రమణాశ్రమ లేఖలు 212 (9-1-49)
రమణాశ్రమ లేఖలు 212 (9-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/telegram-t.html
పూరీ పీఠాధిపతుల సమావేశం
వారం పదిరోజుల క్రిందట పూరీ శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు. శ్రీ భగవానులకూ వారికి జరిగిన సమావేశం అద్భుతంగా ఉంది.ఆ ఆచార్యుల వారు వస్తారని ముందే తెలిసి ఉండడంవల్ల సర్వాధికారి తగురీతిగా ఏర్పాట్లన్నీ చేయించారు భగవాన్ ఇప్పుడు పగలంతా జూబ్లీహాలులోనే ఉంటున్నారు కదా.ఆచార్యులవారు వచ్చిననాటి మధ్యాహ్నం భక్తులు భగవాన్ సోఫామీద వ్యాఘ్రాజినం పరచి యోగిరాట్ చక్రవర్తికి తగినట్లు అలంకరించారు. ఆ సోఫాకు ప్రక్కనే, ఆచార్యులవారికి ఉచితమైన ఆసనం వేసి ఉంచారు. మధ్యాహ్నం మూడు గంటలకు భగవాన్ బయటికి వెళ్ళివచ్చి, సోఫామీద కూర్చున్న వెంటనే, భక్తులందరూ యథాప్రకారం నమస్కరించి కూర్చున్నారు. ఆచార్యులవారు ఊరినుండి వచ్చి ఇక్కడ వేదపాఠశాలలో బసచేసి, పాదప్రక్షాళనలు తీర్చుకొని, శిష్యులు వెన్నంటి రాగా దండసహితులై భగవాన్ సన్నిధికి దయచేసారు.
వారు వచ్చేటప్పటికి భగవాన్ పద్మాసనస్థులై సహజమైన మౌనముద్రను ధరించి కర్చున్నారు. ఆచార్యులవారు దండసహితులై భగవానుని సమీపించి అభివందనం చేసారు. భగవాన్ ఆదరపూర్వకంగా శిరఃకంపనము చేసి, వారి నిమిత్తం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చోవలసిందని సంజ్ఞాపూర్వకంగా తెలియచేసారు. వారందు ఉపవిష్టులు కాక నేలపై కృష్ణాజినమున కూర్చుండి తదేకదృష్టితో భగవానుని చూసారు భగవానులూ చలనరహితమైన అనుగ్రహ దృష్టిని వారి వదనం మీద ప్రసరింపచేసారు, ఎవరి నోటా మాట లేదు. సభంతా గంభీర కాసారం వలె నిశ్శబ్దత వహించింది. దాదాపు ఒక అరగంట వరుకూ భక్తికీ అనుగ్రహానికి కల బాంధవ్యాన్ని తెలియజేస్తూ వారుభయులూ అలాగే ఉండిపోయారు. అప్పుడు శ్రీ భగవానుని ముఖమండలం భానుకోటి ప్రభాభాసురమై విరాజిల్ల జొచ్ఛింది ఆ తేజోవిశేషంవల్ల అమూల్యమైన ఈ సమావేశం చూడవచ్ఛిన భక్త బృందముల ముఖపద్మములు వికసించినవి. “ఆహా! ఏమి భగవానుని తేజో విశేషం"అన్న అమృతవాణి అందరి హృదయ తంత్రులలోనూ మేళవించింది. అందులో ఒకరు అప్రయత్నంగానే “ఆహా! ఇప్పుడెవరైనా ఫోటో తీస్తే బాగుండును". అన్నారు. ఆ మాటల ధ్వనికి మౌనం చెదిరిందా అన్నట్లు ఆచార్యుల వారు లేచి వందన పూర్వకంగా సెలవడిగి బసకు వెళ్లారు.
నిజంగా ఆ అపూర్వదృశ్యం చూస్తే సనకాదులను అనుగ్రహింప నవతరించిన దక్షిణామూర్తి ప్రాదుర్భావం స్ఫురణకు వచ్చింది. “వృదాశిష్యా గురుర్యువా" అన్నదానికి సామ్యంగా, ఆచార్యుల వారు కడుంగడు వృద్ధులు. వారి ముందు
భగవాన్ యువకుని వలెనే వున్నారు. అతిశయోక్తిగా భావిస్తావేమో కానీ ఇప్పుడా పదేశం కూడా అలాగే ఉంది. సోఫాకు కుడి ప్రక్కనున్న పూదోట నందనవనం గానూ, వెనుక ప్రక్కనున్న మామిడిచెట్లను దాటి కోటపలైవున్న అరుణాచలం
కైలాసపర్వతంగానూ, ఎడమ ప్రక్కన శాఖోపశాఖలతో విస్తీర్ణమైన బాదం చెట్టు మర్రి చెట్టుగానూ, ఎదుటనున్న ఖాళీ ప్రదేశం, వికసించిన ముఖపద్మములు గల భక్తులతో నిండి గంభీరకాసారంవలె ఉండడం వల్ల అదే మానససరోవరం గానూ తోచింది. “గురోస్తుమౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్చిన్న సంశయా? అన్నట్లు ఆచార్యులవారు ఆనాటికి ఏమీ ప్రశ్నించనేలేదు.
వారు ఇచ్చటికి వచ్చేముందు రాసిన ఉత్తరంలో “హరగౌరీ సంయోగే అవచ్చాయా యోగః” అన్న ఆగమ వాక్యాన్ని గురించిన తమ సంశయం రాసారట. ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకొనవచ్చునని ఆశ్రమంవారు భగవాన్ అభిప్రాయం తెలియ చేసారట. అందువల్ల మరుదినం తమ ఆ సంశయాన్ని గురించి ఆచార్యులవారు భగవానుని అడిగితే “ఏమున్నది? తెలిసిందే. వ్యాపారాత్మకమైన శక్తి (అనగా మనోవృత్తి)శుధ్ధమై,సద్వస్తువగు హరునితో చేరునపుడు వృత్తియందు ఆత్మయొక్క ఛాయ ఆవతరీల్లుటే అళఛ్ఛాయా యోగము" అని భగవాన్ సెలవిచ్చారు. నాకు అవగతము కాలేదు"అన్నారు పీఠాధిపతులు. భగవాన్ వారి వంక ఒక అరగంట సేపు దృష్టి ప్రసారం చేసారు వారికళ్ళు మూత పడినవి.అనిర్వచనీయమైన అనుభూతిని పొంది, ఆనంద భాష్పములు జారగా కరములు శిరమున ఘటించి " భగవాన్! ఇప్పుడు అవగతమైనది." అని నమస్కరించి,కుంభాభిషేకంనాటికి తిరిగి రాగలమని చెప్పి దక్షిణ యాత్రర్థం శిష్యసహితులై వెళ్ళారు వారు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment