రమణాశ్రమ లేఖలు188 వేదారణ్యం-పడిక్కాసు 4-5-48


రమణాశ్రమ లేఖలు188 వేదారణ్యం-పడిక్కాసు 4-5-48
https://bhagavanraman.blogspot.com/2019/02/188-4-5-48.html
    అప్పర్ మొదలైన భక్తులంతా రాసిన పద్యాలన్నీ చాలా బాగం పదికాలే. అంటే ఒక్క విషయం పది పద్యాలు పాడి ముగించడం అన్నమాట నిన్న అప్పర్ పరమపదించిన దినమని సుందరేశయ్యరు, శివానంద, ఆ పదికాలలో ఒకటి రెండు పద్యాలు చొప్పున పాడుతుంటే భగవాన్ ఉత్వాహంతో ఒక్కొక్కదానికి అర్థం చెపుతూ వేదారణ్యంలొ చేసిన స్తోత్రపసికంలో కడపటి పద్యం పాడేసరికి " ఇదుగొ! దీనికొక కథ ఉంది ” అని సెలవిచ్చి ఆ కథ ఈ విధంగా చెప్పారు .

   "పన్నెండేళ్ళ వయస్సులో వున్న సంబంధులూ , అప్పరూ కలిసి యాత్రకు వెడుతు వేదారణ్యంకి చేరారు. అక్కడి దేవాలయ సింహద్వారం మూయబడి తాళంపెట్టి ఉంది. పూర్వం ఆ దేవాలయంలోని లింగానికి ఒకప్పుడు అనాదులైన . వేదాలు ఆకృతి ధరించివచ్చి అభిషేక పూజాదులు నడిపి , తిరిగి వెళ్ళేటప్పుడు సింహద్వారం మూసి ముద్రలువేసి వెళ్ళినవట . అది మొదలు ఆ ద్వారం తెరవడానికి ఎవ్వరూ సాహసించక , ప్రక్కన గోడకొక చిన్నద్వారం కల్పించి రాకపోకలు సాగిస్తూ వున్నారు . అప్పరూ, సంబంధులూ వచ్చి విచారిస్తే కావలి వారీ విషయం విన్నవించి ప్రక్కతోవన పోవచ్చునన్నారు . వీరికి అలా పోవడానికి మనస్కరించక ' మనము ఈశ్వరుని స్తుతిచే మెప్పించి ద్వారమేల తెరపించ రాదు ? ' అని యోచించి నిశ్చయించుకొన్నారు . సంబంధులు అప్పరును చూచి | అప్పా ! మీరు స్తుతించండీ ' అన్నారు . వారప్పుడు పాడిన పదిక మిది . అప్పరు పాటంటే ఈశ్వరునకు మహాప్రీతి . అందువల్ల వారు పాడుతుంటే వింటూ తలుపులు తెరపడం మరిచాడట ఈశ్వరుడు . తొమ్మిది పద్యాలు పాడినా ద్వారం తెరపకుంటే వారికి పట్టరాని కష్టం తోచి " ఓ ప్రభూ ! కరుణ రాలేదా ? ' అన్న భావంగల పదోపద్యం పాడి , అప్పటికీ తెరవకుంటే రావణుడు కరముచే కైలాసమెత్తితే నీ వేలితో అట్లే అణగదొక్కి వేయేండ్లు కష్టపెట్టావు. అట్టి నీకు కరుణ ఎట్లు వచ్చును ' అనే భావమిచ్చే ' అరక్కనై వరలాండర్త్తిటనీర్ ' అనే ఈ కడపటిదైన పదకొండవ పద్యం పాడేసరికి ' అరరే , మరచితి ' నని గభిల్లున తలుపులు తెరిచాడట ఈశ్వరుడు .

     " వారిద్దరూ ఆలయ ప్రవేశం చేసి స్వామిని సేవించి బయటికి వచ్చిన తరువాత అప్పర్ సంబంధుల నుద్దేశించి “ ఈ ద్వారం మూసుకోవడానికి మీరు కొడండి ' అన్నారు. 'సరే ' నని సంబంధులు ఒక్క పద్యం పాడగానే గభీలున తలుపులు మూతపడ్డవి . ఈశ్వరు డిక్కడ అప్పరును పరీక్షించి , సంబంధులను వెటనే అనుగ్రహించాడు . మరొక చోట సంబంధులను పరీక్షించి అప్పరును చప్పున అనుగ్రహించాడు. అదొక కథ ఉంది. ”ఆ కథ ఏమి ? " అన్నాను.

“ ఏమా ! వేదారణ్యంలో ఈశ్వరుడు ఆ విధంగా పరీక్షించినది మొదలు నా భక్తి కొరవడెను కాబోలునని అప్పరు చింతిస్తూ మనోవాక్కాయకర్మలతో  ఈశ్వరుని  సేవిస్తూ వచ్చారు . ఒక సమయంలో తిరిగి అప్పరూ , సంబంధులూ కలిసి క్షేత్రాటనపరులై వారి వారి సిబ్బందితో ' తిరువీళిమియలై ' అనే ఉరికి వెళ్ళారు అపుడా ప్రదేశంలో క్షామం వచ్చింది . ఆ ప్రజల కష్టం చూడలేక వీరిద్దరూ శిష్యబృందంతో చెరియొక మఠంలో నివసించి అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు . చేతిలో డబ్బేది ? అందుకుగాను ప్రతిదినం ఉదయమే అక్కడి దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని స్తుతించేవారు . వారి భక్తికి పరమేశ్వర డానందించి నిత్యం ఇద్దరికీ చెరియొక పడిక్కాసు ఇచ్చి పంపేవాడు . ( బంగారు కాసు గడపలో పెట్టేవాడట ) అందులో అప్పరు కాసు చప్పున మారకమై వెచ్చాలు త్వరగా ఇంటికి వచ్చేవి . అందువల్ల ఆపరాహ్ణాత్ పూర్వమే వారి అతిథుల భోజనం అయిపోయేది , సంబంధుల నాణెం వన్నె తక్కువని నిత్యం వర్తకులు వట్టమడగటం , సేవకులు ఇంటికి వచ్చి సమాచారం నివేదించి వారి అనుమతి పొంది తిరిగి అంగడికి వెళ్ళి అడిగిన వట్టమిచ్చి వెచ్చాలు తేవలసి రావడం వల్ల వీరి అతిధులకు రెండు గంటలకు కాని భోజనమయ్యేది కాదు . -
  
    “ క్రమేణ ఈ విషయం సంబంధులకు తెలిసింది . సేవకులను విచారిస్తే , చెల్లని కాసువల్లనే జాగవుతున్నదని తేలింది . వారతి దుఃఖితులై " స్వామీ ! నా కేల చెల్లని నాణే మిచ్చావు ' అనే భావంగల ' వాచితీరవే కాచు నల్హునీర్ ' అన్న పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు . అప్పుడు దయామయుడైన ఈశ్వరుడు ' అప్పా ! అప్పరు మనోవాక్కాయముల నన్ను సేవిస్తున్నాడు ( అంటే అప్పరు దేవాలయ సమ్మార్జనాది శారీరక సేవలున్నూ చేసేవాడట ) నీవు మనోవాక్కుల చేతనేకదా నుతించేది . ఆ తారతమ్యం చూపించే నిమిత్తం విధంగా చేసానే కాని వేరేమీలేదు . ఇప్పటినుండి నీకూ మంచిదిదె ఇస్తాను చింతించకు ' అనీ నాటినుండీ అలాగే అనుగ్రహించాడు . ఇదే విధంగా వారి చరిత్రల్లో ఎన్నో చిత్ర కథలున్నవి ” అని సెలవిచ్చారు భగవాన్ .
Telegram. T.me/bhagavanRaman

https://www.facebook.com/359807631501891/posts/394559241360063/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ