రమణాశ్రమ లేఖలు 192 కారుణ్యమూర్తి 15 - 6 - 48
రమణాశ్రమ లేఖలు 192 కారుణ్యమూర్తి 15 - 6 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/192-15-6-48.html
ఈ వేసంగిలో వచ్చినప్పటినుండి భగవాన్ సదా జూబ్లీ హాలులోనే ఉంటున్నారు . ఉండే సమయంలో సేవకులు ఉత్తరంగా వున్న పందిరి క్రింద క్రోటన్ల మధ్యకు సోఫా జరిపి చుట్టూ వట్టివేళ్ళ తడికలు కట్టి నీళ్లు చల్లుతున్నారు . ఈ మధ్యాహ్నం నేనెందుకో రెండు గంటలకే వెళ్ళాను . భగవాన్ సోఫా ఇంకా అక్కడే ఉన్నది . తెల్లని జాలరుగుడ్డ వంటిది ఒకటి తలమీదా , ఒంటిమీదా కప్పుకొని కూర్చున్నారు భగవాన్ . కృష్ణస్వామి తప్ప మరెవ్వరూ లేరు . అతడు మరతో ఉన్న పన్నీరు బుడ్డిని చేత్తో పుచ్చుకొని భగవాన్ వెనకవైపు నుంచున్నాడు . దానిలో పన్నీరు కలిపిన నీళ్ళున్నవి కాబోలును . మర తిప్పాడు . పిచికారిలోంచి భగవాన్ మీద తుంపరల వర్షం కురుస్తున్నది . ' ఆహా ! ” అంటూ భగవాన్ ఆ నీళ్ళతో ఒళ్ళంతా తుడుచుకుంటున్నారు . నేను వెళ్ళగానే ఇటుచూచి " ఇదుగో ! అభిషేకం చేస్తున్నారు చూచావా ? ” అని తడిసిన ఆ జాలరుగుడ్డ ముఖమంతా కప్పుకొని “ ఇదుగో , ఈ తడిబట్ట కప్పారు . చుట్టూ తడికలు కట్టి నీళ్ళు చల్లుతున్నారు . నీలగిరివలె ఉంది . చూడు ” అని భగవాన్ సెలవిచ్చారు .
సోఫాకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూచాను . చల్లగా వుంది . “ ఎండలోంచి చచ్చాను కనుక చల్లదనం బాగా తెలుస్తోంది ” అంటూ వెనక్కు వచ్చి యథాస్థానంలో కూర్చున్నాను . భగవాన్ నా మాటకు ' అవునవు ' నని చెప్పి , గత సమాచారం ఏదో స్పురణకు వచ్చింది కాబోలు , రవంత యోచించి “ ఇదుగో ! నేను విరూపాక్ష గుహలో ఉండగా ఎండకాలంలో నీటి వసతి లేక చూతగుహకు మారేవాళ్ళం . అక్కడికి మట్ట మధ్యాహ్నం వేళ , పెద్దపెద్ద గడ్డిమోపులు తలమీద పెట్టుకొని కడజాతి స్త్రీలు కొందరు అలసిపోయి , నీళ్ళకోసం వచ్చేవారు . పాపం పొద్దుట గంజితాగి కొండకెక్కితే అప్పటికి ఆ కాస్త గడ్డి దొరికేది . వచ్చీ రావడమే అమాంతం మోపులు క్రింద పడవేసి వంగి , ' సామి సామి ! ముందు ఈ వెన్ను మీద చెంబెడు నీళ్లు కొట్టు సామీ ! ' అనేవాళ్ళు . నేనక్కడి తిన్నెమీద నుంచుని ఒక్కొక్కరి వీపున ఒక్కొక్క చెంబు చొప్పున నీళ్ళు పోస్తే "హమ్మయ్యా! ఎంత హాయిగా ఉంది సామీ! " అంటూ తెప్పరిల్లుకొని దోసిలిపట్టి , కడుపునిండా నీళ్ళు తాగి, ముఖం తుడుచుకొని, చెట్టు నీడన కొంతసేపుండి సేదతీరి వెళ్ళేవారు. ఆ సుఖం వారికే తెలియాలి. ఎండనపడి వచ్చినప్పుడే నీళ్ళ చల్లదనం తెలుస్తుంది" అని సెలవిచ్చారు.
" భగవానేనా నీళ్లు పోసింది ? ” అన్నాను . “ ఆ - నేనే. ఆ వేళకు వస్తారని నీళ్ళు పెట్టుకొని ఉండేవాణ్ణి . ఏం చేసేదీ ? ” అనేసరికి భగవాన్ కంఠం గద్గదిక వహించింది . కారుణ్య స్వరంతో “ "వారు , ఆ పాలితీర్థం తాకరాదు , మరెక్కడా నీరు లేదు . మలమలమాడ్చే ఎండ . గడ్డిమోపులమ్ముకుంటే కానీ గంజికి లేదు . పిల్లతల్లులు . త్వరగా ఇల్లుచేరాలి . ఏంచేస్తారు పాపం , ఆ గుహ వద్దకు వెడితే స్వామి నీళ్ళు పోస్తాడన్న ఆశతో వచ్చేవాళ్ళు. మాకప్పుడు వంట లేదు . ఎప్పుడైనా అన్నం వండితే చాలా ఎసరు పెట్టి గంజి వార్చేవాళ్ళం. ఆ వార్చిన గంజి ఒక కుండలో పోసి , ధారాళంగా నీళ్ళు కలిపి , ఉప్పువేసి ఉంచేవాణ్ణి . శొంఠి ఉంటే వేసేవాణ్ణి . లేకుంటే లేదు . వారొచ్చేసరికి ఈ గంజి నీళ్లు చల్లగా అయ్యేవి . ఒక్కొక్క లోటా చొప్పున దోసెట్లో పోస్తే , అమృతతుల్యంగా తాగి పోయేవారు . ఆ గంజి రుచీ , ఆ నీళ్ల సుఖం వారికే తెలుసును ” ఆంటూ మరి మాట రాక మౌనం వహించారు భగవాన్ .
నేను ఆ కారుణ్యమూర్తిని చూస్తూ కొంచెం సేపు అలాగే ఉండిపోయి తరువాత “ ఈ విషయం చరిత్రలో లేదే ? ” అన్నాను . “ లేదు . ఏమో ఎందుకని నేనే చెప్పలేదు " అని సెలవిచ్చారు భగవాన్ . “ ఇటువంటి గాధలెన్ని అజ్ఞాతంగా ఉన్నవో ? ” అన్నాను . “ ఊ … ఊ ” అంటూ వూరుకున్నారు భగవాన్ .
Telegram t.me/bhagavanRaman
https://www.facebook.com/2502038086477054/posts/2614505505230311/?app=fbl
Comments
Post a Comment