రమణాశ్రమ లేఖలు  181  ఋభువు - నిదాఘుడు  25--4--48

రమణాశ్రమ లేఖలు  181  ఋభువు - నిదాఘుడు  25--4--48
https://bhagavanraman.blogspot.com/2019/02/181-25-4-48.html
   భగవాన్  అష్టావక్ర జనకుల కథ సెలవిస్తూంటే విన్న ఆంధ్రులొకరు ఈ ఉదయం శ్రీవారిని సమీపించి “ నిన్న భగవాన్ అష్టావక్ర జనకుల సంవాదం సెలవిస్తూ ఋభుగీతను గుఱించి ప్రస్తావించారే , ఆ గీత ఏర్పడిన  ఏమిటో ? " అన్నారు .  "అదా! ఋభు మహర్షి నిధాఘునికి చేసిన తత్వోపదేశమే ఋభుగీత " అన్నారు భగవాన్. "ఋభువు నిధాఘుని పరీక్షించిన కధ కూడా చిత్రంగా ఉంటుంది కదా అన్నాను."ఆ కధ కూడా భగవాన్ సెలవిస్తే  వినాలన్న కుతూహలం కలుగుతున్నది" అన్నారా భక్తులు.
https://www.facebook.com/359807631501891/posts/396207581195229/?app=fbl
     భగవాన్ చిరునవ్వుతో . ఈ విధంగా సెలవిచ్చారు: .  “ ఋభు మహర్షిని ఆశ్రయించుకొని ఎందరో శిష్యులున్నప్పటికీ , శాస్త్రములలో ఆరితేరిన బుధ్ధిశాలియు . పవిత్రమానసుడును , గురుభక్తి తత్పరుడును ఐన నిదాఘుని మీద వారికి అత్యంత వాత్సల్యం ఏర్పడింది . అద్వైత తత్త్వం అతనికి ఎంతో విశదంగా బోధించారు . అయినప్పటికీ , అతని మనస్సు సంప్రదాయాను సారమైన కర్మకాండ నుండి విడుదల చెందనందువల్ల గురూపదిష్ట మార్గంలో నిలకడ కలుగలేదు . అందువల్ల కర్మకాండ ననుసరిస్తూ , జన్మస్థానమైన ఒక పట్టణంలో ఉంటూ వచ్చాడు . అలా ఉంటూ ఉన్నప్పటికీ , మనస్సులో మాత్రం గురుభక్తి దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నది . ' యద్భావం తద్భవతి ' అన్నట్లు శిష్యునికి గురుభక్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో , అదే విధంగా గురువు శిష్యునియందు వాత్సల్యం వృద్ధి కావొచ్చింది . అందువల్ల కర్మకాండ నుండి ఏ  మాత్రం విడివడుతున్నాడో చూద్దామన్న తలపుతో , అప్పుడప్పుడా ఋభువు , | నిదాఘుని వద్దకు వెళ్ళివస్తూ ఉండేవారు . ఒక్కొక్కసారి ఆయన మారువేషంతో కూడా వెళ్ళేవారు .
    
  అలా మారువేషంతో వెళ్ళిన ఒక సమయంలో , నిదాఘుడు రాజభవనము నుండి ఉత్సవంతో బయలుదేరే రాజును చూస్తూ నిలబడి ఉండడం , పల్లెటూరి మోటు ఆసామీ వేషంలో వచ్చిన ఋభువు చూచాడు . నిదాఘుడు మాత్రం ఈ మనిషిని చూడలేదు . మోటువేషంతో వచ్చిన ఆ ఋభువు , నిదాముని పరీక్షించదలచి ' ఇదేమయ్యా ఈ గుంపులూ , కేకలూను ' అన్నాడు . నిదాఘుడా మనుష్యుని చూడకుండానే , మాట మాత్రం విని రాజు ఊరేగేందుకు వెడుతున్నా ' డన్నారు .

ఋ:  ఓహో!ఊరేగేందుకు వెడుతున్నాడా ? ఎవరు రాజు ?

ని :అడుగో , ఏనుగు మీద ఉన్నాడే , అతడే రాజు.

ఋ :  ఆ ! ఏమిటి ? రాజు ఏనుగు మీద ఉన్నాడనా అంటున్నావు. సరే  అయితే , నేను రెండింటినీ చూస్తున్నాను . ఇందులో రాజెవడు? ఏనుగేది ?

ని:  అదేమయ్యా ! నీవు రెండింటినీ చూస్తున్నావు కదా పైన ఉన్నవాడు రాజనీ , క్రింద ఉన్నది ఏనుగనీ తెలియదా ?

ఋ : ఆ ! ఏమిటేమిటి ? సరిగా చెప్పవయ్యా బాబూ.

ని: అబ్బబ్బా, నీ వంటి మనిషితో మాట్లాడడమే కష్టం . ఎన్నిసార్లు చెప్పేదీ?  సరిగా విను . పైన ఉన్నది రాజు . క్రింద ఉన్నది ఏనుగు . ఇప్పుడు తెలిసిందా ? లేదా ?

ఋ : అయ్యయ్యో , నావంటి మూఢుల మీద ఆగ్రహించకు బాబూ , నిన్ను వేడుకుంటాను . ఇంకొక్క మాట . పైన క్రింద అంటావే , దానికి  అర్థమేమిటో కాస్త చెప్పు నాయనా .

ని : ( కోపంతో ) , సరిపోయింది . పైన రాజూనూ , క్రింద ఏనుగునూ  చూస్తునే ఉన్నావు . అలా ఉండికూడా పైన , క్రింద అంటే ఏమో  తెలియదంటావేమి ?

ఋ : ఆ . . . ఆ అవునయ్యో . రెంటినీ చూస్తున్నాను . అందులో పైన ఏమి ? ఏ క్రింద ఏమి ?

ని : ( కోపం ఆగక ) ఉస్సో . అబ్బబ్బ . నీకు చూచిన దృశ్యాలూ , విన్న వార్తలూ ఈ మాత్రం అర్థం కాకుంటే , ఆచరణ రూపకంగానే బోధించాలన్న మాట . అయితే వంగు . అంతా నీకే పూర్ణంగా అర్థమవుతుంది .

    నిదాఘుడు చెప్పినట్లే వంగాడా పల్లెటూరి అసామి . నిదాఘుడు వెంటనే అతని వీపుమీద మీద ఎక్కి కూర్చుని ' ఆ - ఇదుగో , ఇప్పుడు తెలిసిందా ! పైన నేను రాజువలె ఉన్నాను . క్రింద నీవు ఏనుగువలె ఉన్నావు . సరేనా . బాగా అర్ధం అయిందా ? ” అన్నాడు .
 
ఋ : ఊహూ - తెలియలేదే ? ఇంకా బాగా అర్థం కాలేదు . నీవు పైన వున్నావనీ , నేను ఏనుగువలె క్రింద ఉన్నానని అంటూ ఉన్నావు. రాజు పైన ఏనుగు కింద, అంతవరుకు అర్ధం అవుతున్నది. నేను , నీవు ” అని అన్నావే అది మాత్రం అర్ధం కాలేదు . దేని నుద్దేశించి ' నేను , నీవు , అంటావు ? ఆ విషయం కొంచెం వివరంగా చెప్పు బాబూ ' అని బహు నిదానంగా ప్రశ్నించాడు .

     ఈ విధంగా  నేను . నీవు అనుదానిని విడిచి , “ తాను ' అను పదాన్ని వివరించేదైన ఈ ప్రశ్న తటాలున తన ఎదుట తోచినందువల్ల నిదాఘునకు తెలివి. కలిగి , తత్క్షణం క్రిందకు దూకి , ఆ పల్లెటూరి మనిషి పాదాలమీద వాలి 'పూజ్యపాదుడైన నా గురువు ఋభువు తప్ప , బాహ్యమైన ఈ భౌతిక వ్యవస్థ నుండి విడివడి యథార్థ వస్తువైన ఆత్మయందు నిశ్చయబుద్ది ఏర్పడునట్లు , నా మనస్సును ఆకర్షింపగలవారు వేరెవరున్నారని నిశ్చయించి , అంజలి హస్తుడై నిలిచి తనకప్పుడు కలిగిన ఆత్మానుభూతిని గురించి వారికి వివరించి , ఆ నిశ్చయజ్ఞానలబ్దికై తన గురువును అనేక విధముల ప్రార్థించాడు . ఋభువు స్వరూప వర్ణన చేస్తూ అందులో అతనికి దృఢ నిశ్చయము ఏర్పడే విధంగా బోధించారు . ఆ బోధే ఋభుగీత . అందులో స్వరూపవర్ణనే ఎక్కువగా ఉంటుంది ” అని సెలవిచ్చారు భగవాన్ .
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ