రమణాశ్రమ లేఖలు 183 తెర 28 - 4 - 48
రమణాశ్రమ లేఖలు183 తెర 28 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/183-28-4-48.html
నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు భగవానుని సమీపించి “ స్వామీ ! తన్ను తా నెరిగిన వారికి జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడవస్థలూ ఉండవంటారే నిజమేనా ? ” అన్నాడు . భగవాన్ ప్రసన్నదృష్టితో చూస్తూ “ ఉండవంటే ఏమని మీ భావం ? నాకు స్వప్నం వచ్చింది , నాకు గాఢంగా నిద్రపట్టింది , నాకు మెలకువ వచ్చింది , ' అని అంటూ ఉండడంవల్ల ఈ మూడవస్థలలోనూ నీవు ఉన్నట్లు ఒప్పుకోక తప్పదు కదా . అందువల్ల నీవు ఎప్పుడూ ఉన్నావన్నది స్థిరపడుతూనే ఉంది . ఉన్నట్లే ఉంటే , జాగ్రదవస్థ వస్తుంది . అది మరుగై స్వప్నం వస్తుంది . అదీ పోయి సుషుప్తి వస్తుంది . నీవు అప్పుడూ ఉన్నావు , ఇప్పుడూ ఉన్నావు . ఎప్పుడూ ఉన్నావు . పై మూడవస్థలూ వచ్చేవీ పోయేవీను . నీవో ఎప్పుడూ ఉంటావు అది ఎలాగంటే సినిమా దృశ్యం వలెనే . తెర ఎప్పుడూ ఉంటుంది. ఏం ఉంటావు.రకరకాల బొమ్మలు వస్తాయి , పోతాయి . తెరకు ఒక్కటీ అంటదు.తెర తెరగానే ఉంటుంది . అదేవిధంగా నీవు నీవుగానే ఉంటావు. అది తెలుసుకుంటే అవస్థలు తెరమీద బొమ్మలవలెనే నిన్నేమీ బాధించవు. అంటే నీకు అంటవన్న మాట . సినిమా తెరమీద బొమ్మల వలెనే నిన్నేమీ బాధించవు. అంటే నీకు అంటవన్నమాట. తెర మీద ఒకప్పుడు అంతులేని అలలతో సముద్రం గోచరిస్తుంది , పోతుంది . మరొకప్పుడు గుప్పున మండుతూ అగ్ని, కనిపిస్తుంది . అదీ పోతుంది . అప్పుడూ తెర ఉంది , ఇప్పుడూ తెర ఉంది. తెర ఆ నీటివల్ల తడిసిందా ? ఈ అగ్నివల్ల కాలిందా ? ఏదీ దానికంటలేదు. అదేవిధంగా జాగ్రత్ స్వప్న సుషుప్తు లలో కలిగే కల్లోలాలేవీ నిన్నంటవు. నీవు నీవుగానే ఉంటావు ” అని సెలవిచ్చారు .
" అయితే , మూడవస్థలూ ఉన్నా వారికేమీ అంటవన్నమాట . అంతేనా అన్నారా పృచ్ఛకులు . “ అదే అదే . ఇవన్నీ వస్తాయి , పోతాయి . వారికేమి? వారి కెప్పుడూ ఒక్కటే అవస్థ ” అన్నారు భగవాన్ . “ అంటే అన్నిటికీ సాక్షి మా ఉంటారనే కదా అర్థం ” అన్నారా భక్తులు . “ అదేనండీ . దీనికే పంచదశి దశమ ప్రకరణంలో విద్యారణ్యులవారు నాటక దీపం ఉపమానంగా చెప్పారు . నాటకం ఆడుతూ ఉంటారు . దీపం దానికి సాక్షి , అది రాజ , సేవక , నర్తకీ విభేదంలో హెచ్చుతగ్గులు లేకుండా రంగస్థలంలో నటించే నటకులు మీదా , ప్రేక్షకుల మీదా ఒకేవిధంగా ప్రసరించి ప్రకాశింపజేస్తుంది . రంగానికి ముందూ దీపం వుంటుంది . రంగం నడుస్తున్నప్పుడూ ఉంటుంది . రంగం ముగిసిన తరువాతనూ వుంటుంది . అదేవిధంగా సాక్షి కూడా వృద్ధిక్షయాది వికారాలు లేకుండా అహంకారాన్నీ , బుద్ధినీ , శబ్దస్పర్శలనూ, విషయాదులనూ ప్రకాశింప జేస్తూ ఉంటాడు. సుషుప్త్యాద్యవస్థలలో అహంకారాదులు లేనప్పటికీ ఆ సాక్షి నిర్వికారుడై స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు అని తాత్పర్యం . ఏదైనా ఒకటే . తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే సందేహాలే ఉండవు ” అని సెలవిచ్చారు భగవాన్ .
Telegram. T.me/bhagavanRaman
https://www.facebook.com/359807631501891/posts/395110511304936/?app=fbl
Comments
Post a Comment