రమణాశ్రమ లేఖలు 190 మూర్తినామ నిర్వచనం 15 - 5 - 48
రమణాశ్రమ లేఖలు 190 మూర్తినామ నిర్వచనం 15 - 5 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/190-15-5-48.html
నిన్న మంగళవారం కదా ! వేకువజామునే బయలుదేరి గిరి ప్రదక్షిణమునకు వెళ్ళి త్వరగా కుటీరానికి వచ్చాను . ఆ పని ఈ పని చూచుకొని భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి ఏడున్నర అయింది . నమస్కరించి లేవగానే “ ఏమి ? ప్రదక్షిణకి వెళ్ళి అప్పుడే వచ్చారా ? ” అన్నారు భగవాన్ . “ ఏడు గంటలకే వచ్చాను . కుటీరంవద్ద కొంచెం ఆలస్యమయింది ” అన్నాను . “ అలాగా ! ఎన్నింటికి బయలుదేరారేం ? ” అన్నారు భగవాన్ . “ మూడున్నరకు ” అన్నాను . “ అమ్మా ! కూడా యెవరు ? ” అన్నారు భగవాన్ . “ ఎవరూ లేరు . ఏకాంతంగా పోదామనే పోతున్నాను . ఏమీ భయం తోచడం లేదు ” అన్నాను . “ సరి సరి . భయమేమి ? మేము ప్రదక్షిణం వెళ్ళేటప్పుడు చాలావరకు రాత్రిళ్ళే వెళ్ళేవాళ్ళం ” అని సెలవిచ్చారు భగవాన్ .
ఒక భక్తుడందుకొని “ పూర్వం ఒక రాత్రి భగవాన్ భక్తులతో సహా ప్రదక్షిణానికి వెళ్ళినపుడు , ఆ భక్తులలో ఒకరు ' దక్షిణామూర్తి స్తోత్రానికి భగవాన్ అర్ధం సెలవీయాలి ' అని ప్రార్థిస్తే భగవాన్ ఎన్నో ఉపమానాలతో ఒక్క శ్లోకానికే తెల్లవారే వరకూ అర్ధం చెప్పారట కదూ? అన్నాడు. “ అవును . దానికేమి . చెప్పదలచుకుంటే ఎంతో ఉన్నది . కొండమీద ఉండగా పలనిస్వామి అడిగితే ఆ స్తోత్రానికి పద్యాలూ తాత్పర్యమూ రాసాను కదా ! అప్పుడే వ్యాఖ్యానం కూడా రాద్ధామని అనుకున్నాను . అంతలోనే అది ముద్రణ కిచ్చాము . ఉపోద్ఘాతం రాసి పంపవలసిందని తొందర చేస్తూ , ఒక భక్తుడు మనుష్యుని పంపారు. . అంతటితో ఆ పని ఆగిపోయింది ” అని సెలవిచ్చారు భగవాన్ మాకు అంతే ప్రాప్తమన్నమాట ” అన్నాడా భక్తుడు .
దక్షిణామూర్తీ విగ్రహానికీ , పాదాల క్రింద ఒక రాక్షసుని తొక్కి పట్టినట్లుగా ఉండడం ఇవాళ ప్రదక్షిణంగా వస్తూ అరుణాచలేశ్వర ఆలయంలో పరీక్షగా చూచి ఇదేమా ఇలా ఉంది ? అనుకున్నాను . ఈ రోడ్డుకు ప్రక్కన వున్న దక్షిణామూర్తికీ అలాగే ఉంది . అమ్మ కోవెల్లోనూ అలాగే ఉంది . దాని భావం ఏమిటి ! ” అన్నాను నేను . “ అదా . శివుడు దారుకావన తాపసులు తనపై ప్రయోగించిన ' మొయిలకన్ ' అనే అపస్మార పిశాచిని అణగదొక్కి కూర్చున్నట్లు | చెప్పుతారు . దక్షిణామూర్తి అంటే శివుని పంచమూర్తులలో ఒకటే కదా . ఆ పరంగా చెప్పవలసి ఉంటే అహంకారం అనీ అంటారు . ఏదో ఒకటి ” అన్నారు భగవాస్ . “ అహంకారానికి రూపమేమున్నది ? ఇలా చెపుతారెందుకో ? ” అన్నాను . " దక్షిణామూర్తి అంటే మాత్రం రూపమా ఏమి ? స్తోత్రంలో అమూర్తినే కదా వర్ణించింది . ' విశ్వం దర్పణదృశ్యమాన నగరీ ' ' బీజస్యాంతరివాంకురో ' ' నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం ' ఇవన్నీ ఏమిటి ? అమూర్తినే కదా సూచించేది ? ఆ అమూర్తికి మూర్తిని కల్పించినట్లే ఇదీను ” అని సెలవిచ్చారు భగవాన్ ,
వేరొకరందుకొని “ వాల్మీకికి వల్మీకం ( పుట్ట ) లో నుండి లేవడంవల్ల ఆ పేరు వచ్చిందని , వ్యాసునకు వేదములను విభజించడంవల్ల వ్యాసనామం ఎర్పడ్డదని అంటారు . వసిష్ఠుని పేరు ఏ కారణంవల్ల వచ్చిందో ? ” అన్నారు . “ వసిష్ఠుడంటే , అన్నిటికీ విశిష్టమైన వస్తువునెరిగి ఇతరులకు బోధింపగల సమర్థుడన్నమాట " అని సెలవిచ్చారు భగవాన్.
"అరుణాచల పంచరత్నములలో చివరి శ్లోకమందున్న ' పశ్యన్ , సర్వం తవాకృతితయా సతతం ' అన్నదానికి అర్థం ఏమిటి ? ” అన్నారింకొకరు . సర్వమూ నీ యొక్క ఆకృతిగనే చూచుచూ ' అని అర్థం ” అన్నారు భగవాన్ . " అంటే నాకు సరిగా బోధపడలేదు . ఆ శ్లోకం అంతటికీ అర్థం సెలవీయాలి ” అన్నాడా భక్తుడు “ సరి , వినండి . త్వయ్యర్పిత మనసా ' , నీకు అర్పింపబడిన మనస్సుతో , 'పశ్యన్ సర్వం తవాకృతితయా సతతం ’ సర్వమూ నీ యాకృతిగానే సదా చూస్తూ ' త్వాం ' నిన్ను , ' భజతే నన్యప్రీత్యా అనన్యభక్తితో సేవించునో , ' సః ' - వాడు , ' జయతి అరుణాచల త్వయిసుఖే మగ్నః సుఖస్వరూపమైన నీయందు మగ్నుడై , అరుణాచలా ! విజయమునందుచున్నాడు . ఇది శ్లోకానికి సంపూర్ణమైన వాచ్యార్థము . మనస్సణగితే సర్వం తన స్వరూపమే . అంతటా తానే పూర్ణమై వుండడం వల్ల తన్ను తానే భజించునని భావం ” అని సెలవిచ్చారు భగవాన్
'త్వయ్యర్పిత మనసా త్వాం పశ్యన్ సర్వం తవాకృతి తయాసతతం |
భజతే నన్య ప్రీత్యా స జయ త్యరుణాచల త్వయిసుఖే మగ్నః | |
Telegram. T.me/bhagavanRaman
https://www.facebook.com/359807631501891/posts/391189951696992/?app=fbl
Comments
Post a Comment