రమణాశ్రమ లేఖలు 189  అప్పర్  5- 5-48

రమణాశ్రమ లేఖలు 189  అప్పర్  5- 5-48 https://bhagavanraman.blogspot.com/2019/02/189-5-5-48.html

  నిన్న "వెదారణ్యం-పడిక్కాసు " కథలను గురించి నీకు రాసి మధ్యాహ్నం  రెండున్నరకు వెడితే భగవాన్ సన్నిధిలో అప్పర్ ను గురించిన ప్రసంగమే నడుస్తున్నది. ఆ ప్రసంగ వశంగా ఒక భక్తుడు భగవాను నుద్దేశించి “ అప్పరును సంబంధులు అప్పా ! అని పిలవడంవల్లనే ఆ పేరు వచ్చిందని అంటారే నిజమేనా అన్నాడు. ఆ - నిజమే . వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుల్ నీక్కియారు. వాక్శుద్ధి కలవారవడం వల్ల తరువాత వాగీశ్వరుడన్న బిరుదు వచ్చింది. సంబంధులు అప్పా ! అని పిలవడం వల్లనే అప్పర్ అనే పేరుకు కారణం.' అన్నారు భగవాన్.

   "వారి జన్మస్థానమేదో ? ” అన్నా రింకొకరు . భగవాన్ మందహాసంతో “ వారు తిరుమునెప్పాడైనాడులో తిరువామూరనే గ్రామమున వెళ్ళాళ జాతిలో శైవమత ఆచార తత్పరులైన పొగడనార్ , మాదినియార్లకు జన్మించారు . తిలకావతి అనే ఒక్క సహోదరి మాత్రం ఉంది . వారు యుక్త వయస్సులోనే సకల విద్యల లోనూ ప్రవీణులైనారు . తిలకావతికి 12 ఏండ్లు రాగానే రాజువద్ద ఉన్న సేనాపతి కిచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు . ఆ సేనాపతికి అప్పుడే ఒక యుద్ధం వచ్చింది . తిరిగివచ్చి పెళ్ళి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు . ఇంతలో ఇక్కడ కాలవశాత్తు పొగడనారు గతించారు . మాదినియారు సహగమనం చేసింది . అక్కా తమ్ముడూ ఇద్దరే ఉంటూ ఆ సేనాపతి రాకకు ఎదురు చూచారు . కొన్నాళ్ళకు ఆ సేనాపతి యుద్ధంలో గతించాడన్న వార్త వీరి చెవికి సోకింది "తల్లిదండ్రులు నన్నాతనికి ఇస్తామని అన్నారు కనుక నా యీ శరీరం వారిదే . నేనూ సహగమనం చేస్తాను ' అని తిలకావతి బయలుదేరింది . అది చూచి మరుల్ నీక్కియార్ దుఃఖాక్రాంతుడై , సహోదరి పాదాల మీద వాలి ' అక్కా ! తల్లిదండ్రులు గతించిన తరువాత నిన్నే వారినిగా భావించి సేవింతామని నేను జీవంతో ఉన్నాను . నన్ను విడిచి నీవు పోదలచి నట్లయితే నేనూ నీకన్నా ముందే పోతాను" , అని భోరున విలపించారు. సోదరుడు జీవించి ఉండాలన్న ఆశతో తిలకావతి  ఆ ప్రయత్నం విరమించి వేరెవ్వరినీ చేపట్టక శివాలయ కైంకర్యం చేస్తూ  జీవకారుణ్యపరురాలై  తపో నియతితో గృహమందే, నిలిచింది.

    " మరుల్ నీక్కియారు శరీరసంపదలు అనిత్యమని తెలిసి , గృహస్థాశ్రమ స్వీకారం చేయక ధనకనక వస్తు చయమంతా దాన ధర్మములకు వినియోగించి, సన్న్యాసియై , ఇల్లువదలి దేశసంచారం చేస్తూ పాటలీపురం ( కడలూరు) ప్రవేశించారు . అప్పుడక్కడ ఆ రాజ్యతంత్రానికి ప్రధానమైనది , ప్రారబ్దవశాత్తు వీరక్కడికి వెళ్ళి ఆ మతంలో చేరి ధర్మసేనుడనే బిరుదునామంతో ఆ మఠానికి ఆచార్యుడుగానూ , ఆ రాజుకు పురోహితుడుగానూ, ఆస్థాన పండితుడుగానూ నిలిచిపోయారు .

  " స్వగృహమందున్న తిలకావతి ఈ సమాచారం విని దుఃఖించి , తనకూ తన తల్లిదండ్రులకూ తన వంశపరంపరలోని వారందరికీ నిత్య ఆరాధ్యదైవమై గడిలం నదికి ఉత్తరపుగట్టున ఉన్న వీరట్టానేశ్వరుని శరణుజొచ్చి "స్వామి నన్నేలిన దైవమన్నది సత్యమైతే ఆ పాషండ మతకూపంలో పడ్డ నా సోదరుని రక్షింప తగును ' అని అనేక విధముల అనేకసార్లు ప్రార్థించింది . పరమేశ్వరు డొకనాడు ఆమె స్వప్నంలో తోచి ' ఓ తపస్వినీ ! నీవిక మనఃక్షోభను విడిచి పెట్టుము . నీ సోదరుడు పూర్వజన్మలో సన్న్యాసియై నన్ను పొందగోరి తపస్సు చేసాడు . ఆ తపస్సులో కొంచెం భంగం ఏర్పడింది . ఆ దోషంవల్లనే ఇప్పుడు ఆ మతంలో ప్రవేశించాడు . ఇక నేనతనికి శూలనొప్పి కల్పించి రక్షిస్తాను . చింత విడిచి శాంతించు తల్లీ ' అని చెప్పి అదృశ్యుడైనాడు . “ 

  "అక్కడ ధర్మసేనుని కడుపులో శూల పుట్టింది . ఆ శ్రమణ మతస్థులలో మంత్రతంత్రాలలో ఆరితేరినవారు ఎవరివల్లా అది కుదరక , అంతా వారిని వదలిపెట్టారు . ధర్మసేనునకది దుస్సహమైంది . ఆ స్థితిలో అక్క తలపుకు వచ్చింది. ఆమె వస్తే సహాయ పడుతుందని తోచి ఒక మనుష్యుని ఆమె వద్దకు పంపాడు.  ఆమె ఈ సమాచారం విని ' నా స్వధర్మం విడిచి నేనా శ్రమణమఠాని అని చెప్పమన్నది . ధర్మసేనుడా వార్త విన్న తరువాత “ అయ్యో నా  స్వధర్మమైన  శైవమతాచారాన్ని విడిచి వెంగలి  నైనానే" అని చింతించి ఆ మఠస్థులకెవ్వరి  తెలియకుండా సేవకులిద్ధరిని సహాయం తీసుకుని బయలుదేరి తిలకావతి కుటీరానికి రాత్రికి రాత్రి వచ్చారు." అక్కా అని పిలిచి తలుపు తట్టగానే ఆమె గుర్తించి తలుపు తీసింది. వారు వెంటనే ఆమె పాదాలపై వాలి 'అక్కా ! ఇక నీవే నన్ను తరింపచేయాలి.' అని భోరున దుఃఖించారు.ఇలకావతి పరమేశ్వరుని ఆ అపారకరుణా విశేషమునకు పొంగి,సోదరుని ఆదర  పూర్వకంగా లేవదీసి విభూతినిచ్ఛి పంచాక్షరీ మంత్రం ఉపదేశించింది . మరుల్ నీక్కియారు ఆ విభూతిని ఒళ్ళంతటా పూసుకొని పంచాక్షరిని గ్రహించారు.

   "తిలకావతి సోదరుని వెంటబెట్టుకొని వీరట్టానేశ్వర ఆలయానికి వెళ్ళింది . స్వామి  సన్నిధిలో నమస్కరించి నిలువగానే మరుల్నీక్కియారుకు కవిత్వధార ఏర్పడింది . వెంటనే స్వామిని స్తుతించాలన్న తలపు కలిగి “ కూర్ ట్రాయినవారు '  అనే పాదంతో ప్రారంభించి పదికం పాడనారంభించారు . వారి శూలనొప్పి తత్ క్షణమే అణగిపోయింది . అందుకే ఆ పదికంలో ఇది పాడినవారికి - గర్భవ్యాధులన్నీ పోగలవన్న భావం వస్తుంది . 

   "ఆ తరువాత వారు అక్కడినుండి సన్న్యాసవేషంతో బయలుదేరి , ఒక్కొక్క క్షేత్రంలోనూ పదికాలు పాడుతూ సంచారం చేయడంలో క్రమంగా చిదంబరానికి వచ్చారు . అక్కడ నటరాజమూర్తిని సేవించి , పదికం పాడి , సమీపంలో ఉన్న ' శ్రీయాళి ' అనే క్షేత్రంలో అవతారమూర్తి అయిన సంబంధులు , బాల్యంలోనే దేవియొక్క జ్ఞానపయస్సును త్రాగి , మహాపురుషుడై విరాజిల్లుతున్నట్లు విన్నారు . వెంటనే వారిని దర్శింతామన్న కుతూహలం కలిగి శ్రీ నటరాజమూర్తి యొక్క అనుమతిని పొంది శిష్యపరివృతులై వెళ్ళారు . వీరి రాక సంబంధులకు తెలిసి తామున్నూ శిష్యసమూహంతో కదలివచ్చి వీరిని ఎదుర్కొన్నాడు . ఉభయులూ కలిసిన వెంటనే మరులోనీక్కియారు సంబంధుల పాదాల మీద వాలారు . వారు వెంటనే వీరి చేయి పట్టుకొని లేవనెత్తి వందనపూర్వకంగా ' అప్పా ' అన్నారట . వీరున్నూ వెంటనే “ అడియేన్ " ( దాసన్ ) అన్నారట . నాటినుండీ వీరికి అప్పరనే పేరు ప్రసిద్దమయింది . తరువాత వారిద్దరూ చేతులు కలుపుకొని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ప్రవేశించారు . సంబంధులప్పుడు అప్పరును చూచి ' అప్పా !  నీ స్వామిని స్తుతించు ' అన్నారట . వెంటనే వారు పద్యపదికం పాడారు . ఆ తరువాత వారిద్దరూ కలిసి అనేక క్షేత్రాలలో సంచరించి పద్యపదికాలు పాడుతూ వచ్చారు . వేదారణ్యం - పడికాసులను గుఱించి విన్నారుకదా . ఇంకా అటువంటి కథలు ఎన్నో ఉన్నవి . అప్పరుతో సఖ్యం ఏర్పడ్డ తరువాతనే సంబంధులు పాటలీపురానికి వెళ్ళి శ్రమణమఠస్టులను వాదంవల్ల ఓడించి తమ సిద్దాంతం స్థాపించారు . సాధారణంగా వారిద్దరూ కలిసే ఉండేవారన్నమాట ” అని సెలవిచ్చారు .
Telegram. T.me/bhagavanRaman
https://www.facebook.com/359807631501891/posts/391731658309488/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ