రమణాశ్రమ లేఖలు 193 గోలక్ష్మి ముక్తి  20-7-48

రమణాశ్రమ లేఖలు 193 గోలక్ష్మి ముక్తి  20-7-48 
https://bhagavanraman.blogspot.com/2019/02/193-20-7-48.html

   గోవులకు రాణిగా ఉన్న లక్ష్మి వైభవం , ఆమెయందు భగవాన్ కున్న వాత్సల్యం గోపూజ అనే లేఖలో రాసాను . ఆ రాణికి మొన్న 18వ తేదీ శుక్రవారం నాడు భగవాన్ అమ్మ  అళగమ్మకు వలెనే విదేహముక్తిని అనుగ్రహించారు . అప్పటికి ఒక వారంనుండీ లక్ష్మి బలహీనంగా ఉంటున్నదనీ , ఎక్కువ రోజులు జీవించేలా లేదని వింటూ చూస్తూ ఉన్నాం . 18వ తేదీ ఉదయం ఎనిమిదింటికి ఆశ్రమానికి వెడితే ఇక ఈ రోజు గడవదని తెలిసింది . భగవాన్నైనా చూడకుండా గోశాలవైపు వెళ్ళాను , దూడలకోసం కట్టిన గది శుభ్రంచేసి వరిగడ్డి పక్కవేసి పడుకోబెట్టారు లక్ష్మిని.  శుక్రవారం కనుక యథాప్రకారం ముఖమునకు పసుపు , కుంకుమా రాసి , కొమ్ములకూ మెడకూ పూలమాలలు చుట్టారు . వెంకటరత్నం పక్కన కూర్చుని విసనకఱ్ఱతో విసురుతూ ఉన్నాడు . గంభీరమైన దృష్టితో కాంతిని విరజిమ్ముచున్న లక్ష్మిని చూస్తే కైలాసంలో వున్న పరమశివునకు పాలతో అభిషేకం చేయాలని ప్రయాణం కట్టుకొన్న కామధేనువా ? అన్నట్లు తోచింది .

  భగవాన్ సన్నిధికి వెళ్ళి నమస్కరించి లేచేసరికి అలౌకికమైన దృష్టితో చూచారు భగవాన్ . అదే ఆజ్ఞగా గ్రహించి “ లక్ష్మిదగ్గర ఉంటాను ” అన్నాను . సెలవు చిహ్నంగా తలవూపారు భగవాన్ . వెంటనే వెళ్ళాను . విసనకర్ర నాకిచ్చి వెళ్ళాడు వెంకటరత్నం . ఆ స్థలంలో కూర్చుని రమణ ద్వాదశాక్షరీ , అష్టోత్తరం మొదలైనవి పారాయణ చేస్తే శ్రద్దగా విన్నది లక్ష్మి ,
 
  తొమ్మిదీ ముప్పావుకు గోశాలవైపుకు వచ్చిన భగవాన్ తిరిగి వెడుతూ ఆమెను చూడవచ్చి తలవైపున ఉన్న గడ్డిలో చతికిలబడి రెండుచేతులా లక్ష్మి ముఖం ఎత్తి “ ఏమమ్మా ? ఏం ? ” అని బుజ్జగిస్తూ ముఖము కంఠము నిమిరి , తలమీద ఎడమచెయ్యి పెట్టి వాసనలణగునట్లు మునివేళ్ళతో అదుముతూ , గొంతు నుండి గుండెవరకూ దక్షిణ హస్తంతో చల్లగా సవరించారు . దాదాపు ఒక పావుగంట వరకూ అలాగే సవరిస్తూ “ ఏమమ్మా ! ఏం ? నన్నిక్కడే  ఉండమంటావా ? ఉండవచ్చును కాని ఏం చేసేదీ? నాకోసం అంతా ఇక్కడికి  వస్తారు . వచ్చినా మంచిదే . అమ్మకువలెనే  అంతా చుట్టూ ఉండవచ్చును. పోనీ , ఎందుకులే . వెడతాను . ఏం ? వెళ్ళనా? అని సంబోధించారు. లక్ష్మి ప్రశాంత వదనంతో , బంధరహిత దృష్టితో , బాధాశూన్యమైన శరీరంతో సమాధిస్థవలే వూరుకున్నది . భగవాన్ కరుణాపూరిత హృదయంతో కదలలేక కూర్చున్నారు .
 
   ఆ దృశ్యం చూచేసరికి నా హృదయం పొంగి అప్రయత్నంగా'ఆహా! అమ్మ అళగమ్మదే భాగ్యం , లక్ష్మిదే భాగ్యం ” అన్నాను . భగవాన్ తేరిపార చూసి మందహాసం చేసారు. “ డాక్టరు పదిన్నరకు కాని రాడట ” ఇప్పుడేమి తొందర లేదన్నాడు.అంటూ వచ్చాడు సుబ్రహ్మణ్యం . “ సరి . డాక్టరు ఇప్పుడు రాడట. ఇంజెక్షన్ , మందులు తెచ్చారా ? ” అంటూ భగవాన్ లక్ష్మి తలా మెడా చేతులతో రాస్తూ " ఏమమ్మా , ఏమంటావ్ ? పోనా ? " అని బుజ్జగింపుగా అడిగారు . “ భగవాన్ దగ్గరుంటే ఆమెకు సుఖంగా ఉంటుంది" సుబ్బలక్ష్మమ్మ . “ ఉంది . ఏం సేదీ ? ” అంటూ లక్ష్మి కళ్ళల్లో కళ్ళుంచి ఏమమ్మా  ఏం ? వెళ్ళనా ? చెప్పవూ ? ” అని అడిగారు భగవాన్ . ఆమె ప్రజ్ఞాపూర్వకమైన దృష్టితో శ్రీవారివైపు  చూచింది . ఏం సమాధానం వచ్చిందో , కాళ్లు సర్థుకుంటున్నారు భగవాన్ . అంతా దోవ యిచ్చాం . “ ఈగలు నోట్లోకి పోకుండా ఎవరైనా చూచుకోవాలి ” అంటూ లేచారు భగవాన్ . " చూచుకుంటాం ” అన్నాను . వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు భగవాన్.
  
  భగవత్ కరస్పర్శానుభూతివల్ల లక్ష్మికి పైశ్వాస తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగినవి . ముఖకాంతి అంతకంతకు అతిశయించింది . పదిన్నరకు డాక్టరు వచ్చి ఇంజక్షన్ లూ , మందులు ఇస్తుంటే శరీరం నాది కాదన్నట్లు ఊరుకున్నది . మరణబాధ ఏమాత్రము లేదు . దృష్టి నిర్మలంగా ఉంది . డాక్టరు నందివలె తిప్పి పడుకోబెట్టి పుళ్లకు మందువేసి ' తలక్రింద ఎత్తు మీరు పెట్టండమ్మా ' అని చెప్పి వెళ్ళిపోయాడు . అప్పటికి పదకొండున్నర కావడంవల్ల అన్నం తిని వెంకటరత్నం వచ్చాడు . “ తల ఎత్తి పట్టుకో , గడ్డితోస్తా " నన్నాను పట్టుకున్నాడు . జిల్లున తాకింది నాలుక . “ శ్రీరమణ జయరమణ ” అంటూ అంతా పాడాము. అప్పటికి భగవాన్ గోశాల వెనక్కు వచ్చారు . లక్ష్మి ప్రాణవాయువు అనే మధుపం ఆ శరీరమనే గూటిని వదలి శ్రీరమణ చరణారవింద మకరందమాని అందే లీనమైన దన్నమాట .

పది నిమిషాలలో భగవాన్ వచ్చి “ అణగిపోయిందా ? ” అంటూ ప్రక్కనే చతికలబడి చంటిబిడ్డనువలె రెండుచేతులతో ఆమె ముఖం ఎత్తి పట్టుకొని " ఏమమ్మా ! లక్ష్మీ , లక్ష్మీ అంటూ రెప్పలతో కన్నీరాపుకొని “ దీనిమూలంగా ఈ సంసారం ఇంతయింది ” అని సెలవిచ్చారు . అంతా ఆమె మంచిని పొగడుతూ ఉంటే విని “ డాక్టరేమీ కష్టపెట్టలేదు కదా ? ఎలా అణగింది ? ” అని ప్రశ్నించారు భగవాన్ , జరిగిందంతా విశదపరిచాము . “ సరిసరి . ఇదుగో చూచారా . దక్షిణ కర్ణం ( ఎడమ చెవి ) పైకి వచ్చింది . నిన్నటివరకూ ఆ ప్రక్కన పడుకొని ఉంది . పుండు నెపంగా ఇవాళ ఇటు తిప్పారు . ఇది పైకి రావలసి ఉంది . చూడండి . కాశీలో మరణించినవారికి వలెనే ఇక్కడా దక్షిణకర్ణంలో శివుడు ఉపదేశిస్తాడని అంటారు ” అని భగవాన్ సెలవిచ్చి దాని చెవిని అందరికీ చూపారు . అంతలో జనం గుంపు కూడారు . భగవాన్ పావుగంట ఉండి లేచి “ రామకృష్ణుడు లక్ష్మికి మంచి సమాధి కట్టాలని పది రోజులుగా అంటున్నాడు ” అంటూ హాలుకు వెళ్ళారు.
Telegram   T.me/bhagavanRaman

https://www.facebook.com/2502038086477054/posts/2605748656105996/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ