌరవ పురస్కారంగా  సత్కరించి గ్రామంలోనికి రప్పించుకున్నారు . ఈ కథ చిదంబర మాహాత్మ్యంలో ఉంది ” అని సెలవిచ్చారు .
Telegram    T.me/bhagavanRaman

https://www.facebook.com/2502038086477054/posts/2610870238927171/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ