రమణాశ్రమ లేఖలు 194 గోలక్ష్మి సమాధి 20 - 7 - 48

రమణాశ్రమ లేఖలు  194  గోలక్ష్మి సమాధి  20 - 7 - 48 
https://bhagavanraman.blogspot.com/2019/02/194-20-7-48.html

  లక్ష్మిని స్మరిస్తూ అంతా అన్నాలు తిని , రవంత విశ్రమించాం . మధ్యాహ్నం రెండున్నరకు గోశాలవైపు వెళ్లే భగవానటు వచ్చి ఉన్నారు . శ్రీవారితోనే వెళ్ళి ఆ మృతదేహాన్ని చూచాము . అప్పటికీ ముఖంలో మరణచిహ్నం లేదు . హాలుకు వచ్చి కూర్చున్నాము . భగవాన్ సాయంత్రం వరకూ లక్ష్మికథలే చెపుతూ , సమాధికి సలహాలిస్తూ “ అమ్మకూ ఇలాగే అభిషేకమయ్యే వరకూ ముఖంలో కాంతి
తగ్గలేదు.తలవని తలంపుగా సమాధి వేళకు ఎన్నో సామానులు పొట్లాలు పొట్లాలుగ కర్పూరంవేస్తే ఒళ్ళే  కనుపించలేదు.మేళాలూ , తాళాలూ, భజన, ఒకటే కోలాహలం..మేము ఎక్కడో ఒక ప్రక్కన సమాది చేసి పోదామని  తెల్లవారకుండా తెచ్చి పాలితీర్థం వద్ద ఉన్న రావిచెట్టు కింద పెట్టుకున్నాం.ఇటికలూ , సున్నమూ తెచ్చి సమాధి కట్టేందుకు కొంచెం ఆలస్యమయింది. ఇంతలో అంత చేసారు . పదవ నాటికి ఈ అడవికి అంగళ్లు కూడా వచ్చాయి. ఇప్పుడిది చూడండి ఎంత జరుగుతున్నదో ? ” అని అమ్మ అళగమ్మ నిర్యాణమే ఉపమానంగా చెపుతుంటే వినివిని , గోవిందరాజు సుబ్బారావుగారు “ ఇక్కడ మానవులకన్నా  తిర్యగ్జాతికే అధికంగా మోక్షం లభిస్తున్నట్లు అనేక దృష్టాంతాలు గోచరిస్తున్నవి. అవి కర్మశేషం అనుభవించడానికే ఇక్కడకు వస్తాయని భగవాన్ అనేకసార్లు సెలవిచ్చారు . చూడగా చూడగా మాకన్న అవే మేలని తోస్తున్నదే ? " అన్నారు.

  “ అన్నిటికీ అలా చెప్పే వీలుంటుందా ? ఇప్పుడీ సన్నాహమంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా ? చేతులో కాసుండి చేస్తున్నామా . సమయానికి అందరూ పూనుకున్నారు . అన్నీ వస్తున్నాయి . క్షణంలో పని జరుగుతోంది . ఇందుకని వచ్చినట్లు ఆ సదాశివయ్యరు మొన్ననే వచ్చారు . వారికి సమాధి సమాచారం బాగా తెలుసును . దగ్గరుండి చేయిస్తున్నారు . రేపే వెడతారట . వారివారి ప్రాప్తికి మనమేం చేస్తాం . మామూలు పశువైతే మాలవాడీడుస్తాడు . దీనికి మహాత్ములకు జరిగినట్లు సమాధి జరగబోతున్నది . ఈ శ్వేతమయూరం ఉంది . ఎన్ని రావడం లేదు నెమళ్ళు . వాటి విధం వేరు , దీని విధం వేరు . ఇది అందరితో కలిసి మెలసి తిరుగుతూ సాధువుగా సంచరిస్తుంది . ఎక్కడి బరోడా , ఎక్కడి అరుణాచలం . అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది . ఎవరు కావాలన్నారు ? ” అని సెలవిచ్చారు భగవాన్ ,
 
ఆసుపత్రి వద్ద కొండవైపు మెట్లనానుకొని జింక , కాకి , కుక్కల సమాధు లున్నవి . వాటి పక్కనే గుంట తవ్వి ఇటికలతోనూ , సున్నంతోనూ సమాధి కట్టడానికి ఆరంభించారు .

   సాయంత్రం ఆరింటికి అంతా సిద్ధమయింది . జనం గుంపులు గుంపులుగా వచ్చి గోడలెక్కి కూర్చున్నారు . సర్వాధికారి లక్ష్మిని చెక్కబండిలో తెప్పించారు. భగవాన్ వచ్చి కుర్చీమీద కూర్చుంటే వారి కెదురుగా లక్ష్మినుంచి కడవలతో నీళ్ళు తెచ్చి స్నానం చేయించారు.  ఆ తరువాత పాలు , పెరుగూ , నెయ్యి, చక్కెర,తేనె , పన్నీరు కుమ్మరించి , జలాభిషేకం చేసి , దశాంగధూపం వేసి పట్టు ఖండువాకప్పి , ముఖానికి పసుపూ కుంకుమా రాచి , ఒళ్ళంతా  పూలమాలలతో  నింపారు . కలకండా మొదలైనవి నివేదన చేసి కర్పూరహారతి  ఇచ్చేసరికి ముఖం కళకళలాడుతూ చూచేవారికి ఆశ్చర్యం కలిగింది .
 
   సుమారు  ఏడుగంటలకి “ హరహర మహాదేవ ” అనే శబ్దంతో భక్తులంతా లక్ష్మిని సమాధిలో దింపేసరికి భగవాన్ శరీరం కంపించింది . రెప్పలతో కన్నీరు ఆపుకున్నారు . భగవత్ కరస్పర్శనంది పవిత్రమైన పత్రిని మొదట సర్వాధికారి లక్మీపైన చల్లారు . తరువాత భక్తులంతా పసుపూ , కుంకుమ , కర్పూరం , విభూతి , గంధం , పూలూ , ఉప్పూ , మన్నూ వరుసగా కుమ్మరించారు . క్షణంలో సమాధి పూడింది . భగవాన్ యథాస్థానానికి వచ్చిన తరువాత ప్రసాదం పంచిపెట్టారు . అదొక కల్యాణ కలాపంగా ముగిసింది . గోలక్ష్మీ గోశాలలో లేదిప్పుడు . నాలుగు గోడల నడుమ కట్టబడే ఆ స్థూల శరీరబంధం తెంపుకొని శ్రీరమణ జ్యోతిర్మయ ఆత్మలో లీనమై ప్రపంచమంతటా తానుతానుగ విహరిస్తోంది సుమా !

  లక్ష్మి సమాధి జరిగిన రాత్రి తెల్లవారుజామున భగవాన్ అరవంలో లక్ష్మిని గుణించి చరమ శోకంగా ఒక పద్యం రాసారు . మా ప్రార్థనననుసరించి దానిని తెలుగులోనూ మళయాళంలోనూ అనువదించారు . తెలుగు రాస్తాను చూడు .
 
'వేణ్పా'  శ్రీ సర్వధారి సంవత్సర   జ్యేష్టాఖ్య
     మాససిత ద్వాదశిం భార్గవ - వాసరము  
     సహి తారక విశాఖ సహి తమ్మావు లక్ష్మిగతి
     చేరు దినమని చెప్పు .
Telegram
T.me/bhagavanRaman

https://www.facebook.com/2502038086477054/posts/2609150602432468/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ