రమణాశ్రమ లేఖలు 185  నాయన ప్రవచనం    30 - 4 - 48

శ్రీ రమణాశ్రమ లేఖలు 185  నాయన ప్రవచనం 30 - 4 - 48 
https://bhagavanraman.blogspot.com/2019/02/185-30-4-48.html
  నిన్న మధ్యాహ్నం రెండున్నరకు భగవాన్ సన్నిధిలో “ హృదయ కుహర మధ్యే" అన్న శ్లోకాన్ని గురించిన ప్రసంగం వచ్చి , “ భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడేనా ఆ శ్లోకం రాసింది ? ” అన్నారొక భక్తులు “ అవును . అక్కడుండగానే .1915లో జగదీశ్వరశాస్త్రి మూలంగా అది రాయవలసి వచ్చింది ” అన్నారు భగవాన్ . “ అదా కారణం ? భగవాన్ స్వయంగానే రాసినట్లు రమణగీతలో సూచించారే ? ” అన్నారా భక్తులు . “ కాదు కాదు . 1915లో చాతుర్మాస్యంలో స్కందాశ్రమంలో ఉంటూ వచ్చాను . జగదీశన్ అప్పుడు ఇక్కడే ఉన్నాడు . ఒకనాడు ఒక కాగితం మీద ' హృదయకుహర మధ్యే ' అని రాసి చేతితో పట్టుకుని కూర్చున్నాడు . నేనది చూచి , ' ఏమిటోయ్ ? ' అంటే  "శ్లోకం ఒకటి రాయాలని తోచింది . రాయబోతే ఈ ఒక్క పదమే స్ఫురించి రాసాను ' అన్నాడు . కొదవ పూరించమంటే , నాకేదీ స్ఫురించడం లేదని కాగితం నా ఆసనం క్రింద పెట్టి ఉంచాడు . ఎన్నిసార్లు హెచ్చరించినా , నావల్ల కాదని వదలి ఒకనాడు ఎక్కడికో వెళ్ళాడు . వాడు వచ్చేలోపల నేనది పూరించి , శ్లోకం క్రింద ' జగదీశన్ ' ని రాసి , వాడు రాగానే చూపాను . వానికప్పుడు చాలా చిన్న వయస్సు . భగవాన్ కదా పూరించింది ! జగదీశన్ అని రాసారెందుకు ? ' అన్నాడు . అదేమోయ్ ! జగదీశన్ కదా పూరించింది ” అన్నాను . ' జగదీశనే రాసిందయితే  ఆ కాగితం నాకు ఇవ్వండని లాగుకొని దాచుకొన్నాడు . అని సెలవిచ్చారు భగవాన్ .

    భగవాన్ జగదీశ్వరులే కదా?” అన్నా నేను . “ అది సరి ” అంటూ మళ్ళీ ఆ మాట ఎత్తనీయక భగవాన్ ఇలా సెలవిచ్చారు  “ ఆ శ్లోకం రాసి కొన్నాళ్ళకు ఒకనాడు ఆ పైగా ఉన్న పెద్ద బండమీద నేను కూర్చుంటే , అంతా చుట్టూ చేరి ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారు . సరేనని రెండు మూడు గంటల సేపు చెప్పాను.ఆ బావం తీసుకుని , ఇటీవల జగదీశన్ శంకరుల ఏకశ్లోకికి వలే  పెద భాష్యం రాసాడు . ఆ రాత ప్రతి ఎక్కడో పోయిందట . నాయన ఈ రమణ గీత రాసినప్పుడు అరుణాచల పంచరత్నాలు మంగళ శ్లోకాలుగానూ , ఈ శ్లోకం రెండవ అధ్యాయానికీ , పెట్టుకున్నారు , అంతే . కారణం లేకుండా రాయలేదు .
 
  " నాయన రమణగీత రాసింది కూడా అప్పుడేనా ? ” అన్నారింకొకరు . కాదు . ఆ తరువాతనే . 1917 జూలైలో రాసారది . అయితే , ఒక చిత్రం ఏమంటే నాయన 1913లో నన్ను కొన్ని ప్రశ్నలడిగి తెలుసుకున్నారు కదా . వారి మనస్సులో ఆ భావం నాటుకొని పోవడంవల్ల ఎక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా ఆశుకవి కనుక ఉపమానంగా ఏదో ఒక శ్లోకం కల్పించి చదివి ' ఇది రమణగీతలో ఇన్నో అధ్యాయంలో , ఇన్నో శ్లోకం ' అని చెప్పి దబాయించేవారు . రమణగీతకు కాగితం మీద ఒక గీతైనా పెట్టక ముందే ఈ దబాయింపంతాను . వారు దబాయించ సాగినారంటే ఎవరూ బదులు చెప్పగలిగేవారు కాదు . ఒకటే ఆవేశం . అలా చెప్పి చెప్పి చివరకు ఆ గీత రాసారు ” అన్నారు భగవాన్ .
 
   “ ఎవరైనా ఏదీ రమణగీత ? అంటే ఏం చేసేవారో ? ” అన్నారా భక్తులు . భగవాన్ నవ్వుతూ “ వారి ఎదుట బదులు చెప్పేందుకు ఎవరికి అంత సాహసం ! వారి దర్పం అటువంటిది . రమణగీత రాసిన తరువాత కూడా ఏం చేసేవారను కున్నారు . దానిలో లేని శ్లోకాలు కూడా కొన్ని ఉపమానంగా చెప్పి , ఇదీ రమణ లోనిదే అనేవారు . ఎవరైనా కొంచెం ధైర్యంతో ' ఇది అందులో లేదే ' అంటే , ‘ మహా రమణగీతలో ఉన్న దనేవారు . అది కూడా రాయాలనే ప్లాను వేసుకున్నారు కాని ఇలా అయింది . అరుణాచల పంచరత్నాలకూ భాష్యం రాసి , తమ సామర్ధ్యం అంతా  చూపించాలని అనేవారు కానీ ఆ పని జరగలేదు." అన్నారు భగవాన్.
  
  " నాయన శైవ సిద్ధాంతాన్ని గురించి ఇదే విధంగా ఒకసారి ఉపన్యసించారట కదా ? " అన్నారింకొక భక్తులు. “ అవును . అది వారిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లోనే. వారికప్పటికీ శైవ సిద్ధాంతాన్ని గురించి తెలియదు . శైవ సిద్ధాంత సభ వారు ఆ సంవత్సరం సమావేశం ఈ ఊళ్ళో జరిగేటట్లు ఏర్పాటు చేసుకొని , ఆ సభకు అగ్రాసనాధిపతిగా నాయనను ఆహ్వానించారు . వీరు గొప్పపండితులు కదా శైవ సిధ్ధాంతాన్ని గురించి వివరణ సహితంగా ఉపన్యసించ గలరనీ ప్రకటించారు. ఆ సభ ఇంకా నాలుగయిదు రోజులుందనగానే నాయనకు తెలియజేస్తే 'సరే వస్తా ' నని జంకూగొంకూ లేకుండా చెప్పిపంపి , మాట్లాడకుండా ఊరుకున్నారు.. తీరా సభ జరిగేనాటి ఉదయాన నా వద్దకు వచ్చి ' వాళ్ళేదో శైవ సిద్ధాంత సభకు రమ్మనీ , ఉపన్యసించమనీ అన్నారే . నాకింతవరకూ ఆ సిద్ధాంతమేమో తెలియదు . అసలు దాని తత్త్వమేమిటి ? ” అని అడిగారు . నేనప్పుడు అరవంలో ఉన్న “ శివజ్ఞాన బోధం ” అనే శైవ సిద్ధాంత గ్రంథం లోనివి పన్నెండు సూత్రాలూ ఎత్తి చెప్పి , మొత్తంమీద ఆ సిద్ధాంత భావమంతా సంగ్రహంగా చెప్పాను . ఇంకేం . వారు మంచి మేధాసంపన్నులు కనుక అర్ధమంతా గ్రహించి సభకు వెళ్ళారు . బావమంతా సమగ్రంగా మననంలో ఉండడం వల్ల ఆ భావమే ఆశువుగా శ్లోకరూపంగా గడగడా చదివి , అరవంలో అనర్గళంగా ఉపన్యసిస్తే , సభ్యులంతా స్తంభించి పోయారట . నాయన తిరిగి వచ్చి , ' ఈనాడు మాట్లాడింది నా శక్తి వల్లకాదు . భగవాన్ అనుగ్రహం వల్ల ఎన్నడూ చదువని శైవ సిద్ధాంతమంతా కరతలామలకంవలె అవగతమైనది ' . అన్నారు . వారి మేధాశక్తి అటువంటిది" అని సెలవిచ్చారు భగవాన్ .
 
  “ వారు ఉమాసహస్రం కూడా తెల్లవారి చదివే రోజనగా ఆ రాత్రికి గాని పూరించలేదట కదా ? ? అన్నా రొకరు . " అవునవును . వారప్పుడు చూతగుహలో ఉన్నారు . ఫలానా రోజున ఆపీతకుచాంబ్ సన్నిధిలో ఉమాసహస్రం చదువుతా మని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపితే , అంతా వచ్చారు . తెల్లవారితే చదివే రోజు . అప్పటికింకా మూడు వందల శ్లోకాలు కొదువపడ్డవి . నాయన నావద్దకు వచ్చి ' ఆ మూడువందలూ తెల్లవారే లోపల పూరించాలే . ఎలాగూ ? ' ' దానికేమి, రాత్రి భోజనానంతరం రాస్తే పోతుందీ అన్నాను అయితే. తామక్కడికి  దయచేయాలని వారన్నారు . అదంతా నేను కొండగానే సరేనని నేనా చూతగుహకు వెళ్ళి , ఒక మూలగా ఒత్తిగిలి పడుకున్నాను. కళ్ళు తెరిచే ఉన్నానన్న మాట . వారు నాకెదురుగా కూర్చుని , రాసేందుకుే నలుగురు శిష్యులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం చొప్పున చెపుతూ  12 గంటలలోపల మూడు వందల శ్లోకాలూ పూరించారు " అన్నారు భగవాన్.
 
  “ ఆ మూడు వందలూ అయ్యేవరకూ భగవాన్ తదేక దృష్టితో చూస్తూనే ఉన్నారనీ , ముగించగానే లేచి కూర్చుని ' నేను చెప్పినదంతా రాసుకున్నారా' అనీ భగవాన్ అడిగారనీ విన్నామే . నిజమేనా ? " అన్నారా భక్తులు.“
     అవును, నిజమే, అవన్నీ నేనే చెప్పినట్లు తోచింది . ” అన్నారు భగవాన్.
" నాయన , మిగతా శ్లోకాలన్నీ ఎన్నోసార్లు మార్చారట కాని ఆ మూడు వందలలోనూ చెయ్యి పెట్టనేలేదటే ? " అన్నారా భక్తులు.
      “ ఊ - ఊ " అని తలవూపుతూ మౌనం వహించారు భగవాన్.
Telegram. T.me/bhagavanRaman

https://www.facebook.com/359807631501891/posts/393460364803284/?app=fbl

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ