రమణాశ్రమ లేఖలు 179 గురుకృప 23 - 4 - 48
రమణాశ్రమ లేఖలు 179 గురుకృప 23 - 4 - 48
https://bhagavanraman.blogspot.com/2019/02/179-23-4-48.html
మొన్న పన్నెండవ తేదీన విజయవాడ నుండి చాలాకాలంగా వస్తూ పోతూ ఉండే గంగరాజు మల్లికార్జునరావు అనే బ్రాహ్మణుడు ఆలుబిడ్డలతో సహా వచ్చాడిక్కడికి . వారికి అయిదుగురు ఆడపిల్లలున్నారు . ఆ అయిదుగురి నందున అయిదుగురు మగపిల్లలు గతించారట . ఆరవవానికి ఆరో నెలలో భగవాన్ సన్నిధిలో అన్నప్రాసన చేయాలనీ , భగవాన్ చేత్తోనే అన్నం పెట్టించాలనీ ఎంతో ఉత్సాహంతో వచ్చారు . ఆ ముహూర్తం ఎల్లుండనగా ఆ బిడ్డ అకస్మాత్తుగా అస్తమించాడు . ఈ సాయంత్రం వాళ్ళు ఊరికి వెళ్ళాలని నిశ్చయించుకొని , మూడింటికే భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చున్నారు . వాళ్ళ మనస్సులో కించ పోగొట్టే నిమిత్తం ఈశ్వరుడు ఈ విధంగా అడిగించాడా ? అన్నట్లు ఒక భక్తుడు " స్వామీ ! ప్రాణాయామాది సాధనలవల్ల శరీరం చాలాకాలం ఉండేట్లు చేయవచ్చుననీ , జ్ఞానులు ఆ విధంగా చేస్తారనీ అంటారే, నిజంగా ఉంటారా? ఆ చేస్తే మంచిదేనా ? ” అని ప్రశ్నించాడు .
https://www.facebook.com/359807631501891/posts/396715711144416/?app=fbl
భగవాన్ సావధానులై “ అవును , చేస్తే ఉంటారు . చాలాకాలం జీవించినంత మాత్రాన జ్ఞానులౌతారా ? కొద్దికాలం బ్రతికినవారు జ్ఞానులు కాకుండా ఉంటారా ? శంకరులు ముప్పది రెండేండ్లే ఉన్నారు . మణివాచకులు 32, సుందరులు 18 , సంబంధులు ఇంకా త్వరలోనే 16 సంవత్సరములకే శరీరం విడిచారు . వారంతా జ్ఞానులు కారా ఏమి ? జ్ఞానికి అసలు ఈ శరీరం మీద ప్రీతియే ఉండదు . సుఖస్వరూపుడైన తనకు ఈ శరీరం ఒక వ్యాధిగా ఉంటుంది . ఎప్పుడు ఈ వ్యాధి బాధ తొలగుతుందా అని చూస్తాడు. ఇది ఉండగానే పళ్లు తోమాలి , బయటికి పోవాలి , స్నానం చేయించాలి, ఆహారం ఇవ్వాలి , ఎన్నో ఉపద్రవాలు , పుండు పడితే దాన్ని కడిగి , కట్టుకట్టకుంటే వాసన . పట్టదూ ? అలాగే ఈ శరీరాన్ని అనుక్షణం బాగుచేయకుంటే చెడుతుంది. జ్ఞానియైనవాడు కూలికి బరువు మోసినట్లే మోస్తాడు దేహాన్ని. గమ్యస్థానం వచ్చేది ఎప్పుడా , ఎప్పుడా అని ఎదురు చూస్తాడే కాని ప్రాణాయామాలు కాయకల్పములూ చేసి ఈ వ్యాధిని ఇంకా భరించాలని అనుకుంటాడా ? అదంతా సిద్దుల పద్దతి . నేను కొండమీద ఉండగా పైన చెప్పిన సిద్ధశాఖలోని వాడు కొందరు ఉండేవారు . వారిని ఎవరైనా చూచేందుకు వస్తే , కూర్చోమని మీదేవూరు నాయనా ? ” అంటే , “ ఫలానా వూరు ' అనేవారు . ' మీ తాత పేరు ? మీ ముతాత పేరు ? ' అని అడిగి తెలుసుకొని ' ఆ . . . అదే అదే . . . మీ ముత్తాతకు తండ్రి ఇంత పిల్లవాడయి ఉండగా , నే నిక్కడికి వచ్చాను ? ' అని అనేవారు . “ అబ్బో ! ఇన్నాళ్ళు బ్రతికి ఇంత దృఢంగా ఉన్నాడే , ఎంత గొప్పవాడో అని వారంతా నమస్కరించి , కానుకలు చెల్లించి వెళ్ళేవారు . అదంతా లోకాన్ని ( ఏమార్చేందుకు ) మోసగించేందుకు కాని , అందువల్ల జ్ఞానులౌతారా ?
వాసిష్ణంలో రాముడు తీర్థయాత్ర చేసి , తిరిగివచ్చిన తరువాత ' లోకమంతో దుఖమయమే . శరీరధారణమే దుఖము ' అనే విరక్తితో అన్నపానాదులు సహితం పరేచ్చానుసారం నడుపుతూ , జడునివలె ఉండి పోయాడట. విశ్వామిత్రుడు యాగరక్షణార్థం రాముని పంపుమని దశరథు నడిగతే ' వాడు పిచ్చిపట్టిన వాడివలె ఉన్నాడు స్వామీ' అని చెప్పి, ఆ పిచ్చికి గల లక్షణాలు కొన్ని వివరించారట వారు. విశ్వామిత్రుడు అది విని ' నాకు చాలా సంతోషంగా ఉన్నది . ఆ పిచ్చి అందరికీ పడుతుందా. చూద్దాం పిలిపించు ' అంటే పిలిపించారు. సభకు వచ్చిన రాముడు అందరికీ నమస్కరించి కూర్చున్నాడు . విశ్వామిత్రుడు రాముణ్ణి చూచి , విచార కారణం అడిగి తెలుసుకొని , వశిష్ఠుడితో "ఏమయ్యా మనిద్దరకు బ్రహ్మ ఉపదేశించిన ఆత్మతత్త్వం ఈ రామునికి బోధించి కలత పోగొట్టుము ' అనీ నియోగిస్తే వారు ' సరే ' నన్నారు . ఆ బోధ వినే నిమిత్తం వినువీధి నుండి సిద్ద సంఘం దిగివస్తూ ' ఈ రాముడు అతి బాల్యంలోనే ఇంత జ్ఞానం పొందాడే ఎంత వింత , అని పొగుడుతూ , మనము ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి లాభం ? ” అని అనుకున్నారట చూచారా ? ” అన్నారు భగవాన్
అవును. నిజమే , కొందఱు మేము ఇంచుమించు ఎనబదేండ్లు బ్రతికాం . ఇంకేం కావాలి . అంటారు అదొక ఘనమని ” అన్నారింకొక భక్తులు . భగవాన్ నవ్వుతూ “ అవునవును. అదొక గర్వం . దానికొక కథ ఉన్నది . పూర్వం బ్రహ్మ కొకసారి తానే చిరంజీవినన్న గర్వం కలిగి విష్ణుసన్నిధికి వెళ్ళి , “ నేనెంత గొప్పవాడనో చూచావా ? చిరంజీవిని ' అన్నాడట . ఆ విష్ణువు ' కాదు నాయనా ! నీకంటే చాలా పెద్దవాళ్ళున్నారు ' అంటే ' అందరినీ సృష్టించేవాణ్ణి నేనేకదా . నా కంటే పెద్దవారెవరున్నారు ? ' అన్నాడు . “ సరే చూపుతాను రమ్మని , విష్ణువాతని వెంట పెట్టుకొని పోతూ వుంటే , ఒక చోట రోమశ మహాముని కనుపించాడు . ' అయ్యా ! తమకిప్పుడు వయస్సెంత ? ఇంకెంత కాలం ఉంటారు ? ' అని అడిగాడు విష్ణువు . ' నాయనా ! నా వయస్సెంత ? ” చెపుతా విను . అని “ ఇన్ని వేలయేండ్లు ఈ యుగం , అన్ని వేలు ఆ యుగం ” అంటూ లెక్కించి ' అవన్నీ కలిస్తే , బ్రహ్మకొక రాత్రి పగలూను . ఆ సంఖ్య ననుసరించే , బ్రహ్మకు సూరేండ్లాయుస్సు . అటువంటి ఆయుర్దాయం గల ఒక్క బ్రహ్మ గతించినప్పుడు నా దేహంలోని రోమం ఒకటి ఊడుతుంది . అలా ఒక్కొక్క బ్రహ్మకల్పమునకు ఒక్కొక్కటిగా ఎన్నో రోమాలు పోగా ఇంకా ఎన్నో ఉన్నవి . ఇవన్నీ ఎప్పుడు వూడితే అప్పటికి నా ఆయుర్దాయం సరి నాయనా ' అన్నారట వారు .
అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ బ్రహ్మను అష్టావక్ర మహాముని సన్నిధికి తీసుకొనిపోతే , వారూ పై లెక్కలన్నీ చెప్పి , అటువంటి రోమశ మహామునులు ఒక్కొక్కరు గతించినప్పుడు , నా ఈ వంకరలు ఒక్కొక్కటీ సరిపడుతవి.ఈ విధంగా ఈ వంకరలన్నీ ఎప్పుడు తీరితే అప్పుడు నా ఆయుర్దాయం సరి అన్నారట వారు . అంతటితో బ్రహ్మ గర్వం గుభేలున కూలింది . ఇలాగే ఇంకా ఎన్నో కథలున్నవి . సరియైన జ్ఞానం కలిగితే , ఈ శరీరం ఎవరికి కావాలి? సదా నిర్మలంగా ఉండే తనకు ఈ మోత బరువెందుకు ? ” అని సెలవిచ్చారు
“ గురుకృప లేనిదే ఆ జ్ఞానం లభిస్తుందా ? జడునివలే ఉన్న రామునికి గురుబోధవల్లనే కదా తెలివి కలిగింది ? ' అన్నారా భక్తులు . “ ఆహా ! సందేహమేమి గురుకృప అత్యావశ్యకమే . అందుకే తాయుమానవరు గురువును పది పాటల్లో స్తుతించారు . మరొక పెద్దలు ‘ ఓ గురుదేవా ! నీ దృష్టి పడ్డమాత్రంచేతనే పులి పిల్లివలె అవుతుంది . పాము ఉడుతవలె అవుతుంది . దుష్టుడు సన్మార్గావలంబకు డౌతాడు . ఇంకా ఏదేది కాదు . ఒక్క నీ కటాక్షవీక్షణం వల్లనే అన్నీ చక్కనౌతవి , నీ మహిమ ఏమని వర్ణింతును ? ” అంటూ అలాగే పాడారు . గురుకృప అంటే సామాన్యమా ? ” అన్నారు భగవాన్ . విజయవాడ వారీ కథలన్నీ విని “ గురుకృప మాకెంతగా లభించిందో చూడండి . ఇన్ని కథలు చెప్పి భగవాన్ మా విచారం పోగొట్టారు ” అని ఎంతో సంతోషంతో పొంగిపోయినారు .
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment